Oct 27,2021 22:59

నివాళులు అర్పిస్తున్న నేతలు

- 29న గుండ్లకమ్మ నదిలో నిమజ్జనం
ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌: 
ఉత్తరప్రదేశ్‌ లఖింపూర్‌ ఖేరీలో మృతిచెందిన నలుగురు అమర రైతన్నల అస్తికలు బుధవారం ఒంగోలు చేరుకున్నాయి. ప్రజా, రైతు వ్యతిరేక నల్ల వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని గత 11 నెలలుగా సాగుతున్న ఉద్యమంలో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖేరిలో రైతులు శాంతియుతంగా నిర్వహిస్తున్న ప్రదర్శనను కార్లతో తొక్కించి అమానుషంగా హత్య చేసిన ఘటనలో నలుగురు రైతులు మృతిచెందిన విషయం తెలిసిందే. వారి అస్తికలను దేశంలోని అన్ని ప్రాంతాలలోని ప్రధానమైన నదులలో నిమజ్జనం చేయాలని అఖిల భారత సంయుక్త కిసాన్‌ మోర్చా నిర్ణయించింది. అందులో భాగంగా విజయవాడ చేరిన అమర రైతుల అస్తికలను రాష్ట్ర నాయకులైన వై.కేశవరావు, పి.నరసింహారావులు ప్రకాశం జిల్లా సంయుక్త కిసాన్‌ మోర్చా నాయకులు చుండూరి రంగారావు, వడ్డె హనుమారెడ్డి, కంకణాల ఆంజనేయులు, చావలి సుధాకర్‌రావు బృందానికి అందజేశారు. బుధవారం విజయవాడ వెళ్లి అస్తికలను ప్రకాశం జిల్లా ఒంగోలు తీసుకొచ్చిన సందర్భంగా స్థానిక మల్లయ్య లింగం భవన్‌లో అమరులకు నివాళులర్పించారు. ఈ బృందానికి నాయకత్వం వహించిన సంయుక్త కిసాన్‌ మోర్చా జిల్లా కన్వీనర్‌ చుండూరి రంగారావు మాట్లాడుతూ నల్ల చట్టాలు రద్దయ్యే వరకు ఈ ఉద్యమం ఆపే ప్రసక్తే లేదని తెలియజేశారు. లఖింఫూర్‌ ఖేరీలో అమరులైన రైతన్నల అస్తికలను ఈనెల 29న ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టరేట్‌ వద్ద నివాళులర్పించి, అక్కడ నుంచి ప్రదర్శనగా వెళ్ళి గుండ్లకమ్మ నదిలో నిమజ్జనం చేసే కార్యక్రమం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పెంట్యాల హనుమంతరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వి.బాలకోటయ్య, రంగా కిసాన్‌ సంస్థ ప్రధాన కార్యదర్శి చుంచు శేషయ్య, బాపట్ల పార్లమెంట్‌ తెలుగు రైతు అధ్యక్షులు కొండ్రగుంట వెంకయ్య, ఏఐటియుసి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్‌డి సర్ధార్‌, పివిఆర్‌ చౌదరి, నాయకులు ఉప్పుటూరి ప్రకాశరావు, విప్లవ యువజన సంఘం నాయకులు బి.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.