Jan 12,2022 19:47

సందడికి, సంబరాలకూ రూపాలు బోలెడు. పండగ ఒక్కటే కావొచ్చు. కానీ, రకరకాల ఆనవాయితీలతో వైవిధ్యం వెల్లువెత్తుతోంది. వ్యవసాయ పండగ సంక్రాంతిలో ఈ విభిన్నత మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఉత్తరాంధ్ర, గోదావరి, కోస్తా, రాయలసీమ పల్లెల్లో వివిధ రూపాల్లో సందడి సన్నాహాలు జరుగుతున్నాయి. గోదావరిది కోడిపందేల ఉరవడి అయితే, ఉత్తరాంధ్రది తీర్థాల సందడి. కోస్తాలో కొన్నిచోట్ల ప్రభల ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తుంటే- రాయలసీమలో పశువుల పండక్కి ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే, ధాన్యం రైతుల దిగాలు, కోవిడ్‌ వ్యాప్తి భయాలు ... సంక్రాంతి కళను కొంత మసకబారేట్టు చేస్తున్నాయి.

గోదావరి జిల్లాల్లోని భీమవరం, అమలాపురం కోళ్ల పందేలకు పెట్టింది పేరు. వీటికోసం బరులను సిద్ధం చేసి మరీ ఉంచుతారు. బరిలోకి దిగే పోటీదారు కోడిపుంజు వేలలో ధర పలుకుతుంది. క్రీడాప్రాంగణం, జనసందోహం, తినుబండారాళ్ల స్టాళ్లు, సాంస్కృతిక కార్యకలాపాలు వంటివన్నీ జాతర వాతావరణాన్ని తలపిస్తాయి. ఇలాంటి పోటీలకు భిన్నంగా పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు ప్రాంతంలో ఐదు దశాబ్దాల నుంచి యువజన సంఘం ఆటల పోటీలు నిర్వహిస్తోంది. ఆ ఆనవాయితీని ఇప్పుడు చాలా జిల్లాల్లో యువజన, మహిళా సంఘాలు కొనసాగిస్తున్నాయి. ఆటలు, పాటలు, ముగ్గులు వంటి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. యువజన సంఘం ఆధ్వర్యంలో 1983లో ప్రారంభమైన ఈ వేడుకలు మొదట ఒకే ఒక క్రీడ చెడుగుడుతో ప్రారంభించారు. నేడు రాష్ట్రస్థాయిలో ఈ క్రీడలు 10 విభాగాలకు పైగా విస్తరించాయి.

ఒక్కో చోట ఒక్కో సందడి

1983 నాటికి ఆకివీడు, పరిసర గ్రామాల్లో జూద క్రీడలకు అడ్డాగా ఉండేది. దీంతో సంక్రాంతి సందర్భాల్లో ఆనందంగా జీవితాలను గడపాల్సిన ప్రజలు ఈ జూద క్రీడల్లో పాల్గొని ఆర్థికంగా నష్టపోయేవారు. ఈ నేపథ్యంలో అప్పటి డివైఎఫ్‌ఐ కమిటీలో ఉన్న కొంతమంది యువకులు ఈ సంస్కృతి నుంచి యువతను కాపాడాలని ముందుకు వచ్చారు. గ్రామీణ క్రీడలుగా ఉన్న చెడుగుడు పోటీలను పెద్దఎత్తున మొదలు పెట్టారు. ఆ క్రీడలను తిలకించడానికి ప్రజలు భారీగా తరలి వచ్చేవారు. ప్రజలు, యువత ఈ చెడుగుడు పోటీలను ఆకర్షించడంతో కార్యకర్తల్లో మంచి ఉత్సాహం కలిగింది. సంక్రాంతి సందర్భంలో నిర్వహించే ఈ పోటీలకు రాష్ట్రస్థాయిలో మంచి గుర్తింపు వచ్చింది. ఈ క్రీడలలో గుర్తింపు పొందిన అనేక మంది క్రీడాకారులు పాల్గొనేవారు. అలా ఒకే క్రీడతో ప్రారంభించిన ఈ సంక్రాంతి ఆటల పోటీలు కొద్ది సంవత్సరాలకు డివైఎఫ్‌ఐ సంక్రాంతి యువజనోత్సవాలుగా రూపాంతరం చెందాయి. చెడుగుడు తర్వాత వాలీబాల్‌ పోటీలు, జిల్లాస్థాయిలో బాల్‌ బాడ్మింటన్‌ రాష్ట్రస్థాయిలో పాటల పోటీలను స్థానికంగా బాడీ బిల్డింగ్‌ పోటీలు, మహిళలకు ముగ్గులు, మ్యూజికల్‌ చైర్స్‌ పోటీలతో పాటు జిమ్నాస్టిక్స్‌, మాల్కమ్‌ పోటీ, కరాటే, కర్రా సాధనం, కూచిపూడి నృత్యం తదితర పోటీలకు విస్తరించాయి.

ఒక్కో చోట ఒక్కో సందడి

రాయలసీమ కర్నూలు, కడప జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతి సందర్భంగా రాతి దూలం పోటీలు నిర్వహిస్తారు. రాతి దూలానికి కాడెద్దులను కట్టి లాగిస్తారు. నిర్దేశించిన ప్రదేశం నుంచి ఎక్కువ దూరం లాగిన ఎద్దులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు ప్రకటించి అదేరోజు బహుమతులు అందజేస్తారు. అయితే ఈ పోటీలు జిల్లా అంతటా నిర్వహించరు. పరిమిత సంఖ్యలో తక్కువ గ్రామాల్లో నిర్వహిస్తారు. గతంలో కొన్ని గ్రామాల్లో యువకులతో రాతి గుండు ఎత్తించి బహుమతులు ఇచ్చేవారు. అది ప్రస్తుతం నిర్వహించడంలేదు. తాడిపత్రిలో 2017లో పందుల పందెం నిర్వహించారు. గతంలో ఈ సంప్రదాయం ఉండేది కాదు. అనంతపురం జిల్లాలో కోళ్ల పందేలు అరకొరగా జరుగుతాయి.

ఒక్కో చోట ఒక్కో సందడి

చిత్తూరు జిల్లాలో సంక్రాంతిని పశువుల ప్రధాన పండగగా జరుపుకుంటారు. నెలరోజులపాటు సందడి కనిపిస్తుంది. రంగవల్లులు, రకరకాల పూలతో పేర్చే గొబ్బెమ్మలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. కొన్ని షెడ్యూలు తెగల జనాభాలో గొబ్బెళ్ల పాటల పోటీలు కూడా ఉంటాయి. డిసెంబరు 20 నుంచే కబడ్డీ పోటీలు మొదలవుతాయి. కులాలవారీగా వీటిని నిర్వహించడం కనపడుతుంది. ఆవుల పండగ, పశువుల పండగ అని పిలిచే జల్లికట్టును ఆంధ్రా, తమిళనాడు సరిహద్దు గ్రామాల్లో ముఖ్యంగా 8 నియోజక వర్గాల్లో నిర్వహిస్తారు. రాష్ట్ర నలుమూలల నుంచి వేల సంఖ్యలో ప్రజలు వస్తారు. కోనసీమ కోడిపందేలు తరువాత ఈ జల్లికట్టుకు విశేష ఆదరణ లభిస్తోంది.
 

సంక్రాంతి తరువాత తీర్థాలు
విశాఖ జిల్లాలో సంక్రాంతి తరువాత ప్రారంభమయ్యే తీర్థాల్లో ఎడ్ల పందేలు నిర్వహిస్తూ ఉంటారు. ఇందుకోసం మేలు జాతి ఎడ్లను కొనుగోలు చేసి ప్రత్యేకంగా మేపుతారు. పందేల్లో దేశవాళీ జాతికి చెందిన ఎద్దులు పాల్గన్నా, మైసూరు జాతికి చెందిన ఎద్దులే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ రకానికి చెందిన ఎద్దులు ఒకొక్కటి రూ.50 వేల నుంచి రూ. రెండు లక్షల వరకు ఖరీదు ఉంటాయి. విశాఖ జిల్లాలోని మాడుగుల మండలంలోని కెజె.పురం, చోడవరం, కొత్తపెంట, వేచలం, చీడికాడ, కొత్తపల్లి తదితర గ్రామాల్లో తేలికపాటి బళ్లను లాగుతూ అత్యంత వేగంగా పరుగెత్తే ఎద్దు పోటీలకు ఆదరణ ఉంది. కొన్ని గ్రామాల్లో గుర్రం పందేలు నిర్వహిస్తుండం ఆనవాయితీగా వస్తోంది. పోటీలో పాల్గొన్న గుర్రాలు నిర్ణీత సమయంలో వేగంగా లక్ష్యాన్ని చేరుకుంటే గెలిచినట్టే. అన్ని గుర్రాలు ఒకేసారి కాకుండా ఒక్కొక్కటి పరుగులు తీస్తూ వేగంగా లక్ష్యాన్ని చేరుకునే సమయాన్ని లెక్కించి విజేతను నిర్ణయిస్తారు. గుర్రం పందేలు ఏర్పాటు చేస్తుండడంతో వీటిని చూసేందుకు ఎక్కువమంది ఆసక్తి కనబరుస్తున్నారు. అచ్యుతాపురం, పరవాడ, చోడవరం, లక్కవరం తదితర గ్రామాల్లో గుర్రం పెంపకందార్లు ఉన్నారు. విశాఖ జిల్లా అనకాపల్లి సమీపంలోని బజ్జన్న కొండ కనుమరోజున జనంతో కిటకిటలాడుతుంది. రాష్ట్రంలోని చాలా బౌద్దారామాలు సంక్రాంతి రోజుల్లో సందర్శక కేంద్రాలుగా కళకళలాడతాయి.