
గుంటూరు జిల్లా ప్రతినిధి : పాత గుంటూరు పోలీస్‌స్టేషన్‌పై 2017 డిసెంబరు 15న యాదఅశ్చికంగా జరిగిన దాడి ఘటనలో అక్రమంగా నమోదు చేసిన కేసులను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో అమలును హైకోర్టు నిలిపివేయడంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టులో అప్పీలు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్ చేశారు. గుంటూరులోని సిపిఎం జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ హయంలో నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేస్తూ వైసిపి ప్రభుత్వం జీవో నెంబరు 776 జారీ చేసిందన్నారు. ఈ జీవోలో 'ముస్లిం యువత' అనే పదాన్ని వినియోగించారన్న సాకుతో వసుపులేటి గణేష్ ఆనే వ్యక్తి హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారని, దాని ఆధారంగా ఈ జీవో అమలు నిలిపివేయడం తగదని అన్నారు. పాత గుంటూరు పోలీసు స్టేషన్‌పై దాడి ఘటనలో 191 మందిపై అప్పటి టిడిపి ప్రభుత్వం అక్రమంగా కేసులు నమోదు చేసిందని తెలిపారు. వీరిలో ముస్లింలతో పాటు ఇతర సామాజిక తరగతుల వారు కూడా ఉన్నారని ఆయన గుర్తు చేశారు. పోలీసుస్టేషన్ పై దాడి ఘటనలో అక్రమ కేసులు నమోదు చేసి రెండు నెలల పాటు జైలులో ఉంచి వేధించారని తెలిపారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న వారంతా వైసిపి సానుభూతి పరులు కావడంవల్ల భయపెట్టేందుకు టిడిపి అక్రమ కేసులు నమోదు చేసిందని తెలిపారు. అయితే ఈ కేసులో హైకోర్టు చేసిన వ్యాఖ్యలు కూడా సరికాదన్నారు. అలాగే ఈ కేసును ఎన్ఐఎకు అప్పగిస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు. ఉగ్రదాడులు దాడులు చేస్తే విచారించాల్సిన ఏజెన్సీ ఎన్ఐఎ అని, దానికి ఈ కేసును అప్పగించడం శోచనీయమని అన్నారు. దీనిపై హైకోర్టు పున్ణపరిశీలన చేయాలన్నారు. లేదంటే రాష్ట్ర ప్రభుత్వమే సుప్రీంకోర్టుకు వెళ్లి జీవో అమలుకు చర్యలు చేపట్టాలన్నారు. విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు, నగర కార్యదర్శి నళినీకాంత్, అవాజ్ అధ్యక్షులు షేక్ చిష్టి, ముస్లిం సంఘాల నాయకులు షరీఫ్, నజీర్, ఆయూబ్, తదితరులు పాల్గొన్నారు.