Oct 03,2021 12:27

    ఘు ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. వాళ్లది సాంప్రదాయ కుటుంబం. రఘు అమ్మ వనజాక్షి చాలా నియమాలు, పద్ధతులు కలిగిన వారు. కోడలు అంటే అణకువగా అత్త చెప్పు చేతుల్లో ఉండాలనేది ఆమె ఉద్దేశ్యం. ఎందుకంటే ఆవిడ అత్తగారు ఆమెని అలానే అదుపాజ్ఞలలో పెట్టారు. అందుకే కాబోలు కోడలు అత్తమామల ముందు మాట్లాడకూడదు. వారు కుర్చీలో కూర్చుంటే కోడలు కిందే కూర్చోవాలి. ఆధునిక దుస్తులు ధరించకూడదు. ఎప్పుడూ చీరలు మాత్రమే కట్టుకొని, అత్తమామల దగ్గర అణిగిమణిగి ఉండాలి.. అని ఒక చాదస్తపు నియమాన్ని ఒంటపట్టించుకున్నారు. అదే మూసలో ఆలోచిస్తూ తనకి కాబోయే కోడలు కోసం వెతకడం మొదలుపెట్టారు. రఘుకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఎన్ని సంబంధాలు చూసినా అబ్బాయికి అయితే అమ్మాయిలు నచ్చుతున్నారు గానీ వాళ్ల అమ్మగారికి మాత్రం నచ్చడం లేదు. ఏదో వంక చెబుతూ వచ్చిన సంబంధాలన్నీ తిరస్కరిస్తూ ఉండేది వనజాక్షి. ఆవిడ సమస్య ఒక్కటే... బాగా చదువుకున్న ఆడపిల్ల అయితే కొడుకుని తన నుంచి దూరం చేస్తుందని, ఆధునిక దుస్తులు (జీన్స్‌, మోడల్‌ డ్రెస్‌) వేసుకున్న అమ్మాయిలు అత్తమామలకి సేవలు చెయ్యరనేది ఆవిడ అపోహ. అందుకనే ఎంత అందంగా ఉన్నా, ఎంత బాగా చదువుకున్నా ఏదో వంక చెప్పి సంబంధాన్ని తిరస్కరించేది.
ఇదిలా ఉండగా రఘు వాళ్ల ఆఫీస్‌లో శృతి అనే అమ్మాయి అతనిని చాలా రోజుల నుంచి ఇష్టపడుతూ ఉంటుంది. శృతి అనాథ! చిన్నప్పుడే కారు యాక్సిడెంట్లో తల్లిదండ్రులిద్దర్నీ పోగొట్టుకుంది. అప్పటి నుంచి ఒక మిషనరీ అనాథాశ్రమంలో పెరిగి పెద్దదైంది. ఆ ఆశ్రమంలో సిస్టర్‌ మేరీ హెడ్డుగా ఉండేవారు. ఆవిడ చిన్నప్పటి నుంచి శృతిని కన్నబిడ్డలా చూసుకునేవారు. శృతి మంచి నడవడిక, తెలివితేటలు కలిగిన చలాకీ పిల్ల కనుక బాగా చదువుకొని, తనకు దొరికిన అవకాశాలను ఉపయోగించుకొని ఒక మంచి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ఉద్యోగం తెచ్చుకుంది. రఘుకి చిన్నప్పట్నుంచి కాస్త బిడియం ఎక్కువ. అమ్మాయిలను అస్సలు చూడడు.. మాట్లాడడు. కానీ చూసిన మొదటిరోజే శృతి రఘుకి నచ్చింది.
   శృతి ఆఫీసులో చేరినప్పటి నుంచి రఘు ప్రవర్తన, మంచితనాన్ని చూసి అతనిని ప్రేమించడం మొదలెట్టింది. ఏదో ఒకరోజు తన మనసులోని ప్రేమను రఘుకు చెప్పాలని అనుకుంటుంది శృతి. కానీ రఘు తిరస్కరిస్తాడేమో అన్న భయంతో చెప్పలేక ఆగిపోతుంది. రఘుకి, శృతి మీద మంచి అభిప్రాయమే ఉంది. శృతి అందం, తెలివితేటలకి ఇష్టపడని మగవారు ఎవరూ ఉండరు అంటే అతిశయోక్తి కాదు. అలాంటి అందం ఆమెది. అదే ఆఫీసులో పనిచేస్తున్న చాలామంది అబ్బాయిలు ఆమెని పెళ్లి చేసుకుంటామని చాలాసార్లు అడిగారు. కానీ ఆమె మనసులో రఘు ఉండటంతో తను ఎవరినీ అంగీకరించేది కాదు. అక్కడ చూస్తే ఇంటి పరిస్థితులు కారణంగా తన తల్లి మనస్తత్వం తెలిసిన రఘు శృతి అంటే ఇష్టమున్నా తన ప్రేమని తెలపలేకపోయేవాడు. ఒకరోజు రఘుకి పెళ్లిచూపులు చూస్తున్నారని శృతికి తెలిసింది. ఇక ఆలస్యం చేస్తే రఘు దక్కడనే అభిప్రాయంతో తన మనసులోని మాట రఘుతో చెబుతుంది. ప్రేమిస్తున్నానని శృతి చెప్పిన వెంటనే రఘు, శృతితో తన మనసులో మాట చెప్తాడు.
   'నువ్వు వచ్చిన మొదటి రోజే నాకు చాలా బాగా నచ్చావు శృతి. నీ టాలెంట్‌ చూసిన తర్వాత ఇంకా బాగా నచ్చేశావు. ఒకే ప్రాజెక్టులో కలిసి చేస్తున్నా ఎప్పుడూ నీతో ఒక్కమాటైనా మాట్లాడలేదు. ఎందుకో తెలుసా? నిన్ను ప్రేమించి, నా జీవితంలో నీకు చోటిస్తే.. అది నేను నీకు అన్యాయం చేసినట్టే అవుతానని చెప్పాడు.'
రఘు మాటలు విన్న శృతి ఆశ్చర్యపోయింది.
'అదేంటి రఘు.. ప్రేమించినప్పుడు జీవితంలో స్థానం ఇవ్వడానికి నీకేంటి అభ్యంతరం?' అని అడిగింది శృతి.
'శృతి నీకు తెలీదు.. మా అమ్మవన్నీ పాతకాలం పద్ధతులు. ఆడపిల్లలు జీన్స్‌ వేసుకున్నా, ఫ్యాషన్‌గా తయారైనా, ఉద్యోగాలు చేసినా ఆవిడకి నచ్చరు. ఇప్పటికి ఎన్నో సంబంధాలు ఇవే కారణాలు చెప్పి, క్యాన్సిల్‌ చేశారు' అని తన ఆవేదన శృతితో పంచుకున్నాడు రఘు.
'నీ సమస్య ఇదే అయితే, నా దగ్గర పరిష్కారం ఉంది రఘు. నాకు నువ్వు కావాలి! నా జీవితంలో తల్లిదండ్రులను కోల్పోయాను. నన్ను సిస్టర్‌ మేరీయే పెంచారు. నిన్ను చూసిన మొదటిరోజే నాకెందుకో నీలో నాకు కోల్పోయిన ప్రేమ దొరుకుతుందని ఆశ ఏర్పడింది. అందరబ్బాయిల్లాగా అమ్మాయిలని చూసి వెంటపడవు. నీ పనేదో నువ్వు చూసుకుంటావు. నువ్వు మహిళలకు ఇచ్చే మర్యాద నీ తల్లిదండ్రులు నేర్పించిన సంస్కారం నన్ను నీకు కట్టి పడేశాయి. నీకు, మీ తల్లిదండ్రులకు నచ్చే విధంగా ఉంటాను. మీ అమ్మగారికి నేను చేసే ఉద్యోగం, నా వస్త్రధారణ అభ్యంతరమైతే నీకోసం వాటన్నింటినీ వదులుకొని వస్తాను' అంది శృతి.
తనకు నచ్చిన అమ్మాయి తన జీవిత భాగస్వామిగా వస్తానంటే అంతకన్నా ఇంకేం కావాలి? తన తల్లిదండ్రులను, వాళ్ల అభిప్రాయాలను గౌరవిస్తాను అంటే జీవితంలో కావాల్సింది ఏముంది? శృతి మాటలకి చాలా సంతోషించాడు రఘు.
