Oct 27,2021 09:17
  • అన్‌ ఎయిడెడ్‌గా మారిన పాఠశాలల పిల్లల చదువులు ప్రశ్నార్థకం
  • ఈ విద్యా సంవత్సరం వరకు కొనసాగింపుపై ఇవ్వని స్పష్టత
  • ఆందోళనలో తల్లిదండ్రులు, విద్యార్థులు

ప్రజాశక్తి- విశాఖపట్నం ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ఎయిడెడ్‌ విద్యాసంస్థల విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైంది. సమ్మతి తెలిపిన ఎయిడెడ్‌ పాఠశాలల ఉపాధ్యాయులను ప్రభుత్వ పాఠశాలల్లో సర్దుబాటు చేసే, విద్యార్థులను సమీప పాఠశాలలకు పంపే ప్రక్రియ నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని జిల్లా విద్యా శాఖాధికారులపై విద్యాశాఖ ఒత్తిడి పెంచుతోంది. ఉపాధ్యాయుల సర్దుబాటు సకాలంలో పూర్తయినా ఎయిడెడ్‌ పాఠశాలల్లోని విద్యార్థులను ఇతర ప్రభుత్వ పాఠశాలల్లో గడువులోగా చేర్పించే అవకాశం లేకపోవడంతో విద్యాశాఖాధికారులు తలలు పట్టుకుంటున్నారు. విశాఖ జిల్లాలో 89 ఎయిడెడ్‌ పాఠశాలల్లో 62 పాఠశాలల యాజమాన్యాలు తమ పాఠశాలల ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బందిని ప్రభుత్వానికి అప్పగించడానికి అంగీకరించాయి. పాడేరు ఏజెన్సీలోని తొమ్మిది ప్రాథమిక పాఠశాలల యాజమాన్యాలు ఆస్తులతో పాఠశాల అప్పగించడానికి ముందుకొచ్చాయి. ఉపాధ్యాయులను ప్రభుత్వానికి అప్పగించడానికి సమ్మతించిన పాఠశాలలు అన్‌ ఎయిడెడ్‌గా మారాయి. వీటిలో చదువుతున్న 9,607 ఇప్పుడు ఈ పాఠశాలల్లో చదువు కొనసాగించాలనుకుంటే ఫీజులు చెల్లించాలి. లేకపోతే ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లాల్సి ఉంటుంది. విద్యా సంవత్సరం మధ్యలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఎయిడెడ్‌ పాఠశాలల విద్యార్థులందరినీ చేర్చుకొనే పరిస్థితి ప్రభుత్వ పాఠశాలల్లో లేవు. పాఠశాలలను మ్యాపింగ్‌ చేయాలని ఆదేశించిన విద్యా శాఖ, ఎయిడెడ్‌ పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించ కలిగినంత వసతి లేకపోతే వారినేం చేయాలనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని ఎయిడెడ్‌ పాఠశాలల విద్యార్థులంతా పేద వర్గాలకు చెందిన వారు కావడంతో ఫీజులు కట్టి చదివించుకోలేక తమ పిల్లలను బడిమాన్పించే పరిస్థితి ఎదురు కానుంది. బాలికలు దూరంగా ఉన్న పాఠశాలలకు వెళ్లలేక మధ్యలోనే వారి చదువు నిలిచిపోనుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల్లేకపోతే, సమ్మతి తెలిపిన ఎయిడెడ్‌ పాఠశాలల్లోనే ఈ విద్యా సంవత్సరం వరకు పిల్లలు కొనసాగేలా యాజమాన్యాల అంగీకారం తీసుకుంటున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. కానీ, అందుకు అన్‌ ఎయిడ్‌గా మారిన పాఠశాలల యాజమాన్యాలు అంగీకరించడం లేదు. ఈ ఏడాది నుంచి పిల్లల నుంచి ఫీజులు వసూలు చేసేందుకు యాజమాన్యాలు ప్రయత్నిస్తున్నాయి. తల్లిదండ్రుల అంగీకారంతో ఈ నెల 31లోగా పాఠశాలల మ్యాపింగ్‌ పూర్తి చేసి, ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో చేర్పించాలని పాఠశాల విద్యా శాఖ ఈ నెల 18న ఉత్తర్వులు జారీ చేసింది. ఎయిడెడ్‌ ఉపాధ్యాయులకు వచ్చే నెల ఆరున పాఠశాలలను కేటాయించి, ఏడున ఆ పాఠశాలల్లో రిపోర్టింగ్‌ ఇవ్వాలని పేర్కొంది. విద్యార్ధులను ఈ నెల 31లోగా ఇతర పాఠశాలల్లో సర్దుబాటు చేసే పరిస్థితి లేకపోతే వారి పరిస్థితి ఏంటని మాత్రం చెప్పలేదు. పాఠశాలను కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ విశాఖ నగరంలోని జ్ఞానాపురంలోగల సేక్రెడ్‌ హార్ట్‌ ఎయిడెడ్‌ బాలికోన్నత పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు సోమవారం పెద్ద ఎత్తున ఆందోళన దిగిన సంగతి తెలిసిందే.

                                                             సహేతుకం కాదు

పిల్లలకు సమీపంలో పాఠశాలలు ఉండాలని విద్యా హక్కు చట్టం చెబుతోంది. ఎన్నో రకాల సహాయ పథకాలు ప్రభుత్వం పెడుతూ ఎయిడెడ్‌ పాఠశాలలకు ఎయిడ్‌ను తొలగించడం సహేతుకం కాదు. పాఠశాలలు ఎక్కువగా ఉండాలి. వీలైనున్న ఎక్కువగా పాఠశాలలను పెట్టడానికి ప్రయత్నం చేయాలిగానీ, ఉన్న పాఠశాలలను ఎత్తివేయాలనుకోవడం సరికాదు.
                                                                      -మాడభూషి శ్రీధర్‌, కేంద్ర సమాచార మాజీ కమిషనర్‌

1