Oct 25,2021 07:58
  • కొత్త విద్యార్థులకు పుస్తకాల్లేవు
  • రెండు నెలలు దాటినా అందించని విద్యాశాఖ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం కొత్తగా చేరిన విద్యార్థులకు పాఠ్యాంశ పుస్తకాలు ఇంకా అందలేదు. కరోనా కారణంగా ఈ విద్యా సంవత్సరం పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 16 నుంచి తెరిచిన విషయం తెలిసిందే. తరగతులు ప్రారంభమై మూడు నెలలు కావొస్తున్నా ఇంతవరకు విద్యార్థులకు పుస్తకాలు అందకపోవడం గమనార్హం. ఈ విద్యా సంవత్సరం ప్రారంభించిన మొదటి రోజే విద్యార్థులకు విద్యాకానుక కిట్లు, పుస్తకాలను విద్యాశాఖ అందించడం అభినందనీయమే. అయితే కొత్తగా చేరిన వారికి జగనన్న విద్యాకానుక కిట్ల (జెవికె)ను అందించడంలో మాత్రం విఫలమైంది. దీంతో కొత్త విద్యార్థులు పుస్తకాలు, యూనిఫాం, బూట్లు లేకుండానే సాధారణ డ్రెస్సులతో బడికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. గత విద్యా సంవత్సరం పాఠశాలల్లో చేరిన విద్యార్థుల సంఖ్యకు అదనంగానే జెవికె కిట్లను ఈ విద్యా సంవత్సరం పాఠశాలలకు విద్యాశాఖ పంపింది. గత విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో 43,56,647 మంది, ఎయిడెడ్‌ పాఠశాలల్లో 1,97,291 మంది మొత్తంగా 45,53,938 మంది చదివారు. ఈ విద్యా సంవత్సరానికి రూ.731.30 కోట్లతో 47,32,164 కిట్లకు పాఠశాల విద్యాశాఖ ఆర్డర్లు ఇచ్చింది. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన నాడు-నేడు పనులు, కరోనా ప్రభావం వల్ల చిన్న ప్రైవేట్‌ పాఠశాలలు జరగకపోవడం వంటి కారణాలతో ఈ విద్యాసంవత్సరం పెద్దఎత్తున తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించారు. మొత్తంగా 15-20 శాతం మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది అదనంగా చేరారని అధికారులు అంచనా వేస్తున్నారు. కొత్తగా చేరిన పిల్లల సంఖ్యను జిల్లా విద్యాశాఖ అధికారులు పాఠశాల విద్యకు పంపినట్లు తెలిసింది. ఇంకా కొన్ని జిల్లాల నుంచి సమాచారం రావాల్సి ఉంది. మొత్తంగా సుమారు 6 లక్షల మంది విద్యార్థులకు కిట్లు అందలేదని అధికారులు అంచనా వేస్తున్నారు.
 

                                                              ఆధార్‌ తిప్పలు

ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థుల ఆధార్‌ కార్డులు అప్‌డేట్‌ కాకపోవడంతో తిప్పలు పడుతున్నారు. ఐదేళ్లు దాటిన పిల్లలు ఆధార్‌ కార్డును అప్‌డేట్‌ చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. విద్యార్థుల తల్లిదండ్రులు అప్‌డేట్‌ చేయించుకున్న 20 రోజుల తరువాత అప్‌డేట్‌ అవుతుందని పోస్టల్‌ శాఖ వారు చెబుతున్నారని ఉపాధ్యాయులు అంటున్నారు. ఈ గడువు దాటినా చైల్డ్‌ఇన్‌ఫోల్‌ అప్‌డేట్‌ అయినట్లు రావడం లేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఇలా ఆధార్‌ అప్‌డేట్‌ కాని విద్యార్థుల సంఖ్య ప్రతి ప్రాథమిక పాఠశాలలో 15, ప్రతి ఉన్నత పాఠశాలలో 30 వరకు ఉంటాయి. చైల్డ్‌ ఇన్‌ఫోలో చేర్చేందుకు వీరి ఆధార్‌ కార్డులను ప్రతిరోజూ తనిఖీ చేస్తున్నారు. దీంతో బోధన పనులు పక్కకు వెళ్లి ఆధార్‌ పనులు పట్టుకున్నాయి. మరోపక్క ప్రైవేట్‌ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థుల సమాచారం కూడా ఉపాధ్యాయులకు రావడం లేదు. ప్రైవేట్‌ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరిన తరువాత ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు వారి పాఠశాలల్లో విద్యార్థి చదవడం లేదనే సమాచారాన్ని చైల్డ్‌ఇన్‌ఫోలో తొలగించాలి. అలా అయితేనే వేరే పాఠశాలల్లో అడ్మిషన్‌ ఇవ్వాలి. కానీ ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల సమాచారాన్ని వారి పాఠశాలల్లోంచి తొలగించడం లేదు. విద్యార్థులు మాత్రం ప్రభుత్వ పాఠశాలలకు వెళ్తున్నారు.