Oct 28,2021 20:32

న్యూఢిల్లీ :  కరోనా వ్యాప్తి కొనసాగుతోంది.  భారత్‌లో గత కొన్ని రోజులుగా కేసులు సంఖ్య భారీగా తగ్గినప్పటికీ.. కరోనా పూర్తిగా సమసిపోలేదని, థర్డ్‌ వేవ్‌ ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ, నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే రష్యా, సింగపూర్‌ల్లో కరోనా కొత్త వేరియంట్‌ అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఈ  కొత్త వేరియంట్‌ ఎవై.4.2 దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వెలుగుచూడటం తీవ్ర భయాందోళనలను కలిగిస్తోంది. ఈ వేరియంట్‌కు సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా 17 కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. ఈ కొత్త వేరియంట్‌.. సెకండ్‌ వేవ్‌ సమయంలో తీవ్ర నష్టం కలిగించిన డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కుటుంబానికి చెందినదని, ఈ వేరియంట్‌తో కరోనా థర్డ్‌ వేవ్‌ వచ్చే అవకాశం అధికంగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఎపి, కేరళ, తెలంగాణ, జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రాల్లో ఈ కొత్త వేరియంట్‌ ప్రవేశించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం అధికారులు ఈ కొత్త వేరియంట్‌ గురించి   పరిశోధిస్తున్నారు.