Nov 30,2020 00:32

నిరసన తెలుపుతున్న సుబ్బారావు తదితరులు

కలెక్టరేట్‌ : సామాజిక న్యాయానికి తావులేని జాతీయ విద్యా విధానాన్ని తిరస్కరించాలని ఎయు పూర్వపు ఆచార్యులు కెపి.సుబ్బారావు పిలుపు నిచ్చారు. ''సామాజిక న్యాయం పునః సాధన వారం''పాటించాలని అఖిల భారత విద్యా హక్కు వేదిక ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం ఎల్‌ఐసి దరి అంబేద్కర్‌ విగ్రహం వద్ద ఆంధ్రప్రదేశ్‌ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యాన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రం ప్రవేశ పెడుతున్న నూతన విద్యా విధానంలో సామాజిక న్యాయానికి చెల్లుచీటీ రాసిందని విమర్శించారు. విశ్వవిద్యాలయాలన్నీ ప్రవేశాల నుంచి పరిశోధన వరకు ఎన్‌టిఎ, హెచ్‌ఈసిఐ, హెచ్‌ఈజిసి, జిఈసి, ఎన్‌ఎసి, ఎన్‌ఆర్‌ఎఫ్‌ వంటి ఆరు కేంద్ర సంస్థల నియంత్రణలో ఉంటాయన్నారు. నియామకాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్లు ఊసేలేదని ఆందోళన వ్యక్తంచేశారు. ఆంధ్రప్రదేశ్‌ విద్యా పరిరక్షణ కమిటీ జిల్లా కన్వీనర్‌ జి.మధు మాట్లాడుతూ, నూతన విద్యా విధాన పత్రంలో కుల, మత, భాష, పురుషాధిక్య భావజాలం కనిపిస్తోందని ఆరోపించారు. ఎపిటిఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎఎస్‌.నాయుడు, ఎ.ధర్మేందర్‌ రెడ్డి, పూజారి సత్యనారాయణ పాల్గొన్నారు.