Dec 01,2021 09:57

వాషింగ్టన్‌ : అత్యధికంగా అమ్ముడైన నవల 'ద లవ్లీ బోన్స్‌' రచయిత ఎలైస్‌ సెబోల్డ్‌ నల్ల జాతీయునికి క్షమాపణలు తెలిపారు. 1981లో ఎలైస్‌పై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఆంథోనీ బ్రాడ్‌ వాటర్‌ (61) అనే నల్ల జాతీయునికి 16 ఏళ్ల జైలుశిక్షను విధించింది. అయితే గత వారం అతని శిక్షను రద్దు చేసింది. కేసు విచారణ సమయంలో ప్రాసిక్యూషన్‌లో తీవ్రమైన లోపాలు జరిగినట్లు ఈ కేసు పున:పరిశీలనలో కోర్టు పేర్కొంది. దీంతో ఆంథోనీ బ్రాడ్‌ వాటర్‌కి అనుభవించిన శిక్షకి తాను చింతిస్తున్నానని అన్నారు. సెబోల్డ్‌ న్యూయార్క్‌ రాష్ట్రంలోని సిరక్యూస్‌ యూనివర్శిటీ మొదటి ఏడాది విద్యార్థినిగా ఉన్నప్పుడు 18 ఏళ్ల వయసులో తనపై జరిగిన దాడిని 'లక్కీ' అనే పుస్తకంలో వివరించారు. మీరు ఆనందంగా గడపగలిగిన జీవితాన్ని అన్యాయంగా మీనుండి దోచుకున్నందుకు తనను క్షమించాలని అన్నారు. క్షమాపణలు చెప్పినా.. దాన్ని మార్చలేమని తనకు తెలుసునని సెబోల్డ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 1982లో అత్యాచారం కేసులో బ్రాడ్‌వాటర్‌కి 16 ఏళ్ల శిక్ష పడింది. అతను విడుదలైన కొద్ది కాలానికి 1999లో లక్కీ అనే పుస్తకం విడుదలైంది. 40 ఏళ్ల క్రితం లోపభూయిష్ట న్యాయవ్యవస్థ కారణంగా మరో నల్ల జాతీయునికి శిక్ష పడిందని, అతనికి జరిగిన అన్యాయానికి తాను ఇప్పటికీ పశ్చాత్తాప పడుతున్నానని అన్నారు. 1982లో తన లక్ష్యం న్యాయం జరగాలని మాత్రమే సెబోల్డ్‌ అన్నారు.  కాగా, సెబోల్డ్‌ పోలీసులకు అత్యాచారం కేసులో పోలీసులకు ఫిర్యాదు చేసిన ఐదు నెలల అనంతరం  నేరం జరిగిన సమయంలో అదే వీధిలో వెళ్లాడంటూ  బ్రాడ్‌ వాటర్‌ని నిందితునిగా పేర్కొంటూ పోలీసులు అరెస్ట్‌చేశారు. అనంతరం అతనే దోషిగా  పోలీసులు నిర్థారించారు.