
అమరావతి బ్యూరో : కలాష్ సీడ్స్ కంపెనీ మిర్చి విత్తనాలు వేసి నష్టపోయిన రైతులకు నష్టపరిహారాన్ని చెల్లించి ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు కోరారు. ఈ మేరకు శుక్రవారం సిఎం కు మధు లేఖ రాశారు. లేఖలో.. పెదకూరపాడు గ్రామంలో 400 ఎకరాలలో కలాష్ సీడ్స్ మిర్చి ఎఫ్చిల్లా కె.ఎస్.పి.1436, 270 రకాల విత్తనాలతో మిర్చిసాగు చేసి రైతులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. 10 గ్రాములు ప్యాకెట్ రూ.600లు చొప్పున ఎకరాకు 15 ప్యాకెట్లు విత్తనాలతో నారు పెంచి, మొక్కలు నాటారని తెలిపారు. విత్తనాలు ఖరీదు నారు పెంచి నాటేందుకు ఎకరాకు రూ.18,000 లు ఖర్చు అయ్యిందని పేర్కొన్నారు. కౌలు ఎకరాకు రూ.20,000లు, పెట్టుబడి మొత్తం ఎకరాకు లక్ష రూపాయలు అయ్యిందన్నారు. పంట లేకపోవడంతో ఇదంతా నష్టం వస్తుందని, 1436 రకానికి ప్రభుత్వం ఫాాంసి అనుమతి కూడా లేదని, కంపెనీ యజమానులు రైతుల్ని మోసం చేశారని పేర్కొన్నారు. మిర్చి మొక్కలు నాటి 80 రోజులైనా కాపు కాయలేదని, మొక్క పెరుగుదల ఆగిపోయి మరగుజ్జులా ఉందని అన్నారు. 100 శాతం మొక్కలకు వైరస్ సోకిందని, ఏ మందులు కొట్టినా వైరస్ పోలేదని తెలిపారు. వైరస్ను తట్టుకుంటుందని నమ్మించి కంపెనీ ప్రతినిధులు, డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు విత్తనాలు అమ్మారని, మొక్కలు కాపు రాలేదని చెప్పారు. రైతులు కలాష్ సీడ్స్ కంపెనీ విత్తనాలు వేసి పూర్తిగా నష్టపోయారని వివరించారు. ఈ కల్తీ విత్తనాల మోసం వల్ల గ్రామాల్లో రైతులు మోసపోయారని ఆవేదన చెందారు. నష్టపోయిన ప్రతి ఎకరాకు లక్ష రూపాయల నష్టపరిహారాన్ని ఇప్పించాలని కోరారు. నాసిరకం విత్తనాలను అమ్మి మోసం చేసి, నష్టం కలిగించిన కలాష్ కంపెనీ ప్రతినిధులపై క్రిమినల్ కేసులను నమోదు చేసి అరెస్టు చేయాలని పి.మధు లేఖలో విజ్ఞప్తి చేశారు.