Oct 28,2021 19:30

పేదల భూములు శారదా పీఠానికి దారాదత్తం

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : కాకుల్ని కొట్టి గెద్దలకు ఆహారంగా వేశాడట వెనుకటి ఓ దారుణమైన దాణకర్ణుడు. అచ్చం అలాగే ఉంది మన ప్రభుత్వం తీరు. సెంటు భూమిలేక కొండవాలు ప్రాంతాన్ని సాగులోకి తెచ్చి, ఆ ఒక్కటే జీవనాధారంగా వెల్లదీస్తున్న పేదల భూమిని చినముషిడివాడ శారదాపీఠానికి దారాదత్తం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం తీర్మానించింది. దీంతో, 19కుటుంబాల వారు జీవనోపాధి కోల్పోనున్నారు. విశాఖనగర పరిధిలోని చినముషిడివాడలో శారదాపీఠం తమకు కొంత భూమి కావాలంటూ కొన్నాళ్ల క్రితం ప్రభుత్వాన్ని కోరింది. అడిగిందే తడువుగా విశాఖ - విజయనగరం జిల్లాల సరిహద్దుల్లో స్థలం గుర్తింపులో నిమగమైన అధికార యంత్రాంగం భోగాపురం మండలం కౌలువాడ రెవెన్యూ సర్వే నెంబర్‌ 158, అదే మండలం కంచేరు రెవెన్యూ సర్వే నెంబర్‌ 1, కొత్తవలస మండలం దెందేరు రెవెన్యూ సర్వే నెంబర్‌ 48లోనూ 15ఎకరాల చొప్పున స్థలాలను గుర్తించారు. ఇందులో విశాఖనగరానికి, శారదాపీఠానికి అతి సమీపంలోవున్న దెందేరులోని ఆయుదాలమెట్టపై ఆసక్తి చూపింది. సుమారు 70ఎకరాల్లో విస్తరించివున్న ప్రభుత్వ బంజరు భూమిలో 19మంది రైతులను ఖాళీచేయించి, 15ఎకరాలను అప్పనంగా కట్టబెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ఇది ప్రభుత్వ బంజరు భూమి అయినప్పటికీ రెండు దశాబ్ధాలుగా సాగుదారులు ప్రభుత్వానికి శిస్తు చెల్లిస్తున్నారు. తమకు పట్టాలివ్వాలని కోరుతూ ప్రభుత్వానికి ఎన్నోసార్లు విన్నవించుకున్నారు. తాజాగా ప్రభుత్వం శారదాపీఠానికి కట్టబెడుతూ నిర్ణయం తీసుకోవడంతో రైతులు కంటతడిపెడుతున్నారు. ఆందోళనకు, న్యాయపోరాటానికి సిద్ధమౌతున్నారు. ఇదే మండలంలోని చినరావుపల్లి, పెదరావుపల్లి రెవెన్యూల పరిధిలో సుమారు 172.57ఎకరాల భూమిని గతంలో టిడిపి ప్రభుత్వం ఫుడ్‌పార్కు పేరిట పంతంజలి సంస్థకు కారుచౌకగా కేటాయించిన విషయం విధితమే. దీంతో, పాలకపార్టీలు పేదల పొట్టకొట్టి, ధనవంతులకు దారాదత్తం చేస్తున్నాయని జనం చర్చించుకుంటున్నారు.