Mar 02,2021 23:28

సమావేశంలో మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ పూర్ణచంద్రప్రసాద్‌

ప్రజాశక్తి-అన్నవరం 'తమ జీవన ఆధారంగా సాగిస్తున్న పౌరోహిత్యాన్ని వృత్తిగా గుర్తింపునివ్వాలని బ్రాహ్మణ సమాఖ్య విజ్ఞప్తి చేసింది.' మంగళవారం స్థానిక ర్గాఘవేంద్ర రెసిడెన్సీలో ఎపి పురోహిత బ్రాహ్మణ సమాఖ్య ప్రథమ వార్షికోత్సవం బ్రహ్మయజ్ఞం అన్నవరం వ్రతపురో హిత సంఘం ఆధ్వర్యంలో సమావేశం ఘనంగా జరిగింది. దీనికి ప్రత్తిపాడు ఎంఎల్‌ఎ పర్వత పూర్ణచంద్రప్రసాద్‌ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈసందర్భంగా సమాఖ్య ప్రతినిధులు మాట్లాడుతూ పురోహితులకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు గానీ, సబ్సిడీలు గానీ, పింఛను సదుపాయాలు గానీ లేవని వాపోయారు. అర్దాకలితో దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్న పురోహితుల జీవితాల్లో మార్పు తేవాలన్నారు. ఇళ్లస్థలాలు, ఆరోగ్య బీమా, బ్రాహ్మణ కార్పొరేషన్‌కు నిధులు కేటాయించాలని కోరారు. అనంతరం ఎంఎల్‌ఎ మాట్లాడుతూ పురోహితుల ఆర్థికపరమైన, సామాజికమైన అభివృద్ధికి తన సహాయ సహకారాలు ఉంటాయన్నారు. ప్రభుత్వం ద్వారా సమకూరే అన్ని పథకాలు వారికి అందేలా తన వంతు సహాయం ఎల్లవేళలా వుంటాయన్నారు. ఈకార్యక్రమంలో ఎపి పురోహిత, బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్షులు, కార్యదర్శులు 13 జిల్లాల ప్రతినిధులు, ప్రముఖ ప్రవచనకర్త మైలవరపు శ్రీనివాసరావు, దేవస్థానం విశ్రాంత పురోహితులు పాలంకి పట్టాభి, వ్రతపురోహిత సంఘం గౌరవ సలహాదారు నాగాభట్ల కామేశ్వరశర్మ, అధ్యక్షుడు రవి, రాష్ట్ర బ్రాహ్మణ అధ్యక్షుడు యామిజాల నరసింహమూర్తి పాల్గొన్నారు.