రఘు ఇంటికి వెళ్లాక 'నాతో పాటు ఉద్యోగం చేస్తున్న అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. ఒక్కసారి తనని చూడు. నీకు తప్పకుండా నచ్చుతుంది. ఆ అమ్మాయికి నేనంటే చాలా ఇష్టం. మన సాంప్రదాయాలకి, కట్టుబాట్లకి తగ్గ పిల్ల. ఒక్కసారి నువ్వు చూస్తే నీకే తెలుస్తుంది' అని వాళ్లమ్మతో చెప్పాడు రఘు.
శృతి కూడా సిస్టర్‌ మేరీకి రఘు విషయం చెప్తుంది. 'మీ బ్లెస్సింగ్స్‌ కావాలి. మీరు ఒప్పుకుంటే ఇద్దరం పెళ్లి చేసుకుంటాం. కాకపోతే చిన్న ప్రాబ్లం సిస్టర్‌' అనగానే.. 'ఏంటి శృతి?' అని అడుగుతుంది సిస్టర్‌.
'రఘు అమ్మగారు సాంప్రదాయాలు, కట్టుబాట్లు కలిగిన మనిషి. ఆవిడకి కోడలు ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. పెళ్లి చేసుకుంటే నేను ఈ ఉద్యోగాన్ని మానేయాలి. ఆ ఇంట్లో ఉంటూ వారి సేవ చేసుకుంటూ నా జీవితాన్ని ఒక కొత్త మలుపు తిప్పుకోవాలి సిస్టర్‌!' అని చెప్పింది.
ఆ మాటలు విన్న సిస్టర్‌కి అవి నచ్చలేదు. 'శృతి! ఏ రోజుల్లో ఉన్నావు నువ్వు? ఆడపిల్లలు వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడాలి. కట్టుకున్న భర్త వల్ల ఇబ్బందులు వస్తుంటే.. అన్ని ప్రయత్నాలూ చేసి, విడిగా వచ్చి బతుకుతున్న రోజులివి. అలాంటిది నీకు తల్లిదండ్రుల తోడు లేదు. నీకు ఆధారమైన ఈ ఉద్యోగాన్నీ వదులుకొని, రఘు కోసం నీ జీవితాన్ని ఫణంగా పెడతావా? మతిగానీ పోయిందా?' అని సిస్టర్‌ మందలించింది.
'ఏమో సిస్టర్‌ నేను అవన్నీ ఆలోచించలేదు. రఘు నాకు తోడు ఉంటే నా జీవితం అంతా హాయిగా ఉంటుందనిపిస్తుంది. ఏదో తెలియని భరోసా. రఘు కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది' అని అంది శృతి.
'ప్రేమ గుడ్డిది శృతి. ప్రేమలో మునిగిపోతే కళ్ల ముందు నిజాలు కనిపించవు. నీ ఇష్టం శృతి. కానీ నీకు నేను కన్నతల్లిని కాకపోయినా ఇన్నేళ్లూ కళ్లల్లో పెట్టుకుని పెంచిన అమ్మను. నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. అదే నేను కోరుకుంటున్నా' అంది సిస్టర్‌.
ఇక శృతిని వాళ్లమ్మకు చూపించాలని రఘు అనుకుంటాడు. అందుకనే చీర కట్టుకొని లక్షణంగా తయారై, వాళ్ల ఇంటికి రమ్మని ఆమెకి చెబుతాడు. రఘు చెప్పినట్టే శృతి చీర కట్టుకొని, ముస్తాబై రఘు ఇంటికి వెళ్తుంది. శృతిని చూసిన వనజాక్షి 'పిల్ల బానే ఉంది. వంటావార్పు ఏమైనా వచ్చా?' అని అడుగుతుంది. ఆ మాటలకు శృతి 'కొద్దిగా తెలుసు ఆంటీ! అంటే ఇప్పటివరకూ అనాథాశ్రమంలో ఆయమ్మ చేసి పెట్టేది. అందుకే నేర్చుకోలేదు. ఇప్పుడు నేర్చుకుంటాను!' అనగానే.. 'అనాథాశ్రమంలో ఉండడం ఏంటి? నీకు తల్లిదండ్రులు లేరా?' అని అడుగుతుంది వనజాక్షి.
