May 02,2021 19:39

పేదరికం...ఎందరో పిల్లల ఉన్నత శిఖరాలకు అవరోధం. ఆ అవరోధాలను దాటుకొని తాను కలలు గన్న ఉన్నత లక్ష్యం వైపు అడుగులు వేశాడు రంజిత్‌ రామచంద్రన్‌(28). కేరళ నివాసి అయిన రంజిత్‌ పేదరికంలో పుట్టి పెరిగాడు. ఉన్నత విద్య అందుకోవాలన్న లక్ష్యం ఉన్నా ఆర్థికస్థోమత లేక ఎంతోమంది పిల్లలు చదువుకుంటూ పార్ట్‌టైమ్‌లో వివిధరకాల పనులు చేస్తుంటారు. అలా వాచ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తూ విద్యాభ్యాసం కొనసాగించాడు రంజిత్‌. ఎన్నో అవరోధాలను అధిగమించాడు. ప్రస్తుతం ప్రతిష్టాత్మక కాలేజీ రాంచీ ఐఐఎంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ మధ్య ఏప్రిల్‌ 9న తన జీవిత ప్రయాణం...వాచ్‌మెన్‌ నుంచి ప్రొఫెసర్‌గా విధులు నిర్వహించడం గురించి 'ఐఐఎం ప్రొఫెసర్‌ పుట్టింది ఇక్కడే' అంటూ ఓ పూరిగుడిసెను సామాజిక మాధ్యమంలో పోస్టు చేశాడు. అప్పుడే అతని గురించి ఈ ప్రపంచానికి తెలిసింది.
కేరళ కసర్‌గడ్‌కు చెందిన రంజిత్‌ తండ్రి సాధారణ టైలర్‌. తల్లి ఉపాధి పనులకు వెళ్తుంది. అటువంటి కుటుంబంలో పుట్టిన పిల్లలు చదువుకోవాలంటే ఎన్నో అడ్డంకులు. అందుకే తన చదువు తల్లిదండ్రులకు భారం కాకూడదని చదువుకుంటూనే పనతూర్‌ బిఎస్‌ఎన్‌ఎల్‌ టెలిఫోన్‌ ఎక్సేంజ్‌లో రాత్రి వాచ్‌మెన్‌గా విధులు నిర్వహించేవాడు రంజిత్‌. 'పగలు క్లాసులకు హాజరవుతూ రాత్రి పూట వాచ్‌మెన్‌గా చేసేవాడిని' అంటూ ఫేస్‌బుక్‌లో పోస్టుచేశాడు. ఉన్నత విద్య అందుకోవాలన్న బలమైన సంకల్పం ఉన్న రంజిత్‌, మద్రాస్‌ ఐఐటిలో పిహెచ్‌డి ప్రోగ్రామ్‌కు అడ్మిషన్‌ సంపాదించాడు. అయితే మాతృభాష మలయాళం తప్ప మరే భాషపై పట్టు లేని తను ఆ కోర్సు పూర్తిచేయడం సులభం కాదని గ్రహించి ఆ ప్రయత్నాన్ని విరమించుకోవాలనుకున్నాడు. అప్పుడు అతని గురువు డా||సుభాష్‌ తనకు అండగా నిలిచాడు. అలా తన లక్ష్యం కోసం ముందుకు వెళ్లాడు రంజిత్‌. గతేడాదే ఆ ప్రోగ్రామ్‌ పూర్తిచేసి డాక్టరేట్‌ సంపాదించాడు.
సామాజిక మాధ్యమంలో అతను చేసిన పోస్టుకు స్వల్పకాలంలోనే ఎంతోమంది స్పందించారు. ఉన్నత శిఖరాలు అందుకొన్న అతనిని కొనియాడుతూ ప్రముఖుల నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి. 'ఓడిపోయాను అన్న క్షణం నుంచే అతను తన జీవితాన్ని మలుపుతిప్పుకున్నాడు. విజయం సాధించాడు. ఎంతోమందికి ప్రేరణగా నిలిచాడు' అంటూ కేరళ ఆర్థిక శాఖా మంత్రి టిఎం థామస్‌ ట్విట్టర్‌లో స్పందించారు. ఇలా ఎంతోమంది ప్రముఖులు రంజిత్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
'పోస్ట్‌ ఇంత వైరల్‌ అవుతుందని అనుకోలేదు. నా ప్రయాణం మరికొంతమందికి స్ఫూర్తినిస్తుందన్న ఆశతో పోస్ట్‌ చేశాను. ప్రతి ఒక్కరూ మంచి కలలు కనాలి. ఆ కలల కోసం పోరాడాలి. నా విజయం మరికొందరికి ప్రేరణగా ఉండాలి' అంటాడు రంజిత్‌.