Nov 29,2020 12:30

మన ఇల్లు మరింత అందంగా కనిపించడానికి కొన్ని రకాల మొక్కలను నాటుతూ ఉంటాం. అలాంటి వాటిలో ముందు వరుసలో ఉంటాయి రాఖీ పువ్వులు. వంద రేకలతో ఉండే వీటిని ఎలాంటి ఔషధాల్లో వాడతారో ఈ రోజు తెలుసుకుందాం. అంతేనా.. చెట్టుకు పండు భారమైన కేజీ జామ... నిమ్మకాయ సైజులు ఉండే ఎర్రజామ... తియ్యగా మధురంగా ఉండే తియ్యని నిమ్మ గురించీ తెలుసుకుందాం.

నక్షత్ర కాంతులీనే రాఖీ పువ్వులు 
పూలజాతిలో మరో అబ్బురాలు రాఖీ పువ్వులు. వీటిని చూసిన వెంటనే ఆహా ఎంతద్భుతంగా ఉన్నాయి అనక తప్పదు. ఇవి తీగజాతి పాదు మొక్కలు. 'ప్యాసిప్లొరా' వీటి శాస్త్రీయ నామం. వీటిని ఎక్కడ వేస్తే అక్కడ పాదు చక్కగా ఎగబాకి నక్షత్రాల్లాంటి పువ్వులు పూస్తాయి. పూలకు చుట్టూతా సన్నటి కేసరాల్లాంటి నూరు రేఖలు ఉంటాయి. పువ్వు పైన మధ్య భాగంలో ఐదు పెద్ద రేఖలు ఉంటాయి. కాబట్టే వీటిని 'కౌరవ-పాండవ' పుష్పాలు అని పిలుస్తారు.

నక్షత్ర కాంతులీనే రాఖీ పువ్వులు 

ఇవి రకరకాల రంగుల్లో, రూపాల్లో పువ్వులు పూసే మొక్కలు. చూడ్డానికి రాఖీల్లా ఉండటంతో వీటిని 'రాఖీ' పూలమొక్కలనీ పిలుస్తారు. సాయంత్రం నాలుగు దాటితే రాఖీ పువ్వుల ఘాటైన వాసనలు చాలా దూరం వరకూ వెదజల్లుతాయి. ఈ మొక్క నుంచి తీసిని ఎక్సట్రాక్టుని హోమియోలో ప్యాసిప్లోరా ఇంకార్టీనేటా అనే మందును తయారు చేయడంలో ఉపయోగిస్తారు. ఈ ఔషధాన్ని నిద్ర బాగా పట్టడానికి, మానసిక ఒత్తిడి తగ్గడానికి ఉపయోగిస్తారు. ప్రహరీగోడల మీద, ఇంటి పోర్టోకోల మీద, డాబా పిట్టగోడల మీద, పెంకుటిళ్ల మీద, చలువ పందిళ్ల మీద ఈ పాదు చక్కగా అల్లుకుంటుంది. వాటి పూలు ఇంటికి మరింత శోభనిస్తాయి. మొక్కనాటిన ఏడాది నుంచే పువ్వులు పూయడం ప్రారంభమవుతుంది.


మధురమైన ఎర్రజామ
ఎర్రజామ ఎంతో తియ్యగా, మధురంగా ఉంటుంది. లోపల గుజ్జు, పైన రంగు రెండూ ఎరుపు రంగులో ఉండి, కాయ చూడ్డానికి భలే అందంగా మిలమిలా మెరుస్తూ ఉంటాయి. వీటి కాయలు మామూలు జామలా కాకుండా నిమ్మకాయ సైజులో ఉంటాయి. ఇవి గుత్తులు గుత్తులుగా కాస్తాయి. శీతల ప్రాంతాల్లో గణనీయంగాను, మామూలు ప్రాంతాల్లో సాధారణ కాపు ఉంటుంది. మొక్క ఐదడుగుల ఎత్తు వరకూ పెరుగుతుంది. దీనిని నేల మీద, పెద్దపాటి కుండీల్లోనూ పంచుకోవచ్చు. ఇది థాయిలాండ్‌ దేశానికి చెందిన జామ మొక్క. అయితే ఈ మొక్కను తోటలుగా వేసుకుని, ఫలసాయం పొందడానికి రైతులకు పెద్ద లాభసాటి కాదు. ఇంట్లో పెంచుకోవడానికి ఉత్తమమైన మొక్కగా చెప్పొచ్చు.

