Nov 29,2020 12:16

దృశ్యాదృశ్య ప్రపంచంలో
అతని కుంచె
నలుపూ తెలుపూ రంగుల్లోనే
జీవితాత్మను వెతుక్కుంటుంది
వెతుకులాటను జీవితం కాదన్నవాడెవడు
వెతకటమే
జీవనసొరంగంలోకి ప్రయాణించటమే
బతుక్కి అర్థం
ఔను మహాశయుల్లారా
మీ వర్ణశోభిత దక్కులలో
అతను అంతరించిపోడు
నిజం, ఏ రంగుల కళాఖండాలను
అతని కుంచె చిత్రించింది లేదు
చిత్రించదు
నగరీకరణకు
అతని కుంచె దూరం
ఔను మహాశయుల్లారా
ఔను
అతనిది పల్లెముఖం
నువ్వు
నలభైఏళ్ల వయసులో
బట్టలన్నీ చెర్వువొడ్డున విడిచి
నగంగా నీళ్లలోకి దుమకలేవు
అతను దుమకగలడు
అదే అతనికీ నీకూ తేడా
సాధారణంగా బతకడమే
నిజానికి అసాధారణ విద్యని
అతని పాదం నడిచిన తోవంతా
బతుకు చిహ్నాలను
ముద్రించుకుంటూ వెళ్లిపోతుంది
అతను చిత్రించిన దృశ్యాల్లోపల
సన్నని జీరగొంతు కేర్‌ మంటుంది
అది అతని విముక్తి
కనిపించడంలో కన్నా
కనిపించకపోవడంలోనే
అతను
మిగులుతాడు
అపురూప సౌందర్యవంతుడు
అతను
దృశ్యాదృశ్య ప్రపంచంలో
నలుపూ తెలుపూ రంగులనద్దుకుని
ఒక అవర్ణపు కళాఖండంగా
మిగిలిపోవటం
అతనికి తెలిసినట్టు
                  * బాలసుధాకర్‌ మౌళి, 9676493680