Nov 22,2020 23:40

అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలియచేస్తున్న నాయకులు, బాధితులు

- నిందితుడ్ని అరెస్ట్‌ చేయాలని ప్రజా సంఘాలు నిరసన
గుంటూరు : పాస్టర్‌ ముసుగులో యువతని లైంగికంగా వేధించిన మల్లెల రాజు అలియాస్‌ బుచ్చిరాజును వెంటనే అరెస్ట్‌ చేయాలని, బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతూ ఆదివారం స్థానిక లాడ్జి సెంటర్‌లోని అంబేద్కర్‌ సెంటర్‌లో ఆలిండియా హ్యూమన్‌ రైట్స్‌, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో నాయకులు మాట్లాడుతూ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి ఐదు రోజులవుతున్నా ఇంతవరకూ అరెస్టు చేయలేదన్నారు. పెళ్లికి ముందు నుంచే ఆ యువతిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడని, ఆమెకు పెళ్లి అయిన తర్వాత భార్యాభర్తకు మధ్య వివాదాలు సృష్టించి, వారు విడిపోయేందుకు కారకుడయ్యాడని, విడాకుల తర్వాత తనకు లొంగకపోతే కుటుంబాన్ని చంపేస్తానని యువతిని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడన్నారు. అంతే కాకుండా యువతి నుంచి రెండు సందర్భాల్లో రూ.4 లక్షల నగదు, బంగారు ఆభరణాలు తీసుకున్నాడన్నారు. ఇదే విధంగా అతని వ్యవహార శైలి కొనసాగుతుండటంతో కుటుంబ సభ్యులతో కలిసి బాధితురాలు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారని, కానీ ఇంత వరకూ నిందితుడ్ని అరెస్ట్‌ చేయలేదన్నారు. దీంతో నిందితుడు యధేచ్ఛగా బయట తిరుగుతూ కేసు వాపసు తీసుకోవాలని, లేదంటే కుటుంబం మొత్తాన్ని చంపేస్తానని బెదిరిస్తున్నాడన్నారు. బుచ్చిరాజుకు అనేక మంది రౌడీలతో సంబంధాలు ఉన్నాయని, కావున వెంటనే జిల్లా పోలీసు ఉన్నతాధికారులు, హోం మంత్రి జోక్యం చేసుకుని నిందితుడ్ని అరెస్టు చేయాలని, బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బాధిత యువతి, వారి తల్లిదండ్రులు, మహిళా సంఘం నాయకులు మీనాక్షి, ఐద్వా జిల్లా కార్యదర్శి లక్కా అరుణ, దుర్గా భవానీ, నాగమల్లేశ్వరి, కెవిపిఎస్‌, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శులు టీ కష్ణమోహన్‌, బి లక్ష్మణ్‌ రావు తదితరులు పాల్గొన్నారు.