Sep 24,2021 02:00

ప్రజాశక్తి-విశాఖపట్నం ప్రతినిధి
జిల్లాలో ఏ మండల పరిషత్‌ అధ్యక్ష పీఠం ఎవరు దక్కించుకుంటారనేది శుక్రవారం తేలనుంది. 24న జరగనున్న మండల పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు ఆసక్తిగా మారాయి. జిల్లాలో 39 మండల పరిషత్‌లున్నాయి. వీటిలో రావికమతం, జి.మాడుగుల మినహా మిగిలిన 37 మండలాల్లో వైసిపికి పూర్తి మెజార్టీ లభించింది. 37 మండలాల్లో అధికార పార్టీ ప్రకటించిన అభ్యర్థులు కొన్ని చోట్ల ఓటమి పాలవడంతో కొత్తవారు తెరమీదకొస్తున్నారు. కొన్నిచోట్ల ఇద్దరి నుంచి ముగ్గురు వరకు అధ్యక్ష పీఠానికి పోటీ పడుతున్నారు. తమ బలాన్ని, రాజకీయ శక్తిని ఉపయోగించుకొని ఎలాగైనా పదవిని దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఎంపి, ఎమ్మెల్యేలు, మంత్రుల చుట్టూ కొంతమంది ఆశావహులు తిరుగుతున్నారు.
బుచ్చెయ్యపేట ఎంపిపి అభ్యర్థిగా మండల వైసిపి అధ్యక్షుడు కొల్లిమల్ల అచ్చంనాయుడు భార్య లలితరామ్‌ను ప్రతిపాదించారు. లలితరామ్‌ ఓటమి పాలవడంతో ఆశావహులు పెరిగారు. సిగిరెడ్డి సుశీల, దాకారపు నాగేశ్వరిదేవి ఎంపిపి పదవికి ఎవరికి వారు ప్రయత్నించుకుంటున్నారు. సబ్బవరంలో మండల పరిషత్‌ ఉపాధ్యక్ష పదవికి పోటీ వుంది. ఎంపిటిసిలను పాలకొల్లు తీసుకెళ్లి వుంచారు. జి.మాడుగుల మండలంలో 15 ఎంపిటిసి స్థానాలకుగానూ టిడిపి, వైసిపి చెరొక ఏడు స్థానాలను గెలుచుకున్నాయి. దీంతో ఇక్కడ స్వతంత్ర అభ్యర్థి మద్దతు కీలకంగా మారింది. స్వతంత్ర అభ్యర్ధి కొర్ర పద్మ టిడిపి ఎంపిపి అభ్యర్థి సాగిన జాన్సికి మద్దతు తెలపనుందని ప్రచారం జరుగుతుంది. రెండున్నరేళ్లు జాన్సి, రెండున్నరేళ్లు పద్మ ఎంపిపిగా వుండేందుకు వారి మధ్య ఒప్పందం జరిగినట్లు తెలిసింది. అనంతగిరిలో శెట్టి నీలవేణి, తడబరికి మితుల, దూరు జయవర్ధిని ఎంపిపి పదవికి పోటీ పడుతున్నారు. ముంచంగిపుట్‌ ఎంపిపి పదవి అరిసెల సీతమ్మ ఆశిస్తున్నారు. గతంలో అరకు ఎమ్మెల్యే ఫాల్గుణ కూడా ఎంపిపి పదవి ఇస్తామని ఆమెకు హామీ ఇచ్చారు. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ కొత్త పేర్లు తెరమీదకొచ్చాయి. మజ్జి సుబ్బలక్ష్మి ఎంపిపి పదవి ఆశించడంతో ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. అనకాపల్లిలో నారపిన్ని చంద్రశేఖర్‌, గొర్లి సూరిబాబు ఎంపిపి పదవిని ఆశిస్తున్నారు. రావికమతంలో 20 ఎంపిటిసి స్థానాలకు పది పది చొప్పున టిడిపి, వైసిపి గెలుచుకున్నాయి. ఎన్నికల ఒప్పందం ప్రకారం టిడిపి ఎంపిటిసిలు ముగ్గురు వైసిపికి మద్దతు ఇచ్చే అవకాశముంది.
శుక్రవారం జరగనున్న మండల పరిషత్‌ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కోప్షన్‌ సభ్యుల ఎన్నికలకు అధికారయంత్రాంగం ఏర్పాట్లు చేసింది. 39 మండలాల్లో ఎంపిపి, వైస్‌ ఎంపిపి, ఒక కో ఆప్షన్‌ సభ్యుని ఎన్నిక వుంటుంది. మండల పరిషత్‌ అధ్యక్ష ఎన్నికలకు సీనియర్‌ అధికారులను రిటర్నింగ్‌ అధికారులుగా నియమించారు. శుక్రవారం ఉదయం పది గంటలకు కోప్షన్‌ సభ్యుని ఎన్నికకు నామినేషన్‌ స్వీకరించి, ఒంటి గంటకు ఎన్నిక నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఎంపిపి ఎన్నిక, తరువాత వైస్‌ ఎంపిపి ఎన్నిక జరగనుంది. ఎంపిపి, వైస్‌ ఎంపిపి పదవులకు ఎన్నిక అనివార్యమైతే చేతులెత్తి తమ మద్దతు ప్రకటించి ఎన్నుకోవాల్సివుంటుంది. ఈ ఎన్నికలకు ఆయా పార్టీలు శుక్రవారం ఉదయం విప్‌ జారీ చేస్తాయి.