Nov 18,2020 21:23

న్యూఢిల్లీ : ప్రస్తుతమున్న ఇండియన్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌ చట్టం-1947ను రద్దు చేసి, కొత్త చట్టాన్ని తేవాలని కేంద్రం భావిస్తోంది. ఇప్పటికే మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాను మార్చేసింది. ఆయుష్‌ విద్యను నియంత్రించే సిసిఐఎం లోనూ పలు మార్పులు చేసింది. ఇక ఇండియన్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌నూ రద్దు చేసి కొత్తగా జాతీయ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. బిల్లు ముసాయిదాను నవంబర్‌ 5న ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఈ ముసాయిదాపై సందేహాలు, వ్యాఖ్యలు, సిఫార్సులను డిసెంబర్‌ ఆరులోగా పంపాలని ఆ నోటిఫికేషన్‌లో కోరింది. నర్సులు, ప్రసూతి సేవలు అందించే వారు (మిడ్‌వైఫరీ) విద్య, సేవల ప్రమాణాల నియంత్రణ, నిర్వహణ, సంస్థల అంచనా, కేంద్ర, రాష్ట్ర వ్యాప్తంగా వారి సేవలను మెరుగుపరిచేందుకు ఒక వ్యవస్థను రూపొందించడమే ఈ నూతన చట్టం లక్ష్యమని కేంద్రం పేర్కొంటోంది.

నర్సింగ్‌ కౌన్సిల్‌పై వేటు! నర్సుల ప్రయోజనాలకు నష్టం
ఈ బిల్లు వల్ల నర్స్‌లంతా కేంద్రం అజమాయిషీలోకి వెళ్లేలా మునుపటి చట్టంలోని నిబంధనలను మార్చడం తప్ప నర్సులకు ప్రయోజనమేమీ లేదని నిపుణులు అంటున్నారు. బిల్లు ముసాయిదాను రూపొందించే సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న నర్సింగ్‌ నిపుణులు, వైద్య రంగానికి చెందిన ప్రముఖుల అభిప్రాయాలను ఆరోగ్య శాఖ పట్టించుకోలేదని అఖిల భారత ప్రభుత్వ నర్సుల సమాఖ్య (ఎఐజిఎస్‌ఎఫ్‌) ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇదే అంశాలను ప్రస్తావిస్తూ.. నవంబర్‌ 11న ఎఐజిఎన్‌ఎఫ్‌ ప్రధాన కార్యదర్శి జికె. ఖురానా భారత రాష్ట్రపతికి ఒక లేఖను రాశారు. కరోనా విపత్తు నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న 95 శాతం మంది నర్సులు వివిధ ఆస్పత్రుల్లో, ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్నారు. దీంతో విద్యా సంస్థల్లో కేవలం 5 శాతం మంది నిపుణులు మాత్రమే ఉన్నారు. ఈ నూతన చట్టాలను రూపొందించే సమయంలో 95 శాతం మంది అభిప్రాయాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాలు, నర్సింగ్‌ విద్యా సంస్థలు ఒకే సంస్థ కిందకి వచ్చినప్పటికీ.. వాస్తవంగా ఇబ్బందులు ఎదుర్కొనేవారిని కాకుండా కేవలం విద్యా సంస్థలో ఉన్న నిపుణులను మాత్రమే సంప్రదించడం సరికాదని ఎఐజిఎన్‌ఎఫ్‌ పేర్కొంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలో స్వయం ప్రతిపత్తి కలిగిన ఇండియన్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌ (ఐఎన్‌సి)ని రద్దు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

నర్సింగ్‌ కౌన్సిల్‌పై వేటు! నర్సుల ప్రయోజనాలకు నష్టం
ఐఎన్‌సిని నేషనల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీ కమిషన్‌ (ఎన్‌ఎన్‌ఎంసి) ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. క్యాబినెట్‌ కార్యదర్శి అధ్యక్షత వహించే సెర్చ్‌ కమ్‌ సెలక్షన్‌ కమిటీ చేసిన సిఫారసుల ఆధారంగా సభ్యులను ఎన్నుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన వారే సభ్యులుగా ఉంటారని పేర్కొంది. సెర్చ్‌ కమిటీలో సభ్యులుగా ఉండే ఐదుగురు నిపుణులను కేంద్ర ప్రభుత్వమే నామినేట్‌ చేస్తుంది. సెర్చ్‌ కమిటీ మరో 40 మంది సభ్యులను ఎన్‌ఎన్‌ఎంసికి నామినేట్‌ చేస్తుంది. అంటే సభ్యులను ఎన్నుకోకుండా కేంద్రం నామినేట్‌ చేసేందుకు ఈ నూతన చట్టం అవకాశం కల్పిస్తుంది. దీంతో ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వెళ్లిపోతుంది. అంటే రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉండదని విమర్శకుల వాదన. కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న ఈ కొత్త చట్టానికి వ్యతిరేకంగా ఎఐజిఎన్‌ఎఫ్‌ దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. నెలరోజుల్లోగా తమ డిమాండ్లు తీర్చకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించింది.