Sep 15,2021 22:30

దువ్వాడ అక్షరు

ప్రజాశక్తి - శ్రీకాకుళం సిటీ : ఎపి పాలిటెక్నిక్‌ కళాశాలల ఉమ్మడి ప్రవేశ పరీక్ష 2021 (పాలిసెట్‌) ఫలితాల్లో శ్రీకాకుళం జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. బుధవారం వెలువడిన ఈ ఫలితాల్లో 95.52 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే శ్రీకాకుళం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది పాలిసెట్‌కు జిల్లా నుంచి 6052 మంది దరఖాస్తు చేసుకోగా 5,602 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 5,351 మంది (95.52 శాతం) విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. పరీక్షకు 3,645 మంది బాలురు, 1957 బాలికలు హాజరు కాగా, ఫలితాల్లో 3,442 మంది బాలురు, 1909 బాలికలు ఉత్తీర్ణులయ్యారు. మొత్తం బాలురు ఉత్తీర్ణతా శాతం 94.43 శాతం కాగా, బాలికలు 97.55 శాతం ఉత్తీర్ణత సాధించి ముందంజలో నిలిచారు. వీరిలో ముగ్గురు వంద లోపు ర్యాంకులను సాధించారు. రాజాంకు చెందిన దువ్వాడ అక్షరు 118 మార్కులతో రాష్ట్రస్థాయిలో 26వ ర్యాంకు, రాయవరపు ప్రేమ్‌కుమార్‌ 117 మార్కులతో 38వ ర్యాంకు, ఆమదాలవలసకు చెందిన పేడాడ భరత్‌కుమార్‌ 116 మార్కులతో 71వ ర్యాంకు సాధించారు. మరో వారం రోజుల్లో పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానుంది.