Nov 27,2020 22:29

కలెక్టర్‌ వీరపాండియన్‌, ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప, నంద్యాల సబ్‌ కలెక్టర్‌ కల్పనా కుమారీ పరిశీలన

- 15వేల హెక్టార్లలో పంట నష్టం
- చాగలమర్రిలో అత్యధిక వర్షపాతం
ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి/విలేకరులు: 
జిల్లాలో నివర్‌ తుఫాను నష్టాన్ని మిగిల్చింది. 54 మండలాల్లో 15 మండలాల్లో మినహా మిగిలిన 39 మండలాల్లో వర్షం కురిసింది. శుక్రవారం జిల్లాలో సరాసరిన 19.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా చాగలమర్రి మండలంలో 84.4 మిల్లీమీటర్ల వర్షం పడింది. శుక్రవారం సాయంత్రం వరకు జిల్లా అధికారులు సమర్పించిన ప్రాథమిక అంచనాల ప్రకారం మొత్తం 15,788 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. వరి 12,303 హెక్టార్లలో, మిగిలినవి జొన్న, పత్తి, మినుము, పప్పు శనగ, వేరుశెనగ లాంటి వ్యవసాయ పంటలకు నష్టం వాటిల్లింది. 479 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. అరటి 232 హెక్టార్లలో, మిగిలినవి మిర్చి, పసుపు, ఉల్లి తదితర ఉద్యాన పంటలకు నష్టం జరిగింది. వర్షం దాటికి 42 గొర్రెలు, మేకలు మృతి చెందాయి. చాగలమర్రి, ఆళ్ళగడ్డలలో 3.4 కిలోమీటర్ల ఆర్‌అండ్‌బి రహదారులు దెబ్బతిన్నాయి. 35 ఇళ్ళు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఆదోని రెవెన్యూ డివిజన్‌ మొత్తంగా 96.8 మిమీ కురిసి సగటున 5.7 మిమీ వర్షపాతం నమోదైంది. ఆదోని పట్టణంలో శివారు ప్రాంతాల్లో రోడ్లు చిత్తడిగా మారి రాకపోకలకు అంతరాయం కలిగింది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్‌ కమిషనర్‌ ఆర్జీవి.కృష్ణ కోరారు. టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా సచివాలయ ఉద్యోగులను ఆయన అప్రమత్తం చేశారు. బనగానపల్లె మండలంలో 32.40 మిల్లీ మీటర్ల వర్షం కురిసినట్లు ఏఎస్‌ఓ వెంకటరామి రెడ్డి తెలిపారు. మండలంలో 3200 హెక్టార్లలో వరి సాగు చేయగా 2 వేల హెక్టార్లలో వరి పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. వరి పంట తో పాటు కంది, మిరప, శనగ పంటలు వర్షానికి దెబ్బతిన్నట్లు రైతులు తెలిపారు. ఆదోని రూరల్‌ : వరి రైతుల ఆశలను నివర్‌ తుఫాను నీరిగార్చింది. వరి పైరు పూర్తిగా నేలకొరిగింది. ధాన్యం తడిసి ముద్దయింది. దొర్నిపాడు మండలంలోని కుందు నది, కెసి కాలువ కింద వందలాది ఎకరాల్లో రైతులు సాగు చేసిన వరి,పత్తి పంటలు దెబ్బతిన్నాయి. మండలంలోని దొర్నిపాడు, చకరాజువేముల, కొత్తపల్లె, గోవిందిన్నె గ్రామాల్లో 2వేల హెక్టార్లలో రైతులు పత్తిని సాగు చేశారు. వర్షం వల్ల పత్తి కాయలు నేలరాలాయి. హొళగుంద మండలంలో దాదాపు 1250 హెక్టర్‌ లలో వరి పంట, మూడు వేల హెక్టార్లలో పత్తి సాగు చేయగా పంటలన్నీ నేలపాలయ్యాయి. పాణ్యం మండలంలో 475 హెక్టార్లలో వరి పంట నష్టం వాటిల్లిందని ఎఒ ఉషారాణి తెలిపారు. పొలాలను పరిశీలించి నష్టాన్ని ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. కోవెలకుంట్ల మండలంలోని కుందు పరివాహక ప్రాంతాల్లోని వల్లం పాడు, లింగాల, చిన్న కొప్పెర్ల, భీమునిపాడు గ్రామాల్లో పంటలు నీటి ముంపుకు గురయ్యాయి. రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎడి ఆంజనేయ తెలిపారు. పంట నష్టపోయిన రైతులు నష్టం వివరాలను వ్యవసాయ అధికారులకు తెలపాలన్నారు. మహానంది మండలంలో తుఫాను ప్రభావిత ప్రాంతాలను జెసి సుందర్‌ రెడ్డి, నంద్యాల సబ్‌ కలెక్టర్‌ కల్పనా కుమారి పరిశీలించారు. మండలంలోని సీతా రామాపురం, మసీదిపురం, గాజులపల్లి ఆర్‌ఎస్‌ రోడ్డులోని తిమ్మాపురంలో దెబ్బతిన్న అరటి పొలాలను, తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. తహశీల్దార్‌ నారాయణ రెడ్డి, ఎంపీడీవో సుబ్బరాజు, ఎఒ సుబ్బారెడ్డి, ఆర్‌ఐ నాగేంద్ర ఉన్నారు. శిరివెళ్ల మండల పరిధిలోని 12 గ్రామాల్లో 4277 హెక్టార్లలో 3666 మంది రైతుల పంట నష్టపోయారని ఆయా గ్రామాల్లో అపార నష్టం సంభవించినట్లు ఎఒ అబ్దుల్‌ హక్‌ తెలిపారు. తహశీల్దార్‌ నాగరాజుతో కలిసి పంట పొలాలను పరిశీలించారు. రుద్రవరం మండల పరిధిలోని ఆలమూరు, ఆర్‌.నాగులవరం గ్రామాలను తహశీల్దార్‌ వెంకట శివ, ఇంచార్జి ఎంపిడిఒ వరలక్ష్మి సందర్శించారు. పాడుబడిన మట్టిమిద్దెలలో ఉంటున్న వారికి ఇబ్బందులు కలగకుండా పునరావాసం కల్పించాలని అధికారులకు సూచించారు. ఆలమూరులో 2879 హెక్టార్లలో వరి నేలవాలిందని,59.83 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని తహశీల్దార్‌ తెలిపారు. వారి వెంట ఎఒ ప్రసాద్‌ రావు, ఆర్‌ఐ నర్సిరెడ్డి ఉన్నారు. ఉయ్యాలవాడ మండలంలో 607 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని ఎఒ స్వాతి తెలిపారు. బోడెమ్మ నూరు, ఇంజేడు, కాకరవాడలలో పంట పొలాలను పరిశీలించారు. వరి 366 హెక్టార్లు, పత్తి 239 హెక్టార్లు, కంది రెండు హెక్టార్లు నష్టపోయారన్నారు. ఆమె వెంట ఎఇఒలు వెంకటేశ్వరరెడ్డి, రాణమ్మ, విఎఎ జగన్‌ ఉన్నారు.
అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్‌
చాగలమర్రి :
నివర్‌ తుఫాను తీవ్రతను దృష్టిలో ఉంచుకొని అత్యవసర సేవల కోసం అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ వీరపాండియన్‌ సూచించారు. మండలంలోని కొలుగొట్లపల్లె, బ్రాహ్మణపల్లె సమీపంలోని వక్కిలేరు ఉధృతిని ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప, నంద్యాల సబ్‌ కలెక్టర్‌ కల్పనా కుమారీతో కలిసి పరిశీలించారు. ఆయా గ్రామాల వారితో చర్చించారు. కలుగొట్లపల్లె వాగుపై ఉన్న బ్రిడ్జి చాలా కిందకు ఉండటంతో కొద్ది పాటి వర్షం కురిసినా వక్కి లేరు పొంగి ప్రవహిస్తుందని, వాగు ఉధృతి తగ్గే వరకు ప్రజలు గ్రామాల్లోనే ఉండి పోవాల్సి వస్తుందని గ్రామస్తుడు లోకనాథ్‌రెడ్డి కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. వాగు దాట బోయి ఇద్దరు గల్లంతై ప్రాణాలు పోగొట్టుకొన్నారని తెలిపారు. త్వరలో తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. వాగుల ఉధృతి వరకు దాటే ప్రయత్నం చేయకూడదని సూచించారు. అనంతరం ఆయా గ్రామాల వెంట నీటి మునిగిన పంట పొలాలను పరిశీలించారు. పంట నష్టంపై జెడిఎ ఉమామహేశ్వరమ్మ, ఎడిపి వరప్రసాద్‌తో చర్చించారు.
జెసి సమీక్ష...
బండి ఆత్మకూరు : తుఫానుపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని జెసి రామసుందర్‌ రెడ్డి ఆదేశించారు. ఆత్మకూరు ఎంపిడిఒ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. పంట దెబ్బతిన్న రైతులను గుర్తించాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. సమావేశంలో ఇంచార్జి తహశీల్దార్‌ రవీంద్ర ప్రసాద్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ నరసింహ, ఈవోఆర్డీ శ్రీనివాసులు పాల్గొన్నారు. మండలంలో కెసి కెనాల్‌, తెలుగు గంగ ఆయకట్టు కింద రైతులు సాగు చేసిన వరి పొలాలు తుఫాను దెబ్బతిన్నాయని రైతులు వాపోతున్నారు.