Jun 11,2021 08:14
  • బీహార్‌ మృతుల జాబితా సవరణ

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశంలో కరోనా విలయం కొనసాగుతోంది. ఎన్నడూ లేని విధంగా బుధవారం ఉదయం నుండి గురువారం ఉదయం వరకు 24 గంటల్లో 6,148 మంది కరోనాతో మృతి చెందినట్లు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేసింది. దేశంలో కరోనా విలయం ప్రారంభమైనప్పటినుండి ఈ స్థాయిలో మరణాలు చోటుచేసుకోవడం ఇదే మొదటిసారి. తాజా మరణాలతో కలిపి దేశంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 3,59,676కు చేరింది. బీహార్‌ రాష్ట్రంలో మరణాల సంఖ్యను సవరించడంతో ఈ పరిస్థితి ఏర్పడినట్టు భావిస్తున్నారు. తాజా గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో 20,04,690 మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 94,052 మందికి వైరస్‌ నిర్ధారణైంది. రికవరీ రేటు 94.55 శాతానికి చేరింది.
 

                                                         బీహార్‌లో భారీగా మరణాలు

   బీహార్‌లో కరోనా మరణాల సంఖ్య ఒక్కసారిగా 72 శాతం పెరిగింది. ప్రతిపక్షాల డిమాండ్‌తో, కోర్టు మొట్టికాయలతో దిగొచ్చిన నితీష్‌ కుమార్‌ పభుత్వం ఎట్టకేలకు కరోనా లెక్కల్ని సవరించింది. బుధవారం వరకు అక్కడి ప్రభుత్వం మరణాల సంఖ్యను 5,500గా పేర్కొంది. అయితే, కోర్టు జోక్యం నేపథ్యంలో ఈ సంఖ్యను 9,429గా సవరించింది. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేసింది. ఈ కారణంగానే జాతీయ స్థాయిలోనూ మరణాల సంఖ్య పెరిగింది. అయితే ఇదే పరిస్థితి దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
 

                                                     రాష్ట్రంలో మరో 8110 మందికి కరోనా

   రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 97,863 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 8,110 మందికి కరోనా óసోకినట్లు తేలింది. 67 మంది చనిపోయారు. మరో 12,981 మంది కోలుకుని డిశ్చార్జయ్యారు. గురువారం రాష్ట్రంలో అత్యధికంగా తూర్పుగోదావరిలో 1,416, చిత్తూరులో 1,042 కేసులు నమోదు కాగా అత్యల్పంగా కర్నూల్లో 235, విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో 280 కేసులు నమోదయ్యాయి. కరోనా లక్షణాలతో చిత్తూరులో 11 మంది, పశ్చిమగోదావరిలో తొమ్మిది, విశాఖలో ఏడుగురు, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఆరుగురేసి, గుంటూరు, కర్నూలులో ఐదుగురేసి, అనంతపురం, కృష్ణాలలో నలుగురేసి, కడపలో ముగ్గురు, నెల్లూరులో ఒక్కరు చొప్పున మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 11,763కు చేరింది. పెరుగుతున్న
 

                                                                          బ్లాక్‌ ఫంగస్‌ మరణాలు

బ్లాక్‌ ఫంగస్‌ మరణాలు

   రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతున్న సమయంలోనే బ్లాక్‌ ఫంగస్‌ కేసులు బయటపడ్డాయి. అవి రోజు రోజుకూ పెరగడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 2,143 కేసులు నమోదు కాగా 135 మంది చనిపోయారు. వీరికి సరిపడా మందులను కేంద్ర ప్రభుత్వం సరఫరా చేయాల్సిఉండగా, అవసరం మేరకు అవి అందడం లేదు. దీంతో బ్లాక్‌ మార్కెట్‌లో అత్యధిక ధరలకు ఎంపోటెరిసిన్‌-బి ఇంజక్షన్లను అమ్మి సొమ్ముచేసుకుంటున్నారు.