Oct 13,2021 19:08

జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఏ సమయంలో.. ఏవిధంగా మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఓడలు బండ్లు అవ్వొచ్చు.. బండ్లు ఓడలు అవ్వొచ్చు అన్న సామెతగా.. పేదలు ధనికులవ్వొచ్చు.. ధనికులు పేదలైన సంఘటనలు ఎన్నో! తాజాగా ఓ వ్యక్తి జీవితంలోనూ ఇదే జరిగింది. అతను ఓ ఎటిఎం వల్ల ఒక్కరోజులోనే లక్షాధికారయ్యాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో వివరాలు తెలియలేదు. మీడియా కథనాల ప్రకారం... ఓ వ్యక్తి 300 డాలర్లు (రూ. 22,360) ఖర్చుపెట్టి జంక్‌యార్డు నుంచి ఓ ఏటిఎంను కొనుగోలు చేశాడు. అయితే అతనికి దానిని అమ్మిన వ్యక్తి దానికి సంబంధించిన కీ ఇవ్వకపోవడంతో.. తన సహచరుడి సహాయంతో దాన్ని బద్దలుకొట్టాడు. అందులో నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. మొత్తంగా 2 వేల డాలర్లు (రూ. 1.5 లక్షలు) బయటపడ్డాయి. వాటిని చూసి ఆ వ్యక్తి ఆనందంలో మునిగిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా.. ఆ వీడియో వైరల్‌గా మారింది. వేలాదిమంది నెటిజన్లు ఈ వీడియోను వీక్షించారు. లైక్‌ చేయడమే కాకుండా కామెంట్లు పెడుతున్నారు.