Aug 01,2021 11:27

నవతరం ఆలోచనలకు తగ్గట్టు అరచేతిలో ఇమిడిపోయే మరీ చిన్న బోన్సారు మొక్కలు ఇప్పుడిప్పుడే పుట్టుకొస్తున్నాయి. 'నానో బోన్సాయ్' అని పిలిచే ఈ మొక్కలు చైనా, హాంగ్‌ కాంగ్‌, జపాన్‌, మలేషియా దేశాల్లో ఊపిరి పోసుకుని ప్రపంచమంతా హల్‌చల్‌ చేస్తున్నాయి. సరికొత్త ట్రెండ్‌తో విస్తరిస్తున్న ఈ అరుదైన మొక్కలకి ఎంతో గిరాకీ ఉంది. అందుకే ఇవి ధరలో కూడా ఎంతో ప్రియం. చిన్ని చిన్ని రూపుతో అందంగా కొలువుతీరి, ఈ మొక్కలు చూపరుల కళ్ళను ఇట్టే కట్టిపడేస్తాయి.

   ళ్లతరబడి వయసున్న మహావృక్షాలు మరుగుజ్జుగా మారిపోయి, చిన్నపాటి కుండీల్లో కొలువు తీరే మొక్కలను బోన్సారు లేదా వామన వృక్షాలు అంటారని మనకు తెలుసు. చాలా కొద్దిపాటి మన్ను, నీటితో ఎంతో సొగసుగా పెరిగే వీటిలో కూడా వందల రకాలున్నాయి. వృక్ష ప్రేమికుల స్వప్న సాకారమైన ఈ ప్లాంట్స్‌ని యూరప్‌ దేశాల్లో పాకెట్‌ ప్లాంట్స్‌ అని కూడా పిలుస్తారు.

                                                         జునిన్‌ ప్రెరుస్‌ చైనిన్సిస్‌..

జునిన్‌ ప్రెరుస్‌ చైనిన్సిస్‌..

ఇది సైప్రెస్‌, సర్వే సంయుక్త జాతి వృక్షం. ఈ బోన్సాయ్ మొక్క కాండం పేడు మాదిరిగా ఉంటుంది. ఆకులు ఆకుపచ్చటి పిలకలు మాదిరిగా దట్టంగా ఉంటాయి. మొక్క చూడ్డానికి ఆర్నమెంటల్‌ ప్లాస్టిక్‌ మొక్కలా కనిపిస్తుంది. ఈ మొక్కకి కూడా గాలి ఎక్కువ తగలాలి. మట్టిలోనూ, కార్బన్‌ సేంద్రియ మిశ్రమాల్లో ఇవి ఏపుగా పెరిగి, నవనవలాడుతుంటాయి. దీనికి నీళ్లు ఎక్కువ, తక్కువ అయినా తట్టుకోగలదు.

                                                                         

                                                          చమేసైపరిస్‌ అబుతుసా..

  చమేసైపరిస్‌ అబుతుసా..

ఇది చైనా దేశ మరగుజ్జు మొక్క. సైప్రెస్‌ జాతికి చెందినది ఈ బోన్సాయ్ వృక్షం. ఆకులు నెమలి పింఛంలా ప్రత్యేకమైన నిర్మాణంలో ఉండి, దట్టంగా విస్తరించి ఉంటాయి. మొక్క నెమ్మదిగా పెరుగుతుంది. దీనిని అందమైన ఆకారంలో కత్తిరించుకోవచ్చు. వేరులు, కాండం చాలా గట్టిగా ఉంటాయి. కొబ్బరి పొట్టు మిశ్రమంలో బాగా పెరుగుతుంది. ఎక్కువ గాలి తగిలే ప్రాంతంలో వీటిని ఉంచడం శ్రేయస్కరం. దీనికి తరచూ నీటివనరు అందించాలి.

                                                                        ఉల్ముస్‌ పర్వీఫోలియా జాక్క్‌..

ఉల్ముస్‌ పర్వీఫోలియా జాక్క్‌..

ఇది చైనా బోన్సారు మొక్క. చిన్ని చిన్ని ఆకులతో నాజూగ్గా ఉంటుంది. చిన్ని కుండీల్లో, టీ కప్పుల్లో సైతం ఇది అద్భుతంగా పెరుగుతుంది. కొబ్బరిపొట్టు మిశ్రమంలోనూ పెరుగుతుంది. గాలి తగిలే అల్మారాలు, కబోర్డు, టీ పాయల మీద ఇవి చక్కగా పెరుగుతాయి. ఇంకా హాంగింగ్‌ కుండీల్లో కూడా పెంచుతారు. చైనాలో పొకెట్‌ ప్లాంట్స్‌గా వీటినే కానుకలు ఇచ్చుకుంటారు.

 

                                                         సోలనుమ్‌ పైకస్‌..

సోలనుమ్‌ పైకస్‌..

మర్రి ఆకులాంటి చిన్న ఆకులు, కాయలతో మొక్క ఎంతో అలరిస్తుంది. కాయలు గోధుమ వర్ణంలో నవనవలాడుతూ మూడు నెలలపాటు ఉంటాయి. ఈ మొక్కకు కాయలు ఉంటేనే అందం. అవి విత్తనాలుగా పనికి వస్తాయి. విదేశాల్లో వీటిని తింటారు. జ్యూస్‌ కూడా చేసుకుంటారు.

                                                                            

                                                        బోన్సాయ్ పప్పెట్‌..

 బోన్సాయ్ పప్పెట్‌..

