Oct 28,2021 08:29

అమరావతి : పాపికొండల్లో బోటు యాత్ర తిరిగి ప్రారంభం కానుంది. నవంబర్‌ 7వ తేదీ నుండి బోటు యాత్ర మొదలవుతుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు తెలిపారు. ఈ యాత్రకు సంబంధించి టికెట్‌ ధర కూడా పెంచినట్లు తెలిపారు. ఈ మేరకు బోటు నిర్వాహకులతో బుధవారం సచివాలయంలో మాట్లాడారు. పశ్చిమగోదావరి నుండి పాపికొండలకు బోటు కార్యకలాపాలు నిర్వహించే అంశాన్ని పరిశీలించాలని, ఈ కార్యకలాపాల్లో కార్పొరేట్‌ సంస్థలు ప్రవేశించి తమ జీవనోపాధి దెబ్బతినకుండా చూడాలని బోటు నిర్వహకులు మంత్రిని కోరారు. గోదావరి నదిలో 28 మీటర్ల మట్టం వరకు జలాలు ఉన్నప్పుడు మాత్రమే పర్యాటక బోట్లను అనుమతిస్తున్నారని, దీన్ని 30 మీటర్ల వరకు పెంచాలని నీటి పారుదల శాఖను కోరారు. గతంలో గోదావరిలో జరిగిన బోటు ప్రమాదం తరహా ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. అదేవిధంగా రాజమండ్రి నుండి పాపికొండల వరకు పర్యాటక బోటులో టిక్కెట్‌ ధర రూ. 1,250గా నిర్ణయించామని తెలిపారు. గోదావరి కృష్ణా నదుల్లో పర్యాటక బోట్ల నిర్వహణకు 9 చోట్ల కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.