Sep 15,2021 19:38
  • ఓవరాల్‌గా 28 శాతం పెరిగిన కేసులు
  • ఎన్‌సిఆర్‌బి నివేదిక వెల్లడి

న్యూఢిల్లీ : 2020లో ఎస్సీ, ఎస్టీలపై అకృత్యాలు పెరిగినట్లు జాతీయ నేర నమోదు బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) వెల్లడించింది. రోజుకు సగటున 77 రేప్‌ కేసులు, 80 మర్దర్‌ కేసులు నమోదయ్యాయని, ఓవరాల్‌గా 28శాతం మేర కేసులు పెరిగాయని ఎన్‌సిర్‌ాబి తెలిపింది. పెరిగిన కేసుల్లో కోవిడ్‌ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించినవి ఎక్కువగా ఉన్నాయని ఆ నివేదిక పేర్కొంది. ఎస్‌సిలపై నమోదైన నేరాలు/అకృత్యాలు దాదాపు 9.4శాతం పెరిగాయి. అంటే మొత్తంగా 50,291 కేసులు నమోదయ్యాయి. వీటిల్లో కేవలం మనోభావాలను దెబ్బతీసిన కేసులే 32.9శాతం (16,543) కాగా ఎస్‌సి, ఎస్‌టి (అత్యాచారాల నివారణ) చట్టం కింద 8.5శాతం (4,273) కేసులు, నేరపూరితమైన రీతిలో అడ్డగించిన కేసులు 7.5శాతం(3,788) వున్నాయని ఆ నివేదిక పేర్కొంది. వీటిల్లో ఎస్‌టిలపై పాల్పడిన నేరాలకు నమోదైన కేసులు 8,272గా వున్నాయి. అంటే 2019 కన్నా 9.3శాతం ఎక్కువగా వున్నాయి.

లక్షమందిలో 487మంది నేరాలకు పాల్పడ్డారు
దేశద్రోహం కేసులు 2019లో 93 నమోదు కాగా గతేడాది తగ్గి 73కి చేరాయి. మణిపూర్‌లో 15, అస్సాంలో 12, కర్నాటకలో 8, ఉత్తరప్రదేశ్‌లో 7, హర్యానాలో 6, ఢిల్లీలో 5, కాశ్మీర్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. 2019లో మొత్తంగా 51,56,158 కేసులు నమోదు కాగా గతేడాది 28.8శాతం అంటే 14,45,127 కేసులు పెరిగాయి. అంటే లక్ష మంది జనాభాకు నమోదైన నేరాల రేటు 2019లో 385.5 వుండగా, 2020లో 487.8కి పెరిగిందని ఆ నివేదిక పేర్కొంది. 2020లో భారతీయ శిక్షా స్మృతి కింద నమోదైన కేసులు 31.9శాతంగా వున్నాయి. మొత్తంగా 66,01,285 నేరాలు నమోదు కాగా, వీటిల్లో 42.54లక్షలు కేసులు ఐపిసి కింద దాఖలయ్యాయి. 23.46లక్షలకు పైగా కేసులు ప్రత్యేక, స్థానిక చట్టాల (ఎస్‌ఐఎల్‌) కింద నమోదయ్యాయని నివేదిక పేర్కొంది. సాంప్రదాయ రీతిలో సాగే నేరాలు రెండు లక్షల వరకు తగ్గాయని తెలిపింది. 2020లో 55.84లక్షల కేసులు దర్యాప్తు దశలో వున్నాయి. వాటిల్లో 34.47లక్షల కేసులను పరిష్కరించారు. దాదాపు 26.12లక్షల కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేశారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే చార్జిషీట్లు దాఖలు చేసిన రేటు కూడా 12.5శాతం పెరిగింది.

లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌ !
గతేడాది మార్చి 25 నుండి మే 31వరకు కోవిడ్‌ లాక్‌డౌన్‌ వుండడంతో మహిళలు, పిల్లలు, వృద్ధులపై జరిగే నేరాలు, దొంగతనాలు, దోపిడీలు తగ్గాయని నివేదిక పేర్కొంది. హత్య కేసులు మాత్రం ఒక శాతం పెరిగాయి. ఈ హత్యలకు ప్రేరేపించిన కారణాల్లో వ్యక్తిగత కక్షలు లేదా శతృత్వం, లాభాల కోసం జరిగినవి ఇలా పలు రీతుల్లో వున్నాయి. కిడ్నాప్‌ లేదా అపహరణ కేసులు 19.3శాతం మేర తగ్గాయి. వీరిలో 73,721మంది మహిళలు కిడ్నాప్‌ కాగా, పురుషులు 14,869గా వున్నారు. ఎస్‌సిఆర్‌బి డేటా ప్రకారం వీరిలో మైనర్లు 56,591మంది (8,175మంది బాలురు, 47,876మంది బాలికలు)గా వున్నారు. పెద్దవారు 31,999మందిగా వున్నారు. మొత్తంగా 91,458మంది కిడ్నాప్‌ అవగా, 281మంది చనిపోయి శవంగా తేలారు. ప్రజల శాంతి భద్రతలకు సంబంధించి 71,107 కేసులు నమోదయ్యాయి. అంటే 2019తో పోలిస్తే ఈ నేరాలు 12.40శాతం ఎక్కువ. వీటిల్లో 51,606 కేసులు ఘర్షణలకు సంబంధించినవే. మహిళలపై నమోదైన నేరాలు 8.30శాతం తగ్గాయి. నమోదైన కేసుల్లో భర్త లేదా బంధువుల దాష్టీకానికి సంబంధించిన కేసులే మెజారిటీగా వున్నాయి. ఆ తర్వాత అత్యాచార ఉద్దేశ్యంతో దాడి జరిపిన కేసులు 23శాతంగా వుండగా, కిడ్నాప్‌ (16.8శాతం), అత్యాచారం (7.5శాతం) కేసులు నమోదయ్యాయి. 2020లో బాలలపై మొత్తంగా 29,768 కేసులు నమోదయ్యాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 7.8శాతం కేసులు తగ్గాయి. 1,45,754 ఆర్థిక నేరాలు నమోదయ్యాయి. 2019తో పోలిస్తే 12శాతం తగ్గాయి. అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన కేసులు 27శాతం తగ్గాయి. మానవుల అక్రమ రవాణా కేసులు కూడా తగ్గాయి.