Nov 30,2020 23:23

మృతుడు సత్యనారాయణ (ఫైల్‌)

ప్రజాశక్తి - అమృతలూరు : చేతికొచ్చిన పంట నీటి పాలవడంతో తట్టుకోలేని కౌలురైతు పొలం వద్దే ప్రాణం విడిచాడు. గుంటూరు జిల్లా అమృతలూరు మండలం కూడిపూడిలో ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు పి.సత్యన్నారాయణ (54) మూడున్న ఎకరాలను కౌలుకు తీసుకుని వరి సాగు చేశాడు. భవన నిర్మాణ పనిలో వచ్చిన కూలిపనులతోపాటు కొంత అప్పుడు చేసి పెట్టుబడి పెట్టాడు. పంటకూడా బాగా పండిందని భావిస్తున్న తరుణంలో నివర్‌ తుపాను తీవ్రంగా దెబ్బతీసింది. వర్షానికి పొలం మొత్తం చాపలాగ పడిపోవడంతో పొలం వద్దకు ఆదివారం ఉదయం వెళ్లి చూసిన సత్యనారాయణ అక్కడే కుప్పకూలిపోయాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉండగా ఒక కుమారుడు గతంలోనే మృతి చెందాడు.