Nov 29,2020 11:39

''చుక్కల్లే తోచావే.. వెన్నెల్లే కాచావే.. ఏడ బోయావే.. ఇన్నివేల చుక్కల్లో నిన్ను నేనెతికానే...'' అనే పాట వినగానే నటి అర్చన కళ్లల్లో మెదులుతారు. ఆమె ఇప్పటి తరానికి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ నిన్నటి తరానికి సుపరిచితురాలే. రంగు తక్కువనీ రిజక్ట్‌ కాబడినా.. బాలు మహేంద్ర దర్శకత్వంలో నటించిన ఆమె ప్రతిభ జాతీయస్థాయిలో నిలిచింది. 25 ఏళ్ల తర్వాత.. ఈ మధ్య ఒక టీవి ఇంటర్వ్యూలో తళుక్కున మెరిసారామె. 'నల్లని అమ్మాయిలు కెమేరా మెన్‌లకు ఓ గొప్ప అవకాశం.. ఆ షేడ్‌ ఎలా కావాలంటే అలా వాడుకునే వీలుంటుంది వాళ్లకి' అంటున్నారు అర్చన. నిజంగా ఆమె ఎలాంటి మేకప్‌ లేకుండా నటించి వరుసగా రెండు జాతీయ స్థాయిలో 'ఉత్తమనటి' అవార్డులు పొందారు. సహజత్వం + ప్రతిభ అర్చన అనేది అలా సినీపరిశ్రమలో నిలిచిపోయింది.
నటి అర్చన గురించి చెప్పాలంటే 'నిరీక్షణ' సినిమా చూడాల్సిందే. హావభావాలన్నీ మొహంలోనే పలికించగల నటి. నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేయగల నైపుణ్యం ఆమె సొంతం. బాలు మహేంద్ర దర్శకత్వంలో 1982లో వచ్చిన నిరీక్షణ సినిమాలో పట్నం కుర్రాడిని ప్రేమించే గిరిజన యువతి పాత్రలో ఆమె ఒదిగిపోయారు. ప్రేమించిన యువకుని కోసం ఆమె పడే నిరీక్షణ ప్రేక్షకులకు మదిలో నిలిచిపోయింది. తాను ప్రేమించిన ప్రియుడు ఓ తప్పుడు కేసులో ఇరుక్కుని, జైలు పాలవుతాడు. అయితే తన ప్రియుని కోసం అర్చన పడే తపన ఈ మూవీలో అద్భుతంగా ప్రదర్శించారు. కొందరి హీరోయిన్‌ల్లా ఆమె గ్లామర్‌ని నమ్ముకోలేదు. సహజత్వానికి అనుగుణంగా నటించి, మెప్పించారు. కాబట్టే ఆమె ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు.
ఈ మధ్య ఒక టెలివిజన్‌ షోలో ఇచ్చిన ఇంటర్వ్యూలో తన శరీరఛాయ గురించి ఇలా చెప్పుకొచ్చారామె. 'మనం భారతీయులం, ద్రవిడులం.. మన ఐడెంటిటీయే డార్క్‌.. అందుకే నేనెప్పుడూ రంగును మైనస్‌ అనుకోలేదు. తెలుపురంగున్న అమ్మాయి మంచి నటి అవుతుందేమో! అదే ఛాయ తక్కువ అమ్మాయి కెమెరా ముందుకు వస్తే కెమెరామెన్‌లకు లడ్డూలు దొరికినట్టే ఉంటుంది. వాళ్లు ఆ డార్క్‌ని ఎలా కావాలంటే అలా మలచుకోవచ్చు. గొప్ప నటులందరూ ఛాయ తక్కువవారే. నా రంగు విషయంలో నేను చాలా గర్వపడుతున్నా' అంటూ చెప్పుకొచ్చారామె.
నల్లనివాళ్లు సినిమాల్లో రాణించరని ఇప్పటికీ కొందరు వాదిస్తూ ఉంటారు. ఆ వాదనకు అర్థమే లేదు. తెలుపుకంటే నలుపే మిన్న అంటూ ఆమె సినిమాల్లో రాణించి జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా ఎదిగారు. అంతేనా 'సంధ్యారాగం' అనే సినిమాలో తొమ్మిది నెలల గర్భిణిగా సినిమా అంతటా కనిపించారామె. అలాంటి సాహసం చేయడం తనకిష్టమంటారు అర్చన. ఇలాంటి పాత్ర ఇష్టంగానే చేశానని చెప్తారామె. నిజానికి అర్చనకు వచ్చిన అవకాశాలు, ఉన్న ప్రతిభను బట్టి ఎన్నో సినిమాల్లో నటించి ఉండాల్సింది. కానీ కథకు చాలా ప్రాధాన్యతనిస్తూ.. ముందు నుంచి సెలెక్టివ్‌గానే సినిమాలు చేశారు. అందుకే ఆమె ఖాతాలో తక్కువ సినిమాలే ఉంటాయి. అయినా అందులో రెండు నేషనల్‌ అవార్డ్స్‌ ఉన్నాయి. ఇది చాలదూ అర్చన ప్రతిభేంటో తెలియడానికి. తెలుగులో నటిస్తూనే తమిళ, మళయాళ భాషల్లో స్టార్‌ హీరోలతో నటించారామె.


అర్చన అసలు పేరు - సుధ
జన్మస్థలం - విజయవాడ, కృష్ణాజిల్లా, ఆంధ్రప్రదేశ్‌
వృత్తి - నటి
మొదటి సినిమా - 1973 హిందీలో యాదంకి భారత్‌ (బాలనటిగా పరిచయం అయ్యారు)
పేరుతెచ్చిన సినిమా - నిరీక్షణ
జాతీయ ఉత్తమనటి అవార్డులు - వీడు (1987), దాసి (1988), నంది స్పెషల్‌ జ్యూరీ అవార్డు.
నటించిన భాషలు - తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లీషు, బెంగాళీ.
యాక్టింగ్‌ కోర్స్‌ - తమిళనాడు ఇన్సిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ టెక్నాలజీలో యాక్టింగ్‌ కోర్స్‌లో గ్రాడ్యుయేట్‌
తెలుగు సినిమాలు - లేడీస్‌ టైలర్‌, ఉక్కు సంకెళ్లు, మట్టి మనుషులు, భారత్‌ బంద్‌, దాసి, చక్రవ్యూహం, పచ్చతోరణం, పోలీస్‌ వెంకటస్వామి