Nov 26,2020 07:32

నేటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కార్మిక లోకం సమాయత్తమైంది. మౌలిక పని ప్రదేశాలపై, కార్మికులు, ప్రజల ప్రజాస్వామ్య, రాజ్యాంగ హక్కులపై బిజెపి ప్రభుత్వ దాడులను తీవ్రంగా ఖండిస్తూ, ఆన్‌లైన్‌లో జరిగిన జాతీయ సంయుక్త కార్మిక సంఘాల సదస్సు ఒక డిక్లరేషన్‌ను ఆమోదించింది. కార్మికుల ఏడు డిమాండ్లపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తూ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు జాతీయ సదస్సు పిలుపిచ్చింది.
నయా ఉదారవాదాన్ని ముందుకు తీసుకెళ్ళాలన్న... హిందూ రాష్ట్రాన్ని స్థాపించాలనే ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రాజెక్టును అమలు చేయాలన్న...రెండు లక్ష్యాలను సాధించేందుకు బిజెపి ప్రభుత్వం రాజ్యాంగ, పార్లమెంటరీ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘిస్తోంది. ఈ ప్రభుత్వానికి దేశ విదేశాలకు చెందిన బడా కార్పొరేట్ల మద్దతు, ఆశీర్వాదాలు వున్నాయి. వారికి అనుగుణంగా మోడీ సర్కార్‌ వ్యవహరిస్తోంది. వారి లాభాలను గరిష్ట స్థాయిలో పెంచేందుకు, సంపదను కూడబెట్టేందుకే ఈ నయా ఉదారవాద ఎజెండా పని చేస్తోంది. ఆర్‌ఎస్‌ఎస్‌ చేపట్టిన హిందూ రాష్ట్ర ప్రాజెక్టు సమాజాన్ని విభజిస్తోంది. ఐక్యతను దెబ్బ తీస్తోంది. మత విభజన తీసుకు రావడం ద్వారా నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలను బలహీన పరుస్తోంది.
సెక్షన్‌ 38(2) ప్రకారం, రాష్ట్రాలు ముఖ్యంగా ఆదాయ అసమానతలు తగ్గించడానికి కృషి చేయాలి. కేవలం వ్యక్తుల్లోనే కాకుండా వివిధ వృత్తుల్లో వున్న, వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల హోదా, సౌకర్యాలు, అవకాశాల్లో అసమానతలను నిర్మూలించడానికి కృషి చేయాలి. ప్రభుత్వం ముఖ్యంగా నయా ఉదారవాదం పరిధిలో పని చేస్తున్న ప్రభుత్వం ఈ రాజ్యాంగబద్ధమైన బాధ్యతల నుండి పూర్తిగా వైదొలగింది. 'అసమానతలను తగ్గించడం' ఒక ముఖ్యమైన డిమాండ్‌గా కనీసం లేవనెత్తడం లేదు.
ప్రపంచ వ్యాప్తంగానూ..మన దేశంలోనూ.. నయా ఉదరావాద పాలనలో అసమానతలు మరింత పెరుగుతున్నాయనేది అర్ధమవుతోంది. మోడీ నేతృత్వం లోని బిజెపి ప్రభుత్వ హయాంలో దేశంలో అసమానతలు భయంకరమైన స్థాయిలకు పెరుగుతున్నాయి. లాక్‌డౌన్‌ సమయంలో కూడా, మొత్తంగా ఉత్పత్తి రంగం స్తంభించిపోయినప్పటికీ, జిడిపి ప్రతికూల అభివృద్ధిని నమోదు చేసినప్పటికీ, లక్షలాది మంది కార్మికులు తమ ఉద్యోగాలను, ఆదాయాలను కోల్పోయినప్పటికీ ఈ ప్రభుత్వ కార్పొరేట్‌ మిత్రులు కొద్దిమంది మాత్రం వారి ఆదాయాలు, సంపదను రికార్డు స్థాయిలో పెంచుకున్నారు.
ఇక్కడ బిజెపి ప్రభుత్వానికి, ప్రధాని మోడీకి సంపద సృష్టికర్తలు బడా కార్పొరేట్లు కానీ, కార్మికులు కాదు. పెట్టుబడులు పెట్టే కార్పొరేట్లకు రాయితీల పేరుతో రూ. లక్షల కోట్ల ప్రజా ధనాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ప్రజల కొనుగోలు శక్తిని పెంచడం ద్వారా డిమాండ్‌ను సృష్టించడానికి బదులుగా ప్రభుత్వం మరింత మొత్తాన్ని కార్పొరేట్ల చేతుల్లోకి బదిలీ చేస్తోంది. లాక్‌డౌన్‌ కారణంగా లక్షలాది మంది కార్మికులు తమ ఆదాయాలను కోల్పోయి పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులతో సహా ఆకలితో అల్లాడుతున్నా ఈ బిజెపి ప్రభుత్వం కార్మిక సంఘాలు డిమాండ్‌ చేసినట్లుగా నెలకు రూ.7500 చొప్పున వారి ఖాతాలకు బదిలీ చేయడానికి తిరస్కరించింది. అవసరంలో వున్నవారందరికీ నెలకు 10 కిలోల ఆహార ధాన్యాలు ఉచితంగా పంపిణీ చేయడానికి తిరస్కరించింది. కానీ కార్పొరేట్‌ పన్ను రిలీఫ్‌ను ప్రకటించింది. బడా కార్పొరేట్లకు చవకగా రుణాలు, ఇతర రకాల రాయితీలు ప్రకటించింది. పైగా ఈ రాయితీల వల్ల ఉద్యోగాల కల్పన జరుగుతుందని, ప్రజలకు ముఖ్యంగా యువతకు లాభం కలుగుతుందని వాదిస్తోంది. అయితే, గ్యారంటీతో కూడిన మార్కెట్లు లేకపోవడంతో ఏ ప్రైవేటు కార్పొరేట్‌ పెట్టుబడి కూడా రానందున ఇదంతా మిధ్య అని నిరూపితమైంది.
