Feb 12,2021 14:02

న్యూఢిల్లీ : ట్విట్టర్‌, ఇతర సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్న నకిలీ వార్తలు, ద్వేషపూరిత సందేశాలు, రెచ్చగొట్టే సమాచారాలపై తనిఖీ చేసేందుకు ఒక యంత్రాంగం ఉండాలన్న పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని ట్విట్టర్‌తో పాటు కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ట్విట్టర్‌లో నకిలీ ఖాతాల ద్వారా వ్యాప్తి చేస్తున్న ద్వేషపూరిత సందేశాలు, నకిలీ ప్రకటనలను తనిఖీ చేయడానికి ఒక యంత్రాంగం ఉండాలని బిజెపి నేత వినీత్‌ గోయెంకా గత ఏడాది మేలో పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రముఖుల పేరుతో ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ వంటి సోషల్‌ మీడియాల్లో వందలాది నకిలీ ఖాతాలున్నాయని..వాటిని నియంత్రించాలని కోరినప్పటికీ..ఎటువంటి చర్యలు తీసుకోలేదని పిటిషన్‌దారు పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు సోషల్‌ మీడియా ఖాతాలను ప్రత్యర్థుల ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు వినియోగించాయని, ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఎక్కువ జరిగిందని అన్నారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు వివరణ కోరుతూ ట్విట్టర్‌, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. నూతన వ్యవసాయ చట్టాలపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న 1,100 పైగా ఖాతాలను నిలిపి వేయాలని ట్విట్టర్‌పై కేంద్రం ఒత్తిడి తెచ్చిన సమయంలో పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించడం గమనార్హం.