'అంటే అది.. అంటూ శృతి నానుస్తూ.. 'మీకు రఘు చెప్పలేదా?' అని అడుగుతుంది. 'రఘు నాకేమీ చెప్పలేదే.. అంటే నీకు తల్లిదండ్రులు లేరా?' అని అడుగుతుంది వనజాక్షి.
'లేరు ఆంటీ! చిన్నప్పుడే అమ్మానాన్న యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పటి నుంచి నేను అనాథాశ్రమంలోని సిస్టర్‌ మేరీ దగ్గర పెరిగాను' అని చెప్తుంది.
'చర్చిలో పెరిగావా? నీకు పూజా పునస్కారాలు వచ్చా? అసలు మా దేవుడిని పూజిస్తావా?' అంటూ వనజాక్షి ప్రశ్నలతో శృతిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.
'నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఏసుప్రభుని ప్రార్థించాను. అంటే భగవంతుడు రూపాలు వేరైనా సర్వాంతర్యామి కదా ఆంటీ! అయినా సరే నేను రఘు కోసం నా అలవాట్లు, పద్ధతులు మార్చుకుంటాను' అని చెప్పింది.
రఘు వాళ్ల అమ్మ వనజాక్షి అక్కడి నుంచి లేచి, లోపలికి వెళ్లిపోయింది. రఘు తండ్రి ఆనందరావు మంచివాడు. అతనికి అమ్మాయి నచ్చింది. తను పెరిగిన వాతావరణ పద్ధతులన్నీ రఘు కోసం వదులుకొని, తన వ్యక్తిత్వాన్ని మర్చిపోయి, చేస్తున్న ఉద్యోగం మానుకొని వస్తాను అని చెప్పిన శృతి మాటల్లో రఘు మీద ఆమెకున్న ప్రేమను చూసి మురిసిపోయాడు. ఇలాంటి అమ్మాయి నా కొడుక్కి జీవిత భాగస్వామి అయితే వాడి జీవితం సంతోషంగా ఉంటుందని అనుకున్నాడు.
శృతి కూడా అక్కడి నుంచి వెళ్లిపోయింది.
రెండు రోజులు అయినా శృతికి ఏ విషయమూ చెప్పలేదు రఘు. ఆఫీస్‌కీ రావడం లేదు. ఫోన్‌ చేస్తుంటే లిఫ్ట్‌ చేయట్లేదు. ఏమైందో అని ఒకపక్క కంగారు. మరోపక్క ఇంటికి వెళితే రఘు అమ్మగారు ఏమంటారో అనే భయంతో సతమతమవుతూ వెళ్లలేకపోయింది శృతి.
రఘు వాళ్ల అమ్మగారికి శృతి నచ్చలేదు. కానీ రఘు తండ్రి ఆనందరావు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. 'ఆ అమ్మాయికి ఎవరూ లేరు. మనం ఎలా చెప్తే అలా వింటుంది. మన ఇంట్లో కూతురిలా మన కళ్ల ముందే మన కొడుకుతో పాటు ఉంటుంది. నీకు వచ్చే భయమేమీ లేదు. తను రఘుని ఎంతగానో ప్రేమిస్తుంది. మన వాడికోసమైనా కొంచెం ఆలోచించు. వాడు ప్రేమించిన అమ్మాయి కోసం వాడు మనల్ని వదిలి వెళ్లిపోతే నువ్వు ఉండగలవా?' అని అడిగాడు.
అయినా వనజాక్షి ససేమిరా ఒప్పుకోలేదు. 'ఎవరికి పుట్టిందో.. ఏ కులమో? చర్చిలో పెరిగి పెద్దదయ్యింది అంట! పెళ్లి అయ్యే వరకే మాట వింటారు. పెళ్లి చేసుకున్నాక మారిపోతే, నా కొడుకుని మార్చేసి నాకు దూరం చేస్తే? అప్పుడు చేసేది ఏమీ లేదు' అంటూ కోపంగా ఇంటి నుంచి బయటికి వెళ్లి పోయింది.
