Sep 15,2021 19:38

చెన్నై : తమిళనాడులో వరుసగా నీట్‌ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా వెల్లూరు జిల్లాలోని కాట్‌పాడి వద్ద తలయారంపట్టు గ్రామానికి చెందిన సౌందర్య (17) బుధవారం ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతి చెందడంపై తల్లిదండ్రులు కుటుంబసభ్యులు తీవ్రంగా రోదిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 'నలుగురు ఆడపిల్లల్లో సౌందర్య చిన్నది. తన అక్కలందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. ఆమె తల్లిదండ్రులిద్దరూ రోజువారీ కూలీలు. సౌందర్య ఆదివారం రాసిన నీట్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేనని ముందుగా తల్లిదండ్రులకు చెప్పగా.. వారు తదుపరి పరీక్షలో ఉత్తీర్ణత సాధించవచ్చని ధైర్యం చెప్పారు. అయినా.. తల్లిదండ్రులిద్దరూ బుధవారం ఉదయం పనికివెళ్లిన సమయంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని డిఎస్‌పి పళనీ తెలిపారు.
ఈ ఘటనపై సెక్షన్‌ 174 కింద కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు వెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. సౌందర్యనే కాదు.. ఆదివారం సేలం సమీపంలోని మెట్టూరు చెందిన ధనుష్‌ (19), మంగళవారం అరియలూరుకు చెందిన కనిమొళి(17) కూడా ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం.
నీట్‌ విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలు చేసుకోవడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె స్టాలిన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. 'దయచేసి మీ జీవితాలను అంతం చేసుకోకండి. మీకు అసాధ్యమైనదేదీ లేదు. ఆ నమ్మకంతోనే చదువుకోండి. తల్లిదండ్రులు కూడా పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపాలి. అంతేకానీ.. వారిపై చదువుకోమని ఒత్తిడి చేయకూడదు' అని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా భయాందోళనలో ఉన్న పిల్లలు.. మానసిక స్థైర్యం కోసం 104కి ఫోన్‌ చేసి.. మానసిక వైద్య నిపుణులతో మాట్లాడాలని ఆయన సూచించారు. ఇక ఆ రాష్ట్రంలో వైద్య కోర్సులకు నీట్‌ ఆధారిత ప్రవేశాన్ని నిలిపివేయడానికి సోమవారం కొత్త బిల్లును ఆమోదించింది. అయితే ఈ బిల్లుకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌ సంతకం లేకుండా అమలులోకి రాదు. గతంలో యుపిఎ హయాంలో ఎంకె కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నీట్‌ నుండి రాష్ట్రాన్ని మినహాయించి రాష్ట్రపతి ఆమోదం పొందగలిగారు. గతంలో తమిళనాడు నీట్‌ పరీక్షల్ని పది సంవత్సరాలపాటు రద్దు చేసింది.