Nov 22,2020 21:02

ఒంగోలు క్రైం: వివాహం అనంతరం ఓ టెంపో వాహనంలో తిరుగుప్రయాణమైన పెళ్లివారు.. ముందు వెళ్తున్న లారీని టెంపో ఢ కొన్నడంతో పెళ్లికుమారుడి బంధువులిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఏడుగురు గాయపడ్డారు. ఈ ఘటన ఒంగోలు నగరం పరిధిలోని జాతీయరహదారిపై, సంఘమిత్ర హాస్పిటల్‌ వెనుకవైపు ఆదివారం తెల్లవారుజామున జరిగింది.
పోలీసుల కథనం మేరకు..తెనాలికి చెందిన కోల్లూరి హేమచంద్రకుమార్‌, అనూషల వివాహం శనివారం తిరుమలలో జరిగింది. వివాహం అనంతరం నూతన దంపతులతో పాటు కుటుంబసభ్యులు, బంధువులు ఒక కారు, ఓ టెంపో వాహనంలో తెనాలికి తిరుగు ప్రయాణమయ్యారు. కారులో నూతన దంపతులు, కుటుంబసభ్యులు వస్తుండగా టెంపోలో బంధువులు వస్తున్నారు. ఒంగోలు జాతీయరహదారిపైకి వచ్చేసరికి టెంపో డ్రైవర్‌ నిద్రమత్తు కారణంగా ముందు వెళుతున్న లారీని టెంపో ఢకొీట్టింది. దీంతో వెనుక వస్తున్న మరో లారీ వేగంగా టెంపో వాహనాన్ని ఢకొీట్టింది. రెండు లారీల మధ్య చిక్కుకోవడంతో టెంపో వాహనం నుజ్జునుజ్జయింది. టెంపోలో ప్రయాణిస్తున్న పెళ్లి కుమారుడి మేనమామ చేవూరి సత్యనారాయణమూర్తి(65), పెళ్లి కుమారుడి పెద్దమ్మ కాశి అన్నపూర్ణమ్మ(54) అక్కడికక్కడే మృతిచెందారు. సిహెచ్‌.ప్రసన్నలక్ష్మి, సుబ్బయ్య, కావ్య, కె.సుజాత, ఉమామహేశ్వరరావు, షేక్‌ జానీ(డ్రైవర్‌), కె.నాగమ్మకు గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.