Nov 30,2020 21:34

తడిచిన వరిచేనుతో నిరసన తెలుపుతున్న రైతులు

కంటోన్మెంట్‌ : ఇటీవల కాలంలో సంభవించిన కరువు, తుపాన్ల వల్ల వరి, తదితర పంటలకు తీవ్ర నష్టం జరిగిందని, దీంతో అన్ని విధాలా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఎపి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బి.రాంబాబు అధికారులను కోరారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌ వద్ద పాడైపోయిన వరి పంటతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటివనరులున్న ప్రాంతంలో ఉబాలు జరిగి పంట చేతికి వచ్చే సమయంలో తుపాన్లకు పంట తడిచి ముద్దయి ధాన్యం మొలకెత్తాయన్నారు. దీంతో పెట్టుబడి మొత్తం నీరుపాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. కరువు, తుఫాన్లు వల్ల నష్టపోయిన పంటనష్టాలను అంచనాల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయన్నారు. పంట నష్టపోయిన రైతుల పంట ఉండగానే గుర్తించి పరిహారం అందించాలి అని తెలిపారు. అలాగే ధాన్యం కొనుగోళ్లు, రైతుభరోసా కేంద్రాల్లో ఈ కర్షక్‌ నమోదులో వెజ్‌బ్యాండ్‌లో సాంకేతిక కారణాలు రెవెన్యూ రికార్డులో ఆన్లైన్‌ తప్పులు, సిబ్బంది పొరపాట్లు, అలసత్వం వల్ల అనేకమంది నమోదుకాని రైతులు, కౌలుదారులు, సాగుదారులను మెన్యువల్‌గా గుర్తించి పంటకొనుగోళ్లు, బీమా, నష్టపరిహారాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం కలెక్టర్‌కు వినతిని అందజేశారు. కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు ఎ.ఆదినారాయణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.