Jan 15,2022 12:30

మంగళగిరి (గుంటూరు) : మంగళగిరి పట్టణంలోని రాజీవ్‌ సెంటర్‌ వద్ద ఉన్న ఓ టింబర్‌ డిపోలో పేకాట స్థావరం పై అర్బన్‌ సిఐ అంకమ్మరావు ఆధ్వర్యంలో శుక్రవారం అర్ధరాత్రి దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 15 మంది పేకాట ఆడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో 13 మందిని అరెస్ట్‌ చేయగా ఇద్దరు పరారీలో ఉన్నట్లు సిఐ అంకమ్మరావు తెలిపారు. వీరి వద్ద నుండి లక్షా అరవై తొమ్మిది వేల 380 రూపాయల నగదు, సెల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్‌ అయిన వారిలో ప్రముఖ వ్యక్తి ఉన్నట్లు సమాచారం. సంక్రాంతి నేపథ్యంలో కోడి పందేలు పేకాట స్థావరాలపై పోలీసులు నిఘా పెట్టి వరుస దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడులు శని ఆదివారాల్లో కూడా కొనసాగుతాయని సిఐ అంకమ రావు స్పష్టం చేశారు. జూదం అనే వ్యసనాన్ని విడనాడి కుటుంబ సభ్యులతో కలిసి పండుగను జరుపుకోవాలని సిఐ సూచించారు.