Nov 30,2020 21:31

ఎస్కేయు వైస్‌ ఛాన్సలర్‌ రామకృష్ణారెడ్డి

    ప్రజాశక్తి-అనంతపురం : శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పాలనను గాడిలో పెడతామని వైస్‌ ఛాన్సలరు రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం ఎస్కేయులోని ఆయన ఛాంబరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. యూనివర్సిటీలో బోధనా సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని తెలిపారు. 200 పోస్టుల్లో 70 మంది మాత్రమే బోధనా సిబ్బంది ప్రస్తుతమున్నారని చెప్పారు. అందులో వచ్చే ఏడాది 14 ప్రొఫెసర్లు ఉద్యోగ విరమణ పొందుతున్నట్టు వివరించారు. ఇది వరకు చేపట్టిన నియమకాలకు సంబంధించి రోస్టర్‌ పాటించలేదన్న అంశంపై న్యాయస్థానంలో కేసులు నడుస్తున్నాయని చెప్పారు. ఆ సమస్య పరిష్కారమయ్యేలోపు ఎపిపిఎస్‌సి ద్వారా నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. త్వరలోనే ఈ నియామకాలు జరిగే అవకాశం ఉంటుందని తాము ఆశిస్తున్నామన్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే సమస్యకు కొంత పరిష్కారం అభించే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయం పరిధిలోని ఇంజినీరింగ్‌ కళాశాలకు సంబంధించి 32 సంస్థలతో అవగాహన ఒప్పందం చేసుకున్నట్టు తెలిపారు. దీని ద్వారా 161 మంది ఉద్యోగాలు లభించాయని చెప్పారు. విశ్వవిద్యాలన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో నడిపించేందుకు చర్యలు చేపట్టనున్నట్టు చెప్పారు. వసతి గృహాలను ప్రారంభించడానికి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. గడిచిన ఎనిమిది మాసాలుగా విశ్వవిద్యాలయంలోని వసతి గృహాల్లో కోవిడ్‌ కేర్‌ కేంద్రాలు నిర్వహించామన్నారు. ఇప్పుడు వాటన్నింటినీ శుభ్రం చేసి పెయింటింగ్‌ చేయాల్సి ఉందన్నారు. అయితే నిధుల కొరత ఉందని పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం నిధులు సమకూర్చాలని కోరనున్నట్టు తెలిపారు. ఏది ఏమైనా గాడి తప్పిన విశ్వవిద్యాలయాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తామని చెప్పారు.