కార్మికుల హక్కులను తిరస్కరిస్తూ, ప్రజలకు ఎలాంటి స్వాంతన అందించకపోవడానికి వనరుల కొరత అనేది ప్రభుత్వాలు చెప్పే చాలా సాధారణమైన సాకు అయిపోయింది. అది ఇప్పటి బిజెపి ప్రభుత్వమైనా, గత కాంగ్రెస్‌ ప్రభుత్వాలైనా వారు చెప్పేదొక్కటే. బడా కార్పొరేట్లు, సుసంపన్నులు ఇటువంటి రాయితీలకు, మినహాయింపులకు అర్హులు. ఎందుకంటే వారు కష్టపడి పనిచేస్తారు. ప్రతిభా పాటవాలు కలిగినవారు, పెట్టుబడులు పెట్టి, సంపదను సృష్టించడంలో ముప్పు ఎదురైనా వాటిని ఎదుర్కొనగలిగే ధైర్యమున్న వారని ప్రజల్ని నమ్మించేలా చేశారు. కార్మికులు, నిరుపేదలు సోమరిపోతులని, వృధా ఖర్చులు పెట్టేవారని, నైపుణ్యాలు లేవని, కాబట్టి అరకొరగా వున్న ఆర్థిక వనరులను వారిపై వృధా చేయలేమన్నది ప్రభుత్వం అభిప్రాయంగా వుంది. ఈ తరహా వైఖరి కారణంగానే అసమానతలు ఇంకా పెరుగుతున్నాయి. కోవిడ్‌ లాక్‌డౌన్‌కు ముందు కూడా ఆర్థిక వ్యవస్థ క్షీణించి వున్నప్పటికీ అప్పటి నుండి కోలుకోవడంలో విఫలమవుతోంది.
ఆదాయ అసమానతలు తగ్గించాలన్న డిమాండ్‌ను ప్రజలు లేవనెత్తకుండా వుండేందుకు పాలక వర్గాలు సృష్టించిన తప్పుడు భావన ఇది. దీన్ని ఎండగట్టాల్సిన అవసరం ఎంతైనా వుంది. రాజ్యాంగ ఆదేశిక సూత్రాల ప్రకారం, ఆదాయ అసమానతలు తగ్గించాలన్న డిమాండ్‌ కార్మిక వర్గం, ప్రజల ప్రధాన డిమాండ్లలో ఒకటిగా వుండాలి.
సంపద ఇలా ఇబ్బడి ముబ్బడిగా పెరగడానికి కఠోర పరిశ్రమ, పొదుపు, నైపుణ్యం వంటి కారణాలకు బదులుగా, వారసత్వం, గుత్తాధిపత్యం, ఆశ్రిత పక్షపాతం, పన్ను ఎగవేత, కార్మికుల దోపిడి పెరగడం వంటివి ప్రధాన కారణాలని చెప్పాల్సి వుంటుంది. కోటీశ్వరుల్లో మూడింట రెండు వంతుల మంది సంపద కేవలం వారసత్వం, గుత్తాధిపత్యం, ఆశ్రిత పక్షపాతం కారణంగానే పెరిగాయని అంచనా వేయబడింది.
సంపద ఒక్కచోటే పోగుపడడానికి గల కారణాల్లో ఒకటి వారసత్వం ద్వారా సంపద బదిలీ. చాలావరకు బడా కంపెనీల యాజమాన్య బాధ్యతలు, నిర్వహణ, సంపద అన్నీ కూడా వారి పిల్లలకు, ఇతర కుటుంబ సభ్యులకు బదలాయింపు జరుగుతుంది. నైపుణ్యం లేదా పోటీ కన్నా కూడా ఎక్కువగా పుట్టుక అనేది యాజమాన్య బాధ్యతలను బదిలీ చేసే అంశాన్ని నిర్ణయిస్తుంది. గత 20 ఏళ్ళ కాలంలో, ప్రపంచంలోనే కుబేరులైన 500 మంది వ్యక్తులు తమ వారసులకు 2.4 లక్షల కోట్ల డాలర్లను అందచేశారు.