సైలమ్‌, ఫైకాస్‌ జాతులకి చెందిన ఈ రెండు బోన్సారు మొక్కల సముదాయాన్ని బోన్సారు పప్పెట్‌ అంటారు. ఒకటి సన్నని కేసరాల్లాంటి ఆకులతో, మరొకటి మర్రి చెట్టులాంటి ఆకులతో ఉంటాయి. రెండూ విభిన్నంగా ఉండి, హరిత శోభను అద్దుతాయి. అందుకే రెండింటినీ కలిపి ఒక ప్యాక్‌లా అమ్ముతారు.

                                                                           

                                                        ఫైనస్‌ తంబేర్జి పార్లర్‌..

 ఫైనస్‌ తంబేర్జి పార్లర్‌..

సన్నటి కేసరాల్లాంటి ఆకులు ఆకుపచ్చని శోభతో కళకళలాడుతుంటాయి. సన్నని కాండము, తల భాగాన నిండుగా ఆకులు ఉంటాయి. నీటివనరు పెద్దగా అవసరం లేదు. కొబ్బరి పొట్టు లేదా సేంద్రియ ఎరువులో బాగా పెరుగుతుంది. పైనస్‌ జాతిలో వందలాది రకాల మొక్కలు ఉన్నాయి. ఇది పూర్తిగా వెలుపల పెరిగే మొక్క. ఏడాదికోసారి మొక్కను కత్తిరించుకోవాలి. పైనస్‌ రాక్స్‌ బర్గియా అనేది దీని జాతి మొక్క. దీన్ని కరెన్సీ పేపర్‌ తయారీకి ఉపయోగిస్తారు. ఉత్తర అమెరికా అడవుల్లో ఈ మొక్కలు ఎక్కువగా ఉంటాయి.

                                                                         

                                                        ఫైకాస్‌ రెస్ట్యూస..

  ఫైకాస్‌ రెస్ట్యూస..

ఈ మొక్క బోడిగా ఉంటుంది. కాండం కాస్త లావుగా ఉంటుంది. ఆకులు తక్కువగా ఉండి, ఊడలు తిరిగి ఉంటాయి. మొదలు మానులు తిరిగి, అందంగా ఉంటాయి. నీరు చాలా తక్కువ అవసరం. దీన్ని ఏడాదికోసారి ట్రిమ్మింగ్‌ చేసుకోవాలి. నెమ్మదిగా పెరుగుతుంది. ఈ మొక్క పెరుగుదలకు సేంద్రియ ఎరువులు వాడొచ్చు. సీవండి తీగలు చుట్టి, కావాల్సిన ఆకారాల్లో ఈ చెట్లను పెంచుతారు. పింగాణీ లేదా ఫైబర్‌, ప్లాస్టిక్‌ కుండీల్లో వీటిని పెంచుకోవచ్చు. మొక్క షేప్‌ వచ్చిన తరువాత ఆకారంగా మలిచి, తీగను విప్పేస్తారు.

                                                                            

                                                    ఏసర్‌ బర్జిర్యనుమ్‌..

  ఏసర్‌ బర్జిర్యనుమ్‌..

ఈ బోన్సాయ్కి ఆకులే అందం. ఆకు చివరన మూడు త్రికోణాకారపు కత్తిరింపులతో ఆకర్షణగా ఉంటాయి. మొక్కకు గుజ్జుగా ఆకులు ఉండి, సీజన్లో తెలుపు పూలు పూస్తాయి. మొక్క నాజూగ్గా ఉంటుంది. గాలికి ఆకులు రెపరెపలాడుతూ ఉంటాయి. శీతల ప్రాంతాల్లో ఈ మొక్కలు బాగా పెరుగుతాయి. చెట్టు మొదట్లో రంగురంగు రాళ్లు ఉంచితే, మొక్కకి మరింత అందం వస్తుంది. మొక్క మొదట్లో నీరు ఎక్కువ నిల్వ ఉంటే ఆకులు ముగ్గిపోయి, రాలిపోతాయి.

                                                   

                                                   ఫూనస్‌ మహలాబ్‌..

  ఫూనస్‌ మహలాబ్‌..

ఆకులు పలుచగా, గట్టిగా ఉంటాయి. చెట్టు కాండాలు మెలికలు తిరిగి తాడులా అల్లుకుపోతాయి. ఈ బోన్సారు మొక్కకు ఇదే అందం. కుండీల్లో గుప్పెడు మట్టి లేకపోయినా చక్కగా పెరుగుతుంది ఈ మొక్క. కాండం గంధపు చెక్కలా మెరుస్తుంది. వీటి ఆకుల మీద నీళ్లు స్ప్రే చేస్తే అందంగా విచ్చుకుంటాయి. వీటిని రకరకాల కుండీల్లో పెంచుకోవచ్చు.

                                                                             

                                                   జూనిపెరుస్‌ క్రాస్‌ బ్రీడ్‌..

జూనిపెరుస్‌ క్రాస్‌ బ్రీడ్‌..

లేత ఆకుపచ్చ కేసరాల్లాంటి ఆకులు, గంధం రంగు కాండం వంపులు తిరిగి, చెట్టు భలే రమణీయంగా ఉంటుంది. తేజోవంతంగా కనిపించే దీన్ని ముదురు రంగు కుండీల్లో ఉంచితే మరీ అందం. చీకట్లో ఈ మొక్కలపై సన్నని కాంతి కిరణాలను ఫోకస్‌ చేస్తే, చిన్ని చిన్ని మెరుపులతో కాంతి పరావర్తనం చెందిస్తూ భలే అందంగా ఉంటుంది.
 

చిలుకూరి శ్రీనివాసరావు,
89859 45506