
పాట్నా : సిఎం నితీష్‌కుమార్ మంగళవారం మంత్రులకు శాఖల కేటాయింపు చేశారు. అయితే కీలకమైన హోంశాఖను ఆయన తన వద్దనే ఉంచుకున్నారు. గత ప్రభుత్వంలో కూడా నితీష్ హోంశాఖను తన వద్దనే ఉంచుకున్నారు. శాఖల కేటాయింపునకు సంబంధించి రాజ్‌భవన్ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్యూటీ సిఎం తార్ కిషోర్‌కు ఆర్థిక శాఖతో పాటు పర్యావరణ, అటవీ, ఐటి శాఖలను కేటాయించారు. ఇవన్నీ కూడా గత ప్రభుత్వ హయాంలో సుశీల్‌కుమార్ నిర్వహించిన శాఖలే కావడం గమనార్హం. రెండో డిప్యూటీ సిఎం రేణుదేవికి పంచాయతీరాజ్ శాఖ ఇచ్చారు. గత అసెంబ్లీలో స్పీకర్‌గా చేసిన జెడియు నేత విజరుకుమార్ చౌదరికి పార్లమెంటరీ వ్యవహారాల శాఖను కేటాయించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్‌డిఎ కూటమి స్వల్ప మెజార్టీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. సోమవారం సిఎంగా నితీష్‌కుమార్ ప్రమాణస్వీకారం చేయగా, ఆయనతో పాటు మరో 14 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు.
23 నుంచి బీహార్ అసెంబ్లీ సమావేశాలు
ఈనెల 23 నుంచి ఐదు రోజుల పాటు బీహార్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నితీష్‌కుమార్ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నూతనంగా ఏర్పాటైన మంత్రిమండలి ఆమోదం తెలిపింది. బీహార్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మంగళవారం ఉదయం తొలిసారిగా కేబినెట్ సమావేశమైంది. 17 అసెంబ్లీ తొలి సెషన్‌ను నిర్వహణకు సంబంధించి పార్లమెంటరీ వ్యవహారాల విభాగం చేసిన ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపిందని బిజెపికి చెందిన మంత్రి అమరేంద్ర ప్రతాప్ సింగ్ పేర్కొన్నారు. ఇటీవలి ఎన్నికల్లో శాసనసభకు ఎన్నికైన సభ్యులు ఈ సమావేశాల్లోనే ప్రమాణస్వీకారం చేయనున్నారు. అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక కూడా జరగనుంది.