Apr 14,2021 15:38

యాంగాన్‌ : మయన్మార్‌లో ప్రజాస్వామ్యాన్ని కాలరాసి... పెత్తనం సాగిస్తోన్న సైనిక చర్యకు వ్యతిరేకంగా ఉద్యమకారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సాంప్రదాయంగా వస్తున్న నూతన ఏడాది ఉత్సవాలను మంగళవారం రద్దు చేసుకున్నారు. బదులుగా దేశ వ్యాప్తంగా అక్కడక్కడ ప్రదర్శనలు, నిరసనలు చేపట్టడం ద్వారా సైనిక పాలనపై తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 1న మొదలైన సైనిక తిరుగుబాటు... అక్కడ ఇంకా కొనసాగుతూనే ఉంది. వ్యతిరేకిస్తున్న నిరసనకారులపై జుంటా సైన్యం తుపాకుల మోత మోగిస్తోంది. ఇప్పటికే అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ చర్యలు సిరియాలో మాదిరిగా పౌర సంఘర్షణలకు దారి తీయవచ్చునని, నర వధను ఆపాలంటూ ఐక్యరాజ్య సమితి హక్కుల కార్యాలయం విజ్ఞప్తి చేసింది. సూకీ ప్రభుత్వాన్ని కూల్చినప్పటి నుండి ఇప్పటి వరకు సైనిక బలగాల చేతుల్లో 710 మంది ప్రాణాలు కోల్పోయారని అసిస్టెంట్‌ అసోసియేషన్‌ ఫర్‌ పొలిటికల్‌ ప్రిజనర్స్‌ సంఘం తెలిపింది.

నూతన సంవత్సర వేడుకల్ని రద్దు చేసుకున్న మయన్మార్‌ ప్రజలు.. ఎందుకంటే..?
ఈ సైనిక హత్యలకు నిరసనగా ఐదు రోజుల పాటు జరిగే నూతన సంవత్సర వేడుకలు (థింగ్యాన్‌)ను రద్దు చేసుకోవాలని నిరసనకారులు భావించారు. తొలి రోజైన మంగళవారం ఈ వేడుకలను జరుపుకోమని నిరసనకారుడొకరు ట్వీట్‌ చేశారు. సాధారణంగా తొలి రోజున బౌద్ధ విగ్రహాలను శుభ్రం చేసుకుని... ప్రార్థనలు చేస్తారు. కానీ దేశంలో పరిస్థితులు దృష్ట్యా ఆ వేడుకలను రద్దు చేసుకున్నారు. దేశంలో అత్యంత ప్రాథాన్యత కలిగిన పండుగ దినం కాబట్టి.. పూలతో ఎంతో అలంకరించిన కుండలను పట్టుకుని... కొత్త వస్త్రాలు ధరించిన మహిళలు పలు చోట్ల నిరసనలు తెలిపారు. అదేవిధంగా వారి రీతిలో నమస్కారంతో కూడిన పెయింట్‌ను కుండలపై వేసి... వాటిని పట్టుకుని పీపుల్స్‌ పవర్‌, అవర్‌ పవర్‌ అంటూ మహిళలు నినాదాలు చేస్తూ ర్యాలీలు నిర్వహించారు.

Protesters in Myanmar cancel traditional new year festivities