Feb 23,2021 07:17

లక్నో : పెళ్లి పీటలమీద నుండి నేరుగా ఆస్పత్రికి వెళ్లి ఒక యువతికి రక్తదానం చేసింది ఒక కొత్త జంట. యుపిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను స్థానిక పోలీస్‌ ఆశిష్‌ మిశ్రా ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. రక్తం అవసరమయ్యే వారికి, రక్త దాతలకు మధ్య వారధిగా రూపొందించిన యాప్‌ ''పోలీస్‌ మిత్రా'' ద్వారా ఆ యువతికి ఈ సహాయం అందిందని అన్నారు. వివాహ దుస్తుల్లో ఉన్న వరుడు రక్తదానం చేస్తుండగా, పక్కనే వధువు నుంచుని ఉన్న ఫొటోను షేర్‌ చేయడంతో పాటు ''నా భారతదేశం చాలా గొప్పది'' అంటూ ఆయన ట్వీట్‌ చేశారు. వివాహమైన వెంటనే ఆ జంట నేరుగా ఆస్పత్రికి వచ్చారు. రక్తదానం చేసి యువతి ప్రాణాలను కాపాడారు అని మిశ్రా పేర్కొన్నారు . ఈ ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఒక యువతికి రక్తదాత అవసరం ఉందని.. కానీ ఆమె వేరొకరి బిడ్డ కావడంతో సహాయం చేసేందుకు ఎవరూ ముందుకి రాలేదని అన్నారు. కాగా, వారి సహాయాన్ని మెచ్చుకుంటూ పలువురు ప్రశంసలు కురిపించారు.