
నల్లచట్టాలను రద్దు చేయాలని జిఒ కాపీలు దగ్ధం
ప్రజాశక్తి-నెల్లూరు:రూరల్ మహిళా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక ఆర్టిసి బస్టాండ్ ఎదుట మానవహారం నిర్మించి కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ,రైతులకు మద్దతుగా నినాదాలు చేశారు. రైతుల వ్యతిరేక చట్టాలను రద్దు చేసి, కనీస మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. అనంతరం విఆర్సి సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. వ్యవసాయ చట్టాలకు సంబంధించి కేంద్రం విడుదల చేసిన జివో కాగితాలను మహిళలు దగ్దం చేసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో ముందుగా ఐద్వా రూరల్ కార్యదర్శి ఎస్కె షాహినా బేగం, ఐద్వా రూరల్ అధ్యక్షురాలు ఎస్ వరలక్ష్మి, సీనియర్ నాయకురాలు అరిగెల రమమ్మ, షేక్ షంషాద్, రూబియా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ చట్టాలను రద్దు చేసి అన్నదాతల ఆందోళనలు విరమింపచేయాలన్నారు. కార్యక్రమంలో ఐద్వా కార్యకర్తలు,మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.