Nov 29,2020 22:12

విజయవాడ పటమటలో నండూరికి నివాళులర్పిస్తున్న సిఐటియు నేతలు

ప్రజాశక్తి - విజయవాడ
కార్మికోద్యమ నాయకులు నండూరి ప్రసాదరావు స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటం చేయాలని పలువురు వక్తలు అన్నారు. స్థానిక దుర్గాపురం బిఆర్‌టిఎస్‌ రోడ్డులోని సిఐటియు నగర కార్యాలయంలో నండూరి ప్రసాదరావు 19వ వర్ధంతి కార్యక్రమం ఆదివారం జరిగింది. ముందుగా ప్రసాదరావు చిత్రపటానికి నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా సిఐటియు రాష్ట్ర నేతలు పి.అజరుకుమార్‌, కె.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ నండూరి ప్రసాదరావు ఏడు దశాబ్దాల పాటు కార్మిక, ప్రజా ఉద్యమాలతో మమేకమైన నాయకుడని పేర్కొన్నారు. స్వాతంత్య్ర సమరయోధునిగా, తెలంగాణా సాయుధ పోరాట వారసుడిగా, పార్లమెంట్‌ సభ్యుడిగా, శాసన సభ్యుడిగా ఆయన ప్రజలకు విశేష సేవలు అందించారన్నారు. రైతాంగ, వ్యవసాయ కార్మిక పోరాటాలకు నాయకత్వం వహించడమే కాకుండా సిఐటియు రాష్ట్ర వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా ప్రసాదరావు పని చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా కార్మిక, కర్షకులు ఒక్కటై ఉద్యమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కోశాధికారి ఎవి నాగశ్వరరావు, సిఐటియు నగర అధ్యక్ష కార్యదర్శులు కె.దుర్గారావు, ఎంవి సుధాకర్‌, నాయకులు కోటేశ్వరరావు, పి.కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
విజయవాడ అర్బన్‌ : కార్మికుల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన వ్యక్తి నండూరి ప్రసాదరావు అని పలువురు వక్తలు అన్నారు. పటమటలంకలోని సీపీఎం కార్యాలయంలో ఆదివారం నండూరి ప్రసాదరావు 19వ వర్థంతి సభ జరిగింది. నండూరి ప్రసాదరావు చిత్రపటానికి సిఐటియు జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావు, సిఐటియు తూర్పు నగర అధ్యక్షులు బోజెడ్ల నాగేశ్వరరావు, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు డివి కృష్ణ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో కార్మిక ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో ఆయన విశేష కృషి చేశారని తెలిపారు.
తిరువూరు : కమ్యూనిస్టు యోధుడు, సిఐటియు ఆంధ్రప్రదేశ్‌ పూర్వ ప్రధాన కార్యదర్శి నండూరి ప్రసాదరావు ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని సిఐటియు పశ్చిమ కృష్ణా పశ్చిమ కమిటీ ప్రధాన కార్యదర్శి ఎన్‌.సిహెచ్‌.శ్రీనివాస్‌ అన్నారు. నండూరి ప్రసాదరావు వర్ధంతి సభ తిరువూరులోని గాజుల మాలపల్లిలో ఆదివారం సిఐటియు మండల అధ్యక్షుడు ఆకుల రవి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా నండూరి చిత్ర పటానికి పూలమలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ రైతు సంఘం, సిఐటియు నాయకులుగా పనిచేసిన ఆయన రైతాంగాన్ని, కార్మికులను సంఘటితం చేసి వారి సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించారన్నారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘం మండల కార్యదర్శి ఎం.ప్రభాకరరావు, సిఐటియు పశ్చిమ కష్ణా కమిటీ ఉపాధ్యక్షురాలు ఎన్‌.సిహెచ్‌.సుప్రజ, సిఐటియు సీనియర్‌ నాయకుడు ఎస్‌.వి.భద్రం, మండల కార్యదర్శి బి.వెంకటేశ్వరావు, బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు కె.రామారావు, అప్పారావు, చంద్రయ్య, రాంబాబు, శ్రీనివాసరావు, అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు భవాని తదితరులు పాల్గొన్నారు.