Jun 11,2021 15:10

ప్రజాశక్తి-తిరుమల
న్యాయ వ్యవస్థను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లడానికి కృషి చేస్తానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అన్నారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని సతీసమేతంగా శుక్రవారం ఆయన దర్శించుకున్నారు. ఆ తర్వాత శ్రీబేడి ఆంజనేయస్వామివారి దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆయన ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ తన జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగాయన్నారు. స్వామివారి ఆశీస్సులతో ఈ స్థాయికి వచ్చానని పేర్కొన్నారు. దీనికి ముందు జస్టిస్‌ రమణకు టిటిడి చైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి, ఇఒ డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి, ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, ఇతర అర్చకులు స్వాగతం పలికారు. టిటిడి పాలకమండలి సభ్యులు, ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, అదనపు ఇఒ ఎవి ధర్మారెడ్డి, టిటిడి బోర్డు సభ్యులు పాల్గన్నారు. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో చీఫ్‌ జస్టిస్‌ను పండితులు ఆశీర్వదించారు. చైర్మన్‌, ఇఒ ఆయనకు తీర్థ ప్రసాదాలు, చిత్రపటం అందజేశారు. అనంతరం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని జిస్టిస్‌ రమణ దర్శించుకున్నారు. రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని తిరుగు ప్రయాణమయ్యారు. ఆయనకు ఎపి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.లలితకుమారి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి రవీంద్రబాబు, ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ వీడ్కోలు పలికారు.