Oct 27,2021 18:23

వాషింగ్టన్‌ : అగ్రరాజ్యమైన అమెరికాను సుదీర్ఘకాలంగా.. ఊబకాయ సమస్య వెంటాడుతూనే ఉంది. ఈ దేశంలో కేవలం ఊబకాయం సమస్య వల్లే..ఏటా 40 లక్షలమంది చనిపోతున్నారని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. అక్కడ పెద్దవారితోపాటు.. చిన్నపిల్లలు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని నివేదిక పేర్కొంది. అయితే ఈ సమస్యకు వైద్యులు సురక్షితమైన చికిత్స, సదుపాయాలు సూచిస్తున్నప్పటికీ చికిత్స ఖర్చు ఎక్కువగా ఉండడం వల్ల.. అక్కడి ప్రజలు వెనకడుగువేస్తున్నట్లు తాజాగా ఎండోక్రైన్‌ సొసైటీ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంది. అందుకే ఇన్సూరెన్స్‌ కంపెనీలు ఇలాంటి సమస్యల్ని పరిగణనలోకి తీసుకుని మెరుగైన చికిత్సనందించేందుకు తోడ్పడాలని నిపుణులు నివేదికలో పేర్కొన్నారు.
స్థూలకాయం సమస్యతో.. మధుమేహం, కాలేయానికి కొవ్వు పట్టడం (ఫ్యాటీ లీవర్‌)తో పాటు గుండె సంబంధ వ్యాధులకు కారణమవడంతో.. ఆయుర్దాయం, నాణ్యమైన జీవనంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్లు మసాచుసెట్స్‌లోని బెత్‌ ఇజ్రాయెల్‌ డియోకొనెస్‌ మెడికల్‌ సెంటర్‌కి చెందిన సీనియర్‌ వైద్యులు క్రిస్టోస్‌ ఎస్‌ మాంట్‌జొరొస్‌ పేర్కొన్నారు. అయితే ఊబకాయం వల్ల హార్మోన్‌ల ప్రభావంతో ఇతర రుగ్మతలకు ఏవిధంగా కారణమవుతుందనే విషయాలను తెలుసుకోగలుగుతున్నామని.. దీనికి చికిత్సలు కూడా రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.