Nov 26,2021 07:35

అందులో మూడు ఆర్డినెన్స్‌లు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :
బ్యాంక్‌ ఉద్యోగులు వ్యతిరేకిస్తున్న బ్యాంకుల ప్రైవేటీకరణ బిల్లు పార్లమెంట్‌ ముందుకు రానుంది. రైతులు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న విద్యుత్‌ సవరణ బిల్లును కూడా ఆమోదం కోసం ప్రభుత్వం జాబితాలో చేర్చించింది. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ఈ నెల 29 (సోమవారం) నుంచి జరగనున్నాయి. డిసెంబర్‌ 23తో ముగియనున్న ఈ పార్లమెంట్‌ సమావేశాలు, దాదాపు 20 రోజుల పాటు సభా కార్యకలాపాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ఆమోదం కోసం 26 బిల్లులను ప్రభుత్వం జాబితా చేసింది. అందులో మూడు ఇటీవలి ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌లు ఉన్నాయి. మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు-2021ను తొలిరోజే లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులోకి తెచ్చేలా 'విత్తనాలపై బిల్లు'ను కూడా పార్లమెంటు ఆమోదానికి తేనుంది. వీటితోపాటు విద్యుత్తు సవరణ బిల్లు కూడా జాబితాలో ఉంది. ఇడి, సిబిఐ డైరెక్టర్ల పదవీ కాలాన్ని పొడిగిస్తూ జారీచేసిన ఆర్డినెన్సు, నార్కోటిక్‌ డ్రగ్స్‌పై తెచ్చిన ఆర్డినెన్స్‌ స్థానంలో బిల్లును తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. వీటికి సంబంధించి మంత్రివర్గ సమావేశాల్లో తీర్మానం చేసింది. సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ (సవరణ) బిల్లు, ఢిల్లీ స్పెషల్‌ పోలీస్‌ ఎస్లాబ్లిష్‌మెంట్‌ (సవరణ) బిల్లు, నాలుగునెలల్లో ఉత్తరప్రదేశ్‌కి సంబంధించిన ఎస్టీ, ఎస్సీ కులాల జాబితాలో మార్పుచేర్పులు చేసే చట్టాన్ని కూడా కేంద్రం ఈ శీతాకాల సమావేశాల్లో పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. త్రిపుర ఎస్సీ, ఎస్టీ జాబితా సవరణ బిల్లు కూడా పార్లమెంటు ముందుకు రానుంది. హైకోర్టు, సుప్రీం కోర్టు జడ్జీల (సర్వీసు నిబంధనలు, వేతనాలు) సవరణ బిల్లు - 2021, మధ్యవర్తిత్వ బిల్లు కూడా కేంద్రం రాబోయే సమావేశాల్లో ఉభయసభల ముందుంచనుంది. మనుషుల అక్రమ రవాణా (నిరోధం, రక్షణ, పునరావాసం) బిల్లు 2021 కూడా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు.