Feb 23,2021 21:44

అమరావతిబ్యూరో : టిడ్కో నిర్మించిన 300 చదరపు అడుగుల గృహాలను ఒక్క రూపాయికే పేదలకు రిజిస్ట్రేషన్‌ చేయాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. ఈ నిర్ణయం ద్వారా 1,43,600 మంది పేదలు లబ్ధి పొందుతారని మంత్రి పేర్ని నాని చెప్పారు. లబ్ధిదారుడు చెల్లించాల్సిన రూ.50వేలను రూ.25వేలకు కుదించడంతో ప్రభుత్వంపై రూ.110కోట్లు భారం పడనుంది. 430 చదరపు అడుగుల ఇళ్లకు లక్ష రూపాయలు లబ్ధిదారునిగా వాటా చెల్లించాల్సి ఉండగా 50 శాతం తగ్గించామని, ఫలితంగా ఫ్రభుత్వంపై రూ.371కోట్లు భారం పడుతుందని మంత్రి తెలిపారు. ఇప్పటికే లబ్ధిదారుని వాటా పూర్తిగా చెల్లించిన వారికి తగ్గింపు మినహాయించి మిగిలిన నగదును త్వరలో లబ్ధిదారునికి ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. అదే విధంగా 2021 ఏప్రిల్‌1 నుంచి ప్రైవేటు లే అవుట్లలో సామాజిక అవసరాలకు కేటాయిస్తున్న పది సెంట్ల భూమికి అదనంగా మరో 5సెంట్ల భూమిని ఫ్రభుత్వానికి బదలాయించాలన్న ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. ప్రైవేటు లే అవుట్స్‌లో 5 సెంట్లు స్థలం లభ్యత కాని పక్షంలో 3 కిలోమీటర్ల దూరం లోపల కొనుగోలు చేసి కలెక్టర్‌ అప్పజెప్పాలని నిర్ణయం తీసుకున్నారు. అనుమతి లేకుండా లే అవుట్స్‌ వేసిన చోట రిజిస్ట్రేషన్స్‌ నిలుపుదల చేయడంతో పాటు నీటి కుళాయి కనెక్షన్స్‌, విద్యుత్తు కనెక్షన్లు ఇవ్వకూడదని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది.
ఎసిబి కేసుల్లో 100 రోజుల్లో విచారణ పూర్తి:
ఫ్రభుత్వ ఉద్యోగులు ఎక్కడైనా లంచం తీసుకుంటూ ఎసిబికి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన కేసుల్లో పూర్తి విచారణ 100 రోజుల్లో పూర్తి చేయాలని కేబినెట్‌ సమావేశం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఇటువంటి కేసులకు కాలపరిమితి రెండేళ్లుగా ఉందని, కాలవ్యవధిని కుదించారు. 100 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయని ఎసిబి అధికారులపై చర్యలు ఉంటాయని మంత్రి తెలిపారు.
                                                    మరికొన్నినిర్ణయాలు
అమరావతి ప్రాంతంలో ట్రంక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (రోడ్లు) ఎల్‌పిఎస్‌ పనులకు సంబందించి రూ.3వేలకోట్లకు ఆమోదం.
ఆర్బీకెల సరిధిలో మల్లీపర్పస్‌ సెంటర్లు (బహుళ సదుపాయాల కేంద్రాలు) ఏర్పాటు
రూ.2,719.11 కోట్లతో ఫామ్‌గేట్‌: ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అభివృద్ధి చేయడం. రూ.12వేల కోట్లతో పనులు చేపట్టడం.
వైఎస్‌ఆర్‌ జిల్లాలో స్టీల్‌ ప్లాంటు నిర్మాణానికి జాయింట్‌ వెంచర్‌ ఎంపిక, ఎస్‌బిఐ క్యాప్‌ సిఫార్సులను అనుసరించి లిబర్టీ స్టీల్‌ ఇండియా లిమిటెడ్‌ జేవిగా ఎంపిక. తొలిదశలో రూ.10,082 కోట్లు, రెండో దశలో రూ.6వేలకోట్లు వ్యయం.
టిటిడి దేవస్ధానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు స్ధలాల పంపిణీకి ఆమోదం.
ఎపి గేమింగ్‌ యాక్ట్‌ ా1974 సవరణకు ఆమోదం.