
ప్రజాశక్తి - తెనాలి : నివర్ తుపాను ప్రభావంతో దెబ్బతిన్న వరి పైరును సోమవారం గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పరిశీలించారు. రూరల్ గ్రామాల్లో పర్యటించి, రైతుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఎంపీ మాట్లాడుతూ రైతులు, కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయిన దశలో ప్రభుత్వం తక్షణమే స్పందించాలన్నారు. త్వరిత గతిన పంటనష్టం అంచనా వేయాలని, పారదర్శకంగా రైతులకు పరిహారం చెల్లించాలన్నారు.
అమర్తలూరు: కుల, మత, పార్టీలకతీతంగా ప్రతి ఒక్క రైతును ప్రభుత్వమే ఆదుకోవాలని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు డిమాండ్ చేశారు. సోమవారం మండల పరిధిలోని పలు గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. ఆయన వెంట టిడిపి మండల అధ్యక్షుడు యలవర్తి బ్రహ్మానందం, జిల్లా కార్యదర్శి గొట్టిపాటి భాను గంగాధర్, శరణు గిరి, అమర్తలూరి బాబూరావు పాల్గొన్నారు.
పొన్నూరు : నివర్ తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ తహశీల్దార్ డి.పద్మనాభుడుకు టిడిపి నాయకులు వినతి పత్రం సమర్పించారు. మాజీ మార్కెట్ యార్డు చైర్మన్స్ మాదల వెంకటేశ్వరరావు, నన్నపనేని ప్రభాకర్ రావు, టిడిపి మండల అధ్యక్షులు బొర్రు రామారావు, మాజీ మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ బండ్లమూడిబాబురావు, పాల్గొన్నారు.
గురజాల : నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకో వాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు షేక్ హుస్సేన్ కోరారు. మండలంలోని పలు గ్రామాల్లో వరి, పత్తి పంటలను సిపిఐ నేతలు పరిశీలించి రైతులను పరామర్శించారు.
అచ్చంపేట : నివర తుఫాన్‌తో మండలంలో సుమారు 3500 ఎకరాల్లో ప్రత్తి, మిరప వరి పంటలు దెబ్బతిని రైతులు పూర్తిగా నష్టపోయారని, ఎకరాకు రూ.40 వేలు నష్ట పరిహారం అందించాలని డిబిఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు తహశీల్దార్ క్షమరాణికి వినతి పత్రాన్ని అందజేశారు.