Dec 03,2021 13:53

బెర్లిన్‌ :  కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ఉధృతమవుతుండటంతో జర్మనీ ప్రభుత్వం కఠిన ఆంక్షలకు సిద్ధమైంది. వ్యాక్సిన్‌ తీసుకోని వారిపై దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఆంక్షలు విధించనున్నట్లు ప్రకటించింది. వ్యాక్సిన్‌లు తీసుకోని వారు మార్కెట్‌లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో తిరగకుండా నిషేధం విధిస్తున్నట్లు జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ ప్రకటించారు. అలాగే వ్యాక్సినేషన్‌ను తప్పనిసరి చేసేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ చట్టం పార్లమెంట్‌లో ఆమోదం పొందిన అనంతరం వచ్చే ఫిబ్రవరి నుండి అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా, జర్మనీ జనాభాలో ఇప్పటివరకు 75శాతం మందికి వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ సుమారు 68శాతం మందికి మాత్రమే వ్యాక్సిన్‌లు తీసుకున్నారు. కాగా,   డెల్టా కంటే అయిదు రెట్ల వేగంతో ఒమిక్రాన్‌ వ్యాపిస్తున్నట్లు డబ్ల్యుహెచ్‌ఒ హెచ్చరించిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాలో అత్యధికంగా 183 కేసులు వెలుగుచూడగా,  నార్వేలో  50కి పైగా కేసులు, ఘనాలో  33 కేసులు,  బ్రిటన్‌లో 32 కేసులు నమోదయ్యాయి.