'అమ్మా... ప్లీజ్‌ అమ్మా!' అంటూ వెనకే రఘు పరిగెత్తాడు.
'మీ అమ్మకి కోపం వస్తే కాసేపు గుడికి వెళ్లి, కూర్చుని వస్తుంది. ఏం కాదులే!' అన్నాడు ఆనందరావు.
రఘు ఇంట్లో పరిస్థితి ఇలా ఉంటే, రెండు రోజుల నుంచి రఘు ఫోన్‌ ఎత్తకపోవడంతో ధైర్యం తెచ్చుకొని శృతి.. విషయం తెలుసుకోవడానికి రఘు ఇంటికి వచ్చింది.
కొడుకు బాధ చూడలేక ఆనందరావు ఒక నిర్ణయానికి వచ్చి, రఘుతో ఇలా చెప్పాడు. 'రఘు! తల్లిదండ్రుల్ని గౌరవించాలి, ప్రేమించాలి. అది మన సంస్కారం. కట్టుబాట్లు అని మన శాస్త్రాలు, గ్రంథాలలో చెప్పారు. చిన్నప్పటి నుంచి కని, పెంచిన తల్లిదండ్రులను గౌరవిస్తే రేపొద్దున మన బిడ్డలు మనల్ని గౌరవిస్తారు. కానీ మన కోసం ప్రాణం ఇచ్చే మనిషి దొరికినప్పుడు, ఆ తల్లిదండ్రులు ఆ ప్రేమను అర్థం చేసుకోలేనప్పుడు.. నీ కోసం వచ్చిన అమ్మాయి చెయ్యి వదిలి పెట్టకూడదు. అలా వదిలి పెడితే అది మహా పాపం. మీ అమ్మకు నేను ఉన్నాను. మీ చెల్లి కూడా ఉంది. కానీ శృతీకి ఎవరూ లేరు. అన్నీ నువ్వేనని నీ మీద ఆశలు పెట్టుకుంది. ఈ రోజు కాకపోతే రేపు మీ అమ్మ అర్థం చేసుకుంటుంది. అర్థం చేసుకోకపోతే చస్తుందా? కానీ నువ్వు దక్కకపోతే శృతి ఏమైపోతుందో?! అందుకే నా మాట విని మీ అమ్మ వచ్చేలోపే నువ్వు ఇంట్లోంచి వెళ్లిపో! శృతిని పెళ్లి చేసుకొని, హాయిగా ఉండు. మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటాను' అని చెప్పాడు.
ఈ లోపు కాలింగ్‌ బెల్‌ మోగింది. వనజాక్షి తిరిగి వచ్చిందేమో అని కంగారుపడ్డారు. మెల్లగా రఘు వెళ్లి తలుపు తీశాడు. ఎదురుగా శృతిని చూసిన రఘు ఏం మాట్లాడాలో తెలియక నిశ్శబ్దంగా నిలబడిపోయాడు. ఆనందరావు శృతిని చూసి నవ్వుతూ 'రా అమ్మ!' అని ఆహ్వానించాడు. ఇంటిలో వనజాక్షి ఉంటే గొడవ చేస్తుందేమో అని భయంతో బిక్కు బిక్కుమంటూ... అటూ ఇటూ చూస్తూ శృతి లోపలికి అడుగుపెట్టింది. 'మరేం భయం లేదమ్మా ఇంట్లో మీ అత్తగారు లేరు!' అన్నాడు ఆనందరావు. 'ఇంకేం శృతి కూడా వచ్చేసింది. ఇద్దరూ వెళ్లి, హాయిగా పెళ్లి చేసుకోండి' అని చెబుతాడు. అందుకు శృతి 'అంకుల్‌ చిన్నప్పటి నుంచి రఘుని ఆంటీ ఎంత ప్రేమగా పెంచిందో మీకు తెలియదా? అలా పారిపోయి, పెళ్లి చేసుకునే పనైతే.. ఇన్ని రోజులూ రఘు ఆంటీ చూపించిన సంబంధాలన్నింటికీ వెళే ్లవాడే కాదు. మీ దీవెనలతో పెళ్లి చేసుకోవాలని నన్ను ప్రేమిస్తున్నా.. ఆ మాట చెప్పకుండా తన మనసులోనే దాచిపెట్టుకున్నాడు. నేను నా ప్రేమ విషయం చెప్పినప్పుడు 'మా అమ్మకు ఆచార వ్యవహారాలు ఎక్కువ.. నిన్ను చేసుకొని ఆమెని బాధ పెట్టలేను' అని అన్నాడు. రఘు మీద ప్రేమతో నా ఆచార వ్యవహారాలన్నీ మార్చుకుంటాను అని చెప్పాను. తల్లిదండ్రుల విలువేంటో తల్లిదండ్రులు లేని నాకు బాగా తెలుసు అంకుల్‌. మీ కుటుంబాన్ని నా కుటుంబంగా చేసుకొని, అందరం సంతోషంగా ఉండాలని ఎంతో ఆశ పడుతున్నాను. ఆంటీని బాధపెట్టి, మేము పెళ్లి చేసుకున్నా సంతోషంగా ఉండలేము. మాకు మీ దీవెనలు కావాలి గానీ, శాపాలు కాదు. అని కన్నీరు పెట్టుకుంది' శృతి.
అప్పుడే బయట నుంచి వచ్చిన వనజాక్షి తలుపు చాటు నుంచి శృతి మాటలు విని, కన్నీళ్లు పెట్టుకోవడం చూసి కరిగిపోయింది. 'నా కొడుకు నా కోసం తన ఇష్టాలను త్యాగం చేసినప్పుడు.. నా కొడుకు కోసం నేనూ నా పద్ధతులను మార్చుకోలేనా?' అని అంటూ.. 'లోకమే మారిపోయింది. చాదస్తాలతో పిల్లల మనసులను బాధపెట్టడం మూర్ఖత్వం..!' అంటూ శృతి దగ్గరికి వెళ్లి ఆమెని దగ్గరికి తీసుకొని, 'నన్ను క్షమించు అమ్మా! నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. సమాజంలో జరుగుతున్న దారుణాలను చూసి, నా కోడలూ నన్ను నా కొడుక్కి దూరం చేస్తుందనే భ్రమలో అలా ప్రవర్తించానే తప్ప.. మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. మీ ఇద్దరూ నన్ను క్షమించండి. నేనే మీకు దగ్గరుండి పెళ్లి చేస్తాను!' అంటూ ఇద్దరినీ దగ్గరికి తీసుకుని, దీవించింది.
తల్లిలోని మార్పును చూసి రఘు చాలా సంతోషించాడు. తమ ప్రేమకు అంగీకారం తెలిపినందుకు శృతి సంతోషంతో వనజాక్షి కాళ్లకు నమస్కరించి, కృతజ్ఞతలు తెలిపింది.
శృతిని పైకి లేపి 'నా కొడుకు కోసం నీ పద్ధతులు మార్చుకుంటాను అని చెప్పినప్పుడే నీ ప్రేమ ముందు నా ప్రేమ ఓడిపోయింది. ఎవరి కోసం నువ్వు నీ వ్యక్తిత్వాన్ని చంపుకోవాల్సిన పని లేదు. నీకు నచ్చినట్టు ఉండు. నీ ఉద్యోగాన్ని నువ్వు చేసుకో. నాకూ ఒక ఆడపిల్ల ఉంది. రేపు పొద్దున్న నా బిడ్డకి ఇవే కష్టాలు వస్తే అది ఎంత తల్లడిల్లిపోతుందో ఆలోచిస్తే అర్థమైంది. అజ్ఞానంతో మీ అందర్నీ బాధపెట్టాను. అదేవిధంగా నీకు నచ్చిన దేవుడిని నువ్వు పూజించుకో! నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కాలంతో పాటు మనుషులు మారాలి. తరాల అంతరాలను మార్చుకోవడమే ఆధునికత' అని తెలుసుకున్నాను అని అంది వనజాక్షి.
శృతికి, రఘుకి అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. అలా శృతికి కోరుకున్న జీవితం పెళ్లి కానుకగా లభించింది.

జ్యోతి మువ్వల
90080 83344