మధురమైన ఎర్రజామభళారే! కేజీ జామ:
చూడ్డానికి కనువిందే కాదు... తింటే ఉదర విందూ చేస్తుంది కేజీ జామ. అరచేతి పరిమాణంలో కేజీ బరువు ఉండడం వల్ల తైవాన్‌ రకానికి చెందిన దీన్ని 'కేజీ జామ' అని పిలుస్తారు నర్సరీ రైతులు. విటమిన్‌- సి పుష్కలంగా ఉండే ఈ జామకాయ ఎన్నో విశిష్టతలు కలిగి ఉంది. తెల్లటి గుజ్జుతో మంచి రుచిగా ఉంటుంది. దీనిలో చాలా తక్కువ గింజలు ఉంటాయి. ఎక్కువ కాయల్లో అస్సలు గింజలే ఉండవు. ముక్కలు కోసుకుని తినడానికి కేజీ జామకాయలు ఎంతో బాగుంటాయి. మధుమేహగ్రస్తులూ వీటిని తినొచ్చు.

 భళారే! కేజీ జామ: చూడ్డానికి కనువిం

అయితే కాయను పూర్తిగా ఒక్కరే తినగలగడం అసంభవమే! నాటిన రెండో సంవత్సరం నుంచీ వీటి కాపు మొదలవుతుంది. ఐదడుగుల ఎత్తు వరకూ చెట్టు పెరుగుతుంది. తల్లికి బిడ్డ భారమా? అన్నట్లు 'ఏ చెట్టుకాయలు ఆ చెట్టుకు బరువా?' అని అనుకుంటాం. కానీ కేజీజామ విషయంలో అది ముమ్మాటికీ తప్పే. ఎందుకంటే కేజీ జామకాయలు గుత్తులు గుత్తులుగా ఇరగ కాస్తాయి. కొమ్మలకు ప్రత్యేకమైన సపోర్టుతో కర్రలు కట్టకపోతే బరువు తట్టుకోలేక ఇరిగిపోతుంటాయి. నేల విశాలత, సారాన్నిబట్టి వీటి కాపు కాసే తీరు ఉంటుంది. ఇంటి పెరట్లో ఇలాంటి చెట్టొకటి ఉంటే అతిథులొచ్చినప్పుడు ఆపద్భాంధవువే.

తియ్య నిమ్మ
నిమ్మకాయ పేరు చెప్పగానే మదిలో పుల్లని రుచులు కదలాడి నోటిలో లాలాజలం ఊరుతుంది. అలాంటి నిమ్మ తేనెలొలుకు తియ్యని మధుర రుచులు ఇస్తుందంటే నమ్ముతారా? నమ్మడమెందుకు హాయిగా తినే చూడొచ్చు... ఈ స్వీట్‌ లెమన్‌ మొక్కను పెంచుకుంటే!. ఈ కాయ రుచే కాదు, ఆకారం, పరిణామమూ విభిన్నమే! ఈ కాయ ఆకారం గుండ్రంగా కాకుండా పొడవుగా దొండకాయలా ఉంటుంది.

 భళారే! కేజీ జామ: చూడ్డానికి కనువిం

కాయగా ఉన్నప్పుడు ఆకుపచ్చగాను, పరువానికి వచ్చాక కాషాయి రంగులోకి మారుతుంది. ఈ కాయలను తొక్కతోబాటు తింటేనే తియ్యగా ఉంటాయి. ఇది సిట్రస్‌ ఫ్యామిలీకి చెందిందే. వీటిలో విటమిన్‌- సి పుష్కలంగా ఉంటుంది. ఈ మొక్క అన్ని వాతావరణాలలోనూ పెరుగుతుంది. ఈ మొక్క రెండు నుంచి మూడడుగుల ఎత్తు పెరుగుతుంది.
వీటిని కుండీల్లోనూ, నేలమీదా పెంచుకోవచ్చు.
                                                                             * చిలుకూరి శ్రీనివాసరావు, 8985945506