Apr 08,2021 16:51

నోయిడా : దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ కొనసాగుతున్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. రోజురోజుకూ కేసులు అత్యధికంగా నమోదువుతుండటంతో ఆంక్షల దిశగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే మహరాష్ట్ర, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌తో పాటు పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌లు, నైట్‌ కర్ఫ్యూలు విధించాయి. కరోనా కట్టడికి కఠిన ఆంక్షలు విధించాయి. తమిళనాడు కూడా ఈ నెల 10 నుంచి 11 రోజుల పాటు కరోనా నిషేధాజ్ఞలకు పూనుకుంది. తాజాగా ఢిల్లీకి పొరుగున ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం కూడా కరోనా ఆంక్షలను విధించేందుకు నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలోని నోయిడాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో ఆ ప్రాంతంలో నైట్‌ కర్ఫ్యూ విధించింది. రాత్రి 10 గంటల నుండి తెల్లవారుజామున 5 గంటలకు వరకు కర్ఫ్యూ ఉంటుంది. ఈరోజు నుంచి కర్ఫ్యూ ఏప్రిల్‌ 17 వరకు కొనసాగుతుంది.