Oct 24,2021 06:59

   'ధనమేరా అన్నిటికీ మూలం/ ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవధర్మం/ మానవుడే ధనమన్నది సృజియించెనురా/ దానికి తానే తెలియని దాసుడాయెరా...' అంటాడు ఆరుద్ర. 'బూంద్‌ బూంద్‌ బనేగా సముందర్‌, పైసా పైసా జమాతో రుపయా హోయేగా' అనేది హిందీ సామెత. ఒక్కొక్క బిందువు కలిస్తేనే మహాసముద్రం... పైసా పైసా కలిస్తేనే రూపాయి అవుతుందని దాని అర్థం. 'చిల్లర దరి చేర్చుతూ పోతే/ అవే ధన సమూహాలు/ ఖర్చు చేస్తూ పోతే/ ఛిద్ర మార్గంలో నీవు/ పొదుపు చేస్తూ పోతే/ ప్రగతి పథంలో నీవు' అంటాడో కవి. రూపాయిని చిల్లర చేస్తే నాణాలుగా మారుతుంది. చిల్లరను ఒకచోట చేర్చితే... ధన సమూహం అవుతుంది. పొదుపు జీవితంలో అవకాశాలను కల్పిస్తుంది. సంతోషంగా బతకడానికి మార్గాన్ని చూపుతుంది. అందుకే అంటారు... 'ధనం మూలం ఇదం జగత్‌' అని. భవిష్యత్‌ కోసం సంపాదించిన దానిలో కొంత మిగుల్చుకోవడమే పొదుపు. ఎంత సంపాదిస్తున్నారనేదానికంటే ఎంత పొదుపు చేస్తున్నారనేదే ముఖ్యం. సంపాదించినదంతా ఖర్చు చేస్తే... భవిష్యత్తు శూన్యం. ఎంతోకొంత పొదుపు చేసుకోగలిగితే... కష్టకాలంలో ఇంకొకరి దగ్గర చేయి చాచే పరిస్థితి నివారించవచ్చు.
     సంపాదించిన దానిలో కొంత దాచుకోవడమనేది పొదుపే... కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో... అరకొర ఆదాయాలతో బతకడానికే ఆపసోపాలు పడుతుంటే... పొదుపు ఎలా చేయాలి? అనేది పెద్ద ప్రశ్న. నయా ఉదారవాద ఆర్థిక విధానాల పుణ్యమాని... ప్రపంచంలో వినిమయదారీ సంస్కృతి విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో పొదుపు చేయడం సంగతి అటుంచి... మార్కెట్‌లో కనిపించే వస్తువుల పట్ల ఆకర్షణ పెరిగింది. చేతిలో పైసా లేకపోయినా... అప్పుచేసి పప్పుకూడు అన్న చందంగా మార్చిందీ వినిమయదారీ సంస్కృతి. క్రెడిట్‌ కార్డులు, ఇఎంఐ ల సంస్కృతి పెంచుతూ మధ్యతరగతి జీవితాలను ఆశల పల్లకిలో విహరింపజేస్తున్నాయి. 'అప్పు తెచ్చి వేసిన మిద్దెల్లో/ కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్న దీనత్వం నీది' అంటాడు చెరబండరాజు. ఈ కార్డుల వినియోగం సులభంగా వున్నా... ఖర్చు చేయిదాటి... ఆర్థిక భారం పెరిగిపోతుంది.
     పొదుపు ఒక్క డబ్బు విషయంలోనే కాదు... నీరు, విద్యుత్‌, ఆహారం వృధాను అడ్డుకొని పొదుపుగా వాడుకోవాలి. లేదంటే... రాబోయే తరాలు దాని దుష్పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. తరతరాలకు మనుగడనిచ్చే ప్రకృతి, పర్యావరణం, గాలి, నీరు, నేల వంటి అన్నింటి వినియోగంలోనూ పొదుపు అవసరం. ఇప్పటికే అపరిమిత కాలుష్యంతో జీవితాలు చెయ్యిజారిపోయే పరిస్థితి ఏర్పడింది. ఆ మాట కొస్తే మన మాటల్లోనూ పొదుపు అవసరమే. మాటల్లో అదుపు, మనీలో పొదుపు పాటించకపోతే... జీవితంలో భారీ కుదుపులు భరించక తప్పదు.
     ఆసియా దేశాల్లో పొదుపు చేయడం వారసత్వంగా వుంది. ఇప్పటికీ ఏదోకమేర ఎంతోకొంత పొదుపు కొనసాగుతోంది. పాశ్చాత్య దేశాలతో పోల్చుకుంటే... ఆసియా దేశాలే మెరుగ్గా వున్నాయి. ఆ దేశాల్లో ప్రజలు తమ రాబడికంటేే ఎక్కువగా ఖర్చు చేస్తుంటే.... మనం ఎంతోకొంత పొదుపు చేస్తుంటాం. అయితే ఇటీవల ఈ పొదుపు చేయడమనేది తగ్గుతుందని అనేక రిపోర్టులు చెబుతున్నాయి. 2008లో మనదేశ స్థూల పొదుపు రేటు 37.8 శాతం వుంటే, 2020 నాటికి 31.4 శాతానికి తగ్గిపోయింది. ప్రపంచంలో 40వ స్థానంలో వున్నాం. ఈ సూచీని మెరుగు పర్చుకోలేకపోతే... దేశం పరిస్థితి అయినా... కుటుంబాల పరిస్థితి అయినా చిన్నాభిన్నం అవుతుంది. 'ఉన్ననాడు తెలివి కలిగి పొదుపు చేయరా/ లేనినాడు ఒడలు వంచి కూడబెట్టరా/ కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే/ అయ్యో కూలిపోవు కాపురాలు ఇది తెలియకుంటే...' అంటాడు ఆరుద్ర. అనవసరమైన వృధాను అడ్డుకొని, రేపటికోసం కొంత దాచాలన్నది తరతరాలుగా వస్తోన్న సంప్రదాయం. మన పెద్దలు నేర్పిన బతుకుపాఠం. కుటుంబ భవిష్యత్తు, దేశ భవిష్యత్తు ఎంత ముఖ్యమో... ఆర్థిక పరమైన విషయాల పట్ల అవగాహన కూడా అంతే అవసరం. ఈ బతుకు బండిని నడపడం పట్ల అవగాహన కల్పించడానికి, పొదుపు ప్రాధాన్యతను తెలియజేయడానికి ఏర్పాటు చేయబడిందే... 'ప్రపంచ పొదుపు దినోత్సవం'. కనుక వృధా ఖర్చును నియంత్రించుకొని, పొదుపును ఒక బాధ్యతగా మార్చుకోవాలి. అప్పుడే ఈ లక్ష్యం నెరవేరుతుంది.