Oct 12,2020 19:06
ఓ చేతిని నరుక్కుని సంతోషంగా ఉండగలమా?

సీనియర్‌ నటి మధుబాల.. యుపీ సామూహిక అత్యాచార ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ... ఒక వీడియో షేర్‌ చేశారు ''నేను ఈ ప్యాండమిక్‌ సమయంలో ఇదే మొదటిసారి మీ ముందుకు వచ్చాను. నేను ముఖానికి ఎటువంటి మేకప్‌ వేసుకోకుండా, చెమట కారుతూ, చిందరవందరగా ఉన్న జుట్టుతో మీముందున్నాను. 'హ్యాపీడెమిక్‌' సమయంలో మచ్చలేని ముఖం, మచ్చని కవర్‌ చేసే ఫొటోగ్రాఫ్‌లు అవసరం లేదని భావిస్తున్నాను. హ్యాపీడెమిక్‌ అంటే స్వచ్ఛమైన మనసుతో కలిసిమెలిసి జీవించడం అని అర్థం. మనమంతా లాక్‌డౌన్‌ కాలంలో అనేక విషయాలు తెలుసుకున్నాం. అన్ని రకాల బాధల్లోనూ ప్రేమగా మెలగడం, నవ్వుతూ బతకడం తెలుసొచ్చాయి. ఎన్ని సమస్యలు వచ్చినా అధిగమించుకుంటూ ముందుకు ఎలా వెళ్లాలి అనే విషయాలూ తెలిసాయి. ఈ మహమ్మారిని ఎదుర్కొనే సమయంలో ఎందరో రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. కొందరు ఈ వైరస్‌ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. మరి కొందరు కుటుంబాలు నిరాధారమయ్యాయి. ఎందరో తమ ఉద్యోగ, ఉపాధి, విద్య, ఆర్థిక అంశాల్లో నష్టపోయారు. ఇటు వంటి ఈ పరిస్థితిని మనం ఎదుర్కొంటున్నామంటే కేవలం అది సానుకూల ఆలోచనలతో, మానవత్వంతో ఒకరికొకరం సాయం చేసుకుంటూ సాగుతున్నాం కాబట్టి.


ఎన్ని సమస్యలు వచ్చినా మనిషి వాటిని అధిగమించి ముందుకు వెళ్లగలుగుతున్నాడు. ఇది కేవలం మనిషికే సాధ్యం. కాని ఇదే విషయాన్ని రేప్‌ చేసిన మనిషి గురించి చెప్పగలమా? అత్యాచారాన్ని సమర్థించగలమా? నిర్భయ ఘటన తర్వాత రేప్‌లు తగ్గాయా? ఒక మనిషి మరో మనిషిని ఇంత కిరాతకంగా ఎలా హింసించి చంపగలుగు తున్నాడు? ఈ భూమ్మీద మనమంతా ఒకే జాతికి చెందిన వారంగా ఉన్నప్పుడు అంత కిరాతకంగా ఎలా ప్రవర్తిస్తున్నారు? ఇంతటి సిగ్గుమాలిన కర్కశత్వపు దాడిపైన కేవలం సానుభూతో లేక సహానుభూతో చూపటం వల్ల బాధితులకు ప్రయోజనం ఉండదు. రేప్‌కు గురైన మహిళకు, వారి కుటుంబ సభ్యులకు జరిగే నష్టాన్ని ఏమన్నా పూడ్చగలమా? అత్యాచారం అనేది కేవలం మనిషి విషపూరిత ఆలోచనలో ఉందని చెప్పి ఊరుకోవాలా? మనిషి మానసిక పరిస్థితి బాగాలేదని ఒక్క కారణం చెబితే సరిపోతుందా? దీనంతటికి కారణం మహిళలు ధరించే దుస్తులని చెప్పడం ఏమన్నా గొప్పతనమా..!?


తాగుడుకి బానిసైన వ్యక్తిని వదిలేయకుండా ఆ అలవాటు తగ్గించేందుకు చికిత్స పొందటం లేదా? అందుకు కుటుంబం అంతా సహకరించటం లేదా? ఒకవేళ రేపిస్టు మనస్తత్వం ఉంటే.. కనుక వారిని మాత్రం అలా ఎందుకు వదిలేయాలి? అటువంటి ఆలోచనలు ఉంటే.. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నన్ను లాక్‌ చేయండని స్వేచ్ఛగా చెప్పలేరా? నేను ప్రభుత్వాన్ని, చట్టాన్ని పరిరక్షించేవారిని (చట్టసభ సభ్యులు) ఒక్కటే కోరుతున్నాను. రేపిస్టులకు పడ్డ శిక్ష కఠినాతికఠినంగా ఉండాలి. ఆ శిక్ష ప్రజలందరికీ తెలిసేలా బహిరంగంగా ఉండాలి. ఇటువంటి ఆలోచన వస్తేనే భయభ్రాంతులకు లోనవ్వాలి. అప్పుడే ఆ ఆలోచన ఉన్నవారికి భయం వస్తుంది. ఈ పరిస్థితుల్లో అమ్మాయిల్ని, మహిళల్ని కాదు చైతన్యం చేయాల్సింది. ఇక్కడ అమ్మాయిలూ అబ్బాయిలూ అని విడదీయకూడదు. ఆడ మగ అనేకంటే ముందు మనమంతా మనుషులమని, మానవత్వం ఉన్నవారమని వారికి ఇంట్లో తల్లిదండ్రుల నుంచి పాఠశాలల్లో ఉపాధ్యాయుల వరకూ చిన్నతనం నుంచే బోధించాలి.


ప్రియమైన అబ్బాయిలూ, అన్నలూ, తమ్ముళ్లూ... అమ్మాయే లేకుంటే మీరెలా బతికేవారు. ఒక్కసారి ఆలోచించండి. మీరు మీ కుడి చేత్తో ఎడమ చేతిని నరికి సంతోషంగా ఉండగలరా..!? అమ్మాయిలే లేకుంటే మీరే లేరు అని గుర్తించండి. అలాగే మీరు లేకుండా మేమూ ఉండమని మాకూ తెలుసు. ఈ భూమ్మీద అందరం ఉండాలి. ఆనందంగా ఉండాలి. ఈ రేప్‌లను ఇంతటితో ఆపేయండి..! అందులో కులం మతం, ప్రాంతం, లింగ, విద్వేషం, వైషమ్యాలతోపాటు ఈ అసమానతల్ని వీడండి. మనుషుల మధ్య అంతరాల్ని వీడి ఈ భూమ్మీద మనమంతా సమానంగా బతుకుదాం.'' అంటూ ఆవేదనతో స్పందించారు నటి మధుబాల.