అత్యంత అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలతో సహా చాలా దేశాలు ఇటువంటి వారసత్వ సంపదపై పన్నులు విధిస్తున్నాయి. అమెరికాలో ఈ వారసత్వ పన్ను 40 శాతం పైగా వుండగా, జపాన్‌లో 50 శాతం వసూలు చేస్తోంది. కానీ భారత్‌లో మాత్రం సంపద పన్ను కానీ వారసత్వ పన్ను కానీ లేదు. సంపన్నులపై ఇటువంటి సంపద పన్ను, వారసత్వ పన్ను విధించినట్లైతే ప్రజల మౌలిక హక్కులపై ఖర్చు పెట్టడానికి, అవసరాలు తీర్చడానికి అవసరమైన ధనం అందించడానికి కావాల్సిన ఆర్థిక వనరులు సమకూరతాయి. ప్రొ|| ప్రభాత్‌ పట్నాయక్‌ గతేడాది పేర్కొన్నట్లుగా, సుసంపన్నులైన ఒక శాతం మందిపై సంపద, వారసత్వపు పన్నులు విధించినట్లైతే దేశానికి దాదాపుగా రూ.14.67 లక్షల కోట్లు వస్తాయి. దీనికి తోడు, 2019-20లో దాదాపుగా రూ.5 లక్షల కోట్లు ఆదాయ, కార్పొరేట్‌ పన్నుల రూపంలో సమకూరలేదు. అంతకంటే మరీ అధ్వాన్నమైన పరిస్థితి ఏమిటంటే జిఎస్‌టి తదితరాల రూపంలో వినియోగదారుల నుండి వసూలు చేసిన పరోక్ష పన్నులు రూ.2 లక్షల కోట్లు ప్రభుత్వానికి డిపాజిట్‌ చేయలేదు. అవి కంపెనీల వద్దనే వున్నాయి.
సంపద, వారసత్వపు పన్నుల ద్వారా వసూలు చేసే అదనపు రూ.14.67 లక్షల కోట్లు ఖర్చు చేయడం, పన్ను ఎగవేతను నివారించడానికి సమర్ధవంతమైన చర్యల ద్వారా వసూలు చేసే దాదాపు రూ.7 లక్షల కోట్లను, ప్రభుత్వం ఇప్పుడు ఖర్చు చేసేదానితో కలిపి చేస్తే ప్రజల మౌలిక అవసరాలు, ఆహార, ఉపాధి హక్కులు నెరవేర్చడానికి, ఉచితంగా ప్రజారోగ్య హక్కును అమలు చేయడానికి, యూనివర్శిటీ స్థాయి వరకు ఉచిత విద్యను, వృద్ధాప్యపు పెన్షన్‌, వికలాంగ ప్రయోజనాలు వంటివన్నీ నెరవేర్చడానికి అవకాశం వుంటుంది.
కేవలం జనాభాలో ఒక శాతం మందిపై సంపద, వారసత్వ పన్నులను విధించడం, బడా కార్పొరేట్లు పన్ను ఎగవేతను నివారించడానికి సమర్ధవంతమైన చర్యలు తీసుకోవడం వంటివి చేస్తే చాలు ప్రజల మౌలిక, ప్రాథమిక హక్కులు, అవసరాలు తీరిపోతాయి. అంటే, ప్రజల సంక్షేమం పట్ల కనీస బాధ్యత నెరవేర్చడానికి కేవలం వనరులు కొరవడడం ఇక్కడ సమస్య కాదు. రాజకీయ సంకల్పం లేకపోవడం ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
అంతర్జాతీయ ఫైనాన్స్‌ వర్గాలు ఆదేశించిన రీతిలో నయా ఉదారవాదానికి కట్టుబడిన, కార్పొరేట్ల ప్రయోజనాలను పరిరక్షించడానికి చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం... రాజ్యాంగం ఆదేశిస్తున్నప్పటికీ ప్రజా సంక్షేమ విధానాలను రూపొందిస్తుందని ఊహించలేం. కార్మిక సంఘాలు, ముఖ్యంగా వర్గ దృక్పథం కలిగిన కార్మిక సంఘాలు కార్మికుల, ప్రజల మౌలిక హక్కులపై దాడులు, ప్రజల ప్రజాతంత్ర, రాజ్యాంగ హక్కులపై దాడులకు, నయా ఉదారవాదానికి మధ్య గల లింకులను ఎండగట్టాల్సి వుంది.
నేటి కార్మికుల సార్వత్రిక సమ్మె..నేటి, రేపటి రైతుల దేశవ్యాప్త నిరసనలు..నయా ఉదారవాదాన్ని ఓడించి, ఆ స్థానంలో ప్రజానుకూల విధానాలు గల ప్రభుత్వాన్ని స్థాపించేందుకు పెద్ద ఎత్తున జరిపే ఐక్య ప్రజా పోరాటాలకు ప్రారంభం కావాలి.

                                                        కె.హేమ‌ల‌త‌ ( వ్యాసకర్త సిఐటియు జాతీయ అధ్యక్షురాలు )

hemalatha