Nov 30,2020 22:21

వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

ఏపి రైతుసంఘం
ప్రజాశక్తి - నంద్యాల:
 నివర్‌ తుఫాన్‌తో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని కోరుతూ సోమవారం ఎపి రైతుసంఘం ఆధ్వర్యంలో ఎంబిఎ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాజశేఖర్‌, నంద్యాల డివిజన్‌ కార్యదర్శి పుల్లా నరసింహ మాట్లాడుతూ గత వారం రోజులుగా కురిసిన వర్షాలతో రైతులకు తీవ్రంగా నష్టం జరిగిందన్నారు. సుమారు 2000 హెక్టార్లలో వరి, మిరప, పత్తి ఇతర పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని అన్నారు. ఎకరాకు రూ.30 వేల నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. నష్టపోయిన వారిలో అధికంగా కౌలు రైతులు ఉన్నారని, వీరికి నేరుగా వారి అకౌంట్లో నష్టపరిహారం జమ చేయాలని కోరారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కోనుగోలు చేయాలని అన్నారు. నాయకులు శివారెడ్డి, సురేష్‌, హసన్‌, ఏరియా, సుబ్రహ్మణ్యం, రామయ్య పాల్గొన్నారు.
బండి ఆత్మకూరు : బండిఆత్మకూరు మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండలంలోని కెసి కెనాల్‌, తెలుగుగంగ ఆయకట్టు రైతులు తీవ్రంగా నష్టపోయారని రైతు సంఘం నాయకులు సర్వారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రామచంద్రుడు, డేవిడ్‌లు పేర్కొన్నారు. మండలంలోని పంట పొలాలను పరిశీలించారు. వారు మాట్లాడుతూ రైతులను ఆదుకోవాలని ఈ నెల 2న పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడుతున్నామని, రైతులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సుబ్బరాయుడు, సుబ్బారెడ్డి, రాముడు పాల్గొన్నారు.
నష్టపోయిన రైతులను ఆదుకోవాలి : టిడిపి
చాగలమర్రి :
నివర్‌ తుఫాన్‌ వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని టిడిపి నియోజకవర్గ నాయకులు భూమాజగత్‌ విఖ్యాత రెడ్డి డిమాండ్‌ చేశారు. మండలంలోని మద్దూరు, బ్రాహ్మణపల్లె గ్రామాల్లో పంటలను ఆయన పరిశీలించారు. మాజీ మండల అధ్యక్షుడు రఘునాథ్‌ రెడ్డి, అన్సర్‌ భాషా, నరసింహారెడ్డి, కొలిమి హుస్సేన్‌వల్లి, ఖాదర్‌ భాషా, ముల్లా కాబుల్‌ మొహిద్దిన్‌, కొలిమి హుస్సేన్‌ భాషా, గురు శేఖర్‌ రెడ్డి పాల్గొన్నారు.
నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలి : అఖిల ప్రియ
దొర్నిపాడు: నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ డిమాండ్‌ చేశారు. అమ్మిరెడ్డి నగరం, అర్జునాపురం గ్రామాల్లో ఆమె పర్యటించి రైతులతో మాట్లాడారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
950 హెక్టార్లలో దెబ్బతిన్న వరి : ఎఒ
మండలంలో 950 హెక్టార్లలో వరి, 430 హెక్టార్లలో శనగ పంట దెబ్బతిన్నాయని వ్యవసాయాధికారి కళ్యాణ్‌ కుమార్‌ తెలిపారు. కొండాపురం గ్రామంలో పంటనష్టం జరిగిన భూమి యజమానుల పేర్లను నమోదు చేశారు. వ్యవసాయ విస్తారణాధికారి సుబ్బయ్య పాల్గొన్నారు.
నష్టపోయిన రైతులందరి పేర్లు నమోదు చేయాలి : వైసిపి
శిరివెళ్ల :
మండలంలోని ప్రతి గ్రామంలో నివర్‌ తుఫాన్‌ వల్ల నష్టపోయిన రైతులందరి పేర్లు జాబితాలో నమోదు చేసి, ప్రభుత్వం నుంచి పరిహారం వచ్చేలా చర్యలు తీసుకోవాలని వైసిపి యూత్‌ నాయకులు, ఎంపిటిసి నాయక్‌ మహమ్మద్‌ వసీం పేర్కొన్నారు. రైతు భరోసా కేంద్రంలో వ్యవసాయ అధికారులతో మాట్లాడారు. క్రాప్‌ బుకింగ్‌ కాని పంట పొలాల సమస్యను తీసుకువచ్చారు. సమస్యను ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌ రెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.