Mar 02,2021 21:41

ఆశావహులు

ప్రజాశక్తి-హిందూపురం: మున్సిపల్‌ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణకు గడువు దగ్గరపడినప్పటికీ చాలాచోట్ల అభ్యర్థులపై స్పష్టత ఇంత వరకు రాలేదు. ఆయా ప్రాంతాల్లో అభ్యర్థులు, నేతలు సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ఓటరు నాడిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొందరు మరో అడుగు ముందుకేసి ఓటరుకు ఏం కావాలో అడుగుతున్నారు. కొందరైతే గుట్టుగా సర్వేలు చేస్తున్నారు. ఏదేమైనా పంచాయతీ ఎన్నికల కంటే పట్టణ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇక్కడ గెలిస్తే వచ్చే సాధారణ ఎన్నికల్లో సులువుగా నిలదొక్కుకునే చాన్స్‌ ఉంటుందని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమ ప్రచారాన్ని వేడెక్కిస్తున్నాయి. ప్రత్యర్థి వ్యూహాలను తెలుసుకుని అంతకు మించి ఎత్తులేస్తున్నాయి.
మరోవైపు నామినేషన్ల ఉప సంహరణకు గడువు సమీపించింది. గతేడాది మార్చి నెలలో నామినేషన్లు వేసిన వారిలో అనేక మంది డమ్మీ అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. అలాగే ప్రధాన పార్టీల నుంచి పార్టీ గుర్తించిన అభ్యర్థులతో పాటు రెబల్‌ అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన వారున్నారు. డమ్మీలు పోటీ నుంచి తప్పుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారు పెద్ద సంఖ్యలో తమ నామినేషన్లను వెనక్కు తీసుకోనున్నారు. అయితే 16వ వార్డు పరిధిలో సిపిఐ అభ్యర్థి షాయోదా నామినేషన్‌ వేసిన తరువాత మృతిచెందారు. వీరి స్థానంలో ఆదివారం మహబూన్ని నామినేషన్‌ వేశారు. సోమవారం ఈ నామినేషన్‌ పరిశీలించిన అధికారులు అమోదం తెలిపారు. ఇదిలా ఉండగా నామినేషన్ల ఉప సంహరణకు బుధవారం మధ్యాహ్నం 3గంటల వరకు గడువుంది. దీంతో అందరి దృష్టి నామినేషన్ల ఉపసంహరణపైనే ఉంది. ఇప్పటికే రెబల్‌ అభ్యర్థులను బుజ్జగించే ప్రయత్నాలు చివరి దశకు వచ్చాయి. హిందూపురం పురపాలక సంఘంలో 38 వార్డులు ఉన్నాయి. వార్డు నెంబరు 30లో 18 నామినేషన్‌లు వేయగా మరో మరో 13 వార్డుల్లో 10కి మించి నామినేషన్‌లను వేశారు. రెబల్‌ అభ్యర్థులుగా వేసిన వారిలో కూడా గతంలో కౌన్సిలర్లుగా పనిచేసిన వారున్నారు. అలాగే అయా వార్డుల్లో గెలుపు గుర్రాలుగా పేరొందిన వారు. స్వతంత్ర అభ్యర్థులుగా గెలుపొందే సత్తా ఉన్న వారూ ఉన్నారు. బరిలో ఉండేందుకే ఎక్కువ మంది రెబల్స్‌ పట్టుబడుతున్నారు. అధికార పార్టీలోనే రెబల్‌ సమస్య ఉంది. వీరంతా ఇప్పటికే స్థానిక ఎమ్మెల్సీ మందు సమస్యను వెల్లడించారు. తమకు గెలిచే సత్తా ఉందని బి ఫారాలను ఇప్పించాలని కోరారు. చివరికి ఏవిధంగా ముందుకు సాగుతారో చూడాలి. ప్రస్తుతం ప్రచారాల్లో మాత్రం రెబల్‌ అభ్యర్థులు జోరుగా దూసుకెళ్తున్నారు. వార్డుల సంఖ్య కంటే వివిధ పార్టీల అభ్యర్థుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. వార్డుల కంటే నాలుగు రెట్లు అధికంగా నామినేషన్లు అధికార పార్టీవి ఉన్నాయి. ఇందులో డమ్మీ అభ్యర్థులతో పాటు రెబల్‌ అభ్యర్థులున్నారు. వారి విషయంలో అధికార పార్టీ తీసుకోబోయే నిర్ణయంపైనే అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎమ్మెల్సీతో పాటు ఎంపీ, పార్లమెంట్‌ అధ్యక్షులు నవీన్‌ నిశ్చల్‌ తన అనుచర గణాన్ని బరిలోకి దింపారు. తద్వారా పట్టణంలో మరింత పట్టును పదిలం చేసుకోవాలన్నది వారి ఉద్దేశంగా కనిపిస్తోంది. అధికార పార్టీ ఆధిపత్య పోరులో ఎవరిది పైచేయి అవుతుందో బుధవారం మధ్యాహ్నంపైన స్పష్టత